Gambhir - Dhoni: నా కెప్టెన్‌ను కలవడం సంతోషంగా ఉంది: గంభీర్‌

గతరాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, మ్యాచ్‌ అనంతరం లఖ్‌నవూ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌...

Updated : 01 Apr 2022 11:24 IST

ముంబయి: గతరాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, మ్యాచ్‌ అనంతరం లఖ్‌నవూ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ తన మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని కలిశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ధోనీ, గంభీర్‌ ఒకప్పుడు టీమ్‌ఇండియాకు ఎన్నో విజయాలు అందించారు. ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరూ చెలరేగడంతో భారత్‌ చారిత్రక విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు కలుసుకోవడం ఆసక్తిగా మారింది. దీంతో అభిమానులు సైతం సంబరపడుతున్నారు.

ఇక టీ20లీగ్‌లోనూ కోల్‌కతా కెప్టెన్‌గా గంభీర్‌, చెన్నై సారథిగా ధోనీ పలుమార్లు మైదానంలో ప్రత్యర్థులుగా తలపడిన సంగతి తెలిసిందే. వీరిమధ్య వైరం కూడా స్నేహపూర్వకంగానే సాగింది. ఒకానొక దశలో ధోనీ ఈ టోర్నీలో హ్యాట్రిక్‌ విజయాలు సాధించకుండా అడ్డుకుంది కూడా గంభీరే. 2010, 2011లో వరుసగా రెండు సీజన్లు విజేతగా నిలిచిన చెన్నైకి 2012 ఫైనల్లో కోల్‌కతా షాకిచ్చింది. అప్పుడు గంభీర్‌ సారథ్యంలో ఆ జట్టు తొలిసారి కప్పు కైవసం చేసుకుంది. తర్వాత 2014లోనూ కోల్‌కతా మరోసారి టైటిల్‌ విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు గంభీర్‌ ఆటగాడిగా లేకపోయినా లఖ్‌నవూ మెంటార్‌గా కొత్త బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే చెన్నైతో మ్యాచ్‌ అనంతరం ధోనీని కలిసి అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని