Gautam Gambhir: ‘రోహిత్‌ శర్మ విషయంలో అతడు ఊహించిందే జరిగింది’.. గంభీర్‌ చిన్ననాటి కోచ్‌

భారత జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ నియమితుడయ్యాడు. ఈ నియామకంపై స్పందించిన గంభీర్‌ చిన్ననాటి కోచ్‌ ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

Updated : 10 Jul 2024 15:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అందరూ ఊహించినట్లుగానే మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈనేపథ్యంలోనే గంభీర్‌ చిన్ననాటి కోచ్‌ సంజయ్‌ భరద్వాజ్‌ స్పందించారు. తన శిష్యుడు ప్రధాన కోచ్‌గా ఎంపిక కావడంపై హర్షం వ్యక్తంచేశారు. గౌతమ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘‘గౌతమ్‌ భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికవడం గర్వంగా ఉంది. ప్రతీ ఆటగాడిని అతడు బాగా అర్థం చేసుకోగలడు. వారిలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసే సామర్థ్యం ఉంది. మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా  జట్టును తయారుచేయగల సత్తా ఉంది. విజయం సాధించడాన్ని ఆటగాళ్లకు ఒక అలవాటుగా మార్చగలడు. కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న గంభీర్‌ భారత్‌ ప్రతిష్ఠను ఉన్నత శిఖరాలకు తీసుకెళతాడు. నియమ, నిబద్ధతలతో శ్రమిస్తాడని ఆశిస్తున్నా. వన్డే ప్రపంచకప్‌ కోసం భారత్‌ 13 ఏళ్లుగా నిరీక్షిస్తోంది. గంభీర్‌ ట్రైనింగ్‌తో జట్టు కప్‌ను కైవసం చేసుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు’’ అని భరద్వాజ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మైదానంలోకి దిగితే..

‘‘గౌతమ్‌ గంభీర్‌ పదేళ్ల వయసు నుంచి ఆటలో సవాళ్లను స్వీకరించాడు. ఎన్ని సమస్యలొచ్చినా గెలుపు పైనే దృష్టి పెట్టేవాడు. విజయం కోసమే ఆడేవాడు. మైదానంలోకి దిగితే అతడికి గెలవడమే లక్ష్యం. ఓటమి గురించి అసలు ఆలోచించడు. ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో భారత్‌ 2011 వన్డే ప్రపంచకప్‌ నెగ్గడంలో గంభీర్‌ కీలక పాత్ర పోషించాడు. ఆటగాడి ప్రదర్శనను ముందుగానే అంచనా వేయగలడు. రోహిత్‌ శర్మ విషయంలో ఇది రుజువైంది’’ అని పేర్కొన్నారు.

అదే నిజమైంది..

‘‘గతంలో రోహిత్‌శర్మ సరిగా పరుగులు చేయలేని సమయంలో గంభీర్‌ అతడిపై విశ్వాసం ఉంచాడు. భవిష్యత్తులో రోహిత్‌ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడని.. గొప్ప క్రికెటర్‌ అవుతాడని చెప్పాడు. ఇప్పుడు అతడి అంచనాలు నిజమయ్యాయి. ఒక ఆటగాడిలోని ప్రతిభను గుర్తించగలవాడే కోచ్‌గా ఉండాలి. ఆ అర్హతలన్నీ గౌతమ్‌కు ఉన్నాయి’’ అని భరద్వాజ్‌ తెలిపారు. కాగా.. 17 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా రెండో టీ20 వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌ స్థానం నుంచి రిటైర్‌ అయ్యారు. అతడి స్థానంలో గంభీర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది.

అందుకు నువ్వు అర్హుడివి..

గంభీర్‌ ప్రధాన కోచ్‌గా ఎంపిక కావడంపై అతడి సతీమణి నటాషా జైన్‌ స్పందిస్తూ భర్తకు అభినందనలు తెలిపారు. ‘‘ఈ స్థానానికి నువ్వు పూర్తి అర్హుడివి’’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.

* మరోవైపు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గౌతమ్‌కు శుభాకాంక్షలు తెలిపింది. జాతీయ జట్టుకు కోచింగ్‌ ఇవ్వడాన్ని మించిన గొప్ప గౌరవం మరొకటి ఉండదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని