Team India : అతడిని మూడో స్థానంలో ఆడించాలి.. ఆ ఇద్దరు చాలా కీలకం: గంభీర్‌

ఫామ్‌లో ఉన్న ఆటగాడి సేవలను మరింత వినియోగించుకోవాలని, సరైన స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాలని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు...

Published : 01 Sep 2022 14:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఫామ్‌లో ఉన్న ఆటగాడి సేవలను మరింత వినియోగించుకోవాలని, సరైన స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాలని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ సూచించాడు. ప్రస్తుతం మూడో స్థానంలో వస్తున్న విరాట్ కోహ్లీ బదులు మంచి ఫామ్‌తో ఉన్న సూర్యకుమార్‌ను ఆడించాలని సూచించాడు. అలాగే వచ్చే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ మెరుగ్గా రాణించాలంటే ఇద్దరు ఆటగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు. పొట్టి ప్రపంచకప్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య కీలకమవుతారని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఆసియా కప్‌లో హార్దిక్‌ ఆడుతుండగా.. బుమ్రా మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లో పాక్‌పై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పాండ్య ఆకట్టుకున్నాడు. అయితే హాంకాంగ్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. 

ఓ క్రీడా ఛానెల్‌తో గౌతమ్‌ గంభీర్‌ మాట్లాడుతూ.. ‘‘ఏ జట్టుకైనా బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానం కీలకం. టీమ్‌ఇండియా తరఫున ఇప్పుడు విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. అయితే కోహ్లీ కంటే సూర్యకుమార్‌ అయితే బెటర్. ఎందుకంటే సూర్యకుమార్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌లో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడితే.. సూర్య మాత్రం రాణించాడు. అందుకే సూర్యకుమార్‌ ఫామ్‌ను బట్టి మూడో స్థానంలో ఆడించాలి. ఇక సీనియర్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో కూడా ఆడగల సమర్థుడు. అక్కడి పరిస్థితులను ఎదుర్కోగలడు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం సూర్యకుమార్‌ను ప్రపంచకప్‌ వరకు మూడో స్థానంలో ఆడించాలి’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. హాంకాంగ్‌పై నాలుగో స్థానంలో వచ్చిన సూర్యకుమార్‌ (68*) సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. 

బుమ్రా, హార్దిక్‌ చాలా కీలకం

టీ20 ప్రపంచకప్‌లో భారత విజయావకాశాలను ప్రభావితం చేయగలిగే ఆటగాళ్లలో బుమ్రా, హార్దిక్‌ కీలకమన్నాడు. అందుకే వారిద్దరిని జాగ్రత్తగా ఉంచాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పై ఉందన్నాడు. ‘‘బుమ్రా, హార్దిక్‌ కీ ప్లేయర్లు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్‌ చేయగలరు. హార్దిక్‌ ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్‌. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ 140 కి.మీ వేగంతో నిలకడగా బంతులను సంధిస్తాడు. ఇంతకంటే ఒక ఆల్‌రౌండర్‌ నుంచి ఏమి ఆశించగలం. హార్దిక్‌ మ్యాచ్‌ విన్నర్.. ఎక్స్‌-ఫ్యాక్టర్‌.. ఎలా పిలిచినా అతడొక కీలక ఆటగాడు అని మాత్రం చెప్పగలను. అందుకే హార్దిక్‌తోపాటు బుమ్రాను గాయాల నుంచి కాపాడుకోవాలి. ప్రపంచకప్‌ను గెలవాలని భారత్‌ అనుకుంటే మాత్రం వీరిద్దరిని మంచి ఫామ్‌లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది’’ అని తన అభిప్రాయాలను వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని