Gautam Gambhir: క్రికెట్‌లో ‘హీరో ఆరాధన’ వల్లే ఇలాంటి సమస్యలు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే భారత మాజీ ఓపెనర్‌ గంభీర్‌.. ఈసారి క్రికెట్‌లో ‘హీరో ఆరాధన’ గురించి మాట్లాడాడు. ఒకరిని ఆరాధించడం వల్ల మరొకరి ఘనతలను గుర్తించడంలేదని వ్యాఖ్యానించాడు..........

Published : 20 Sep 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే భారత మాజీ ఓపెనర్‌ గంభీర్‌.. ఈసారి క్రికెట్‌లో ‘హీరో ఆరాధన’ గురించి మాట్లాడాడు. ఒకరిని ఆరాధించడం వల్ల మరొకరి ఘనతలను గుర్తించడంలేదని వ్యాఖ్యానించాడు. ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై విరాట్‌ కోహ్లీ, భువనేశ్వర్‌ కుమార్‌ ప్రదర్శనలను ఉదాహరణగా చెప్పడం గమనార్హం.

ఆసియా కప్‌ సూపర్‌-4లో ఓటములతో ఫైనల్‌కు చేరుకోలేకపోయిన టీమ్‌ఇండియా.. అఫ్గాన్‌తో జరిగిన  మ్యాచ్‌లో చెలరేగింది. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 1000 రోజుల తర్వాత మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సెంచరీ చేశాడు. 122 పరుగులతో టీ20ల్లో మొట్టమొదటి శతకం నమోదు చేశాడు. దీంతో ప్రస్తుత, మాజీ క్రికెటర్లతోపాటు నెటిజన్లు కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. కాగా ఇదే విషయంపై గంభీర్‌ తాజాగా మాట్లాడాడు. కోహ్లీనే అందరూ కొనియాడారని.. ఫలితంగా అద్భుతంగా బౌలింగ్‌ చేసి 5 వికెట్ల ప్రదర్శన చేసిన భువనేశ్వర్‌ కుమార్‌ ఘనతను ఎవరూ గుర్తించలేదన్నాడు. ‘హీరో ఆరాధన’ కారణంగానే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నాడు.

‘కోహ్లీ సెంచరీ కొట్టిన మ్యాచ్‌లోనే మీరట్‌ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన యువకుడు (భువనేశ్వర్‌ కుమార్‌) ఐదు వికెట్లు తీశాడు. కానీ ఎవరూ అతడి గురించి మాట్లాడలేదు. ఇది చాలా దురదృష్టకరం. 4 ఓవర్లు వేసి 5 వికెట్లు తీస్తే అతడిని ఎవరూ గుర్తించలేదు. కానీ కోహ్లీ శతకం చేస్తే దేశమంతటా సంబరాలు చేసుకొన్నారు. హీరో ఆరాధన నుంచి బయటపడాలి. హీరోలుగా ఆరాధించడం మానేయాలి అది క్రికెట్‌ అయినా, రాజకీయాలైనా. ఆటగాళ్లను కాకుండా జట్టు మొత్తాన్ని అభిమానించాలి’ అని ఓ వార్తాసంస్థ అడిగిన ప్రశ్నకు గంభీర్‌ ఈ విధంగా సమాధానమిచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని