Fabiflu: ఉచితంగా పంచాడని గంభీర్‌పై నజర్‌

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, లోక్‌సభ సభ్యుడు గౌతమ్‌ గంభీర్‌ (భాజపా) ఫాబి ప్లూ ఔషధాలను ఉచితంగా పంచడం రాజకీయ దుమారం...

Published : 16 May 2021 00:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, లోక్‌సభ సభ్యుడు గౌతమ్‌ గంభీర్‌ (భాజపా) ఫాబి ప్లూ ఔషధాలను ఉచితంగా పంచడం రాజకీయ దుమారం రేపుతోంది. నగరంలో ఔషధాల కొరత ఉంటే అతడికి అవెలా లభ్యమయ్యాయని కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇలా అనధికారికంగా పంచుతున్నందు వల్లే దుకాణాల్లో ఔషధాల కొరత ఏర్పడుతోందా? అని ఆరోపిస్తున్నాయి. కాగా ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, పోలీసులకు అన్ని వివరాలు అందించానని గౌతీ స్పష్టం చేశాడు.

దేశ రాజధాని దిల్లీలో కొవిడ్‌ పరిస్థితి అందరికీ తెలిసిందే. రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రాణవాయువు, ఔషధాలు, పడకల కొరతతో బాధితులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 25న గౌతీ ఓ ట్వీట్‌ చేశాడు. ‘మనుగడ సాగించాలంటే మనమంతా ఒకరికొకరం అండగా నిలవాలి. దిల్లీలో వీలైనంత మందికి ఫాబీ ఫ్లూ అందించనున్నాం. జీజీఎఫ్‌ కార్యాలయంలో రేపు ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ఉచితంగా అందిస్తాం. దయచేసి ఆధార్‌, ప్రిస్క్రెప్సన్‌ తీసుకురండి. ప్రాణవాయువు సిలిండర్లూ అందిస్తాం’ అని పోస్ట్‌ చేశాడు.

గంభీర్‌ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఫాబి ఫ్లూ పంచడాన్ని ఇతర రాజకీయ పక్షాలు విమర్శించాయి. రాష్ట్రంలో ఔషధాల కరవు ఉంటే ఫాబి ఫ్లూను ఎలా పంచుతున్నాడంటూ ప్రశ్నించాయి. ‘ఇలాంటి అనధికార పంపిణీయే ఔషధ దుకాణాల్లో ఫాబీ ఫ్లూ కొరతకు కారణమవుతోందా?’ అని కాంగ్రెస్‌ నేత దుర్గేశ్‌ పాఠక్ ట్వీట్‌ చేశారు. దిల్లీ పోలీసులు సైతం అన్ని ఔషధాలు ఎలా తెచ్చారని ప్రశ్నించారు.

‘ఫాబి ఫ్లూ పంపిణీ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు. దిల్లీ పోలీసులు మమ్మల్ని ప్రశ్నించారు. మేం అన్ని వివరాలను వారికి అందించాం. నా శక్తి మేరకు దిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా’ అని గౌతీ మే 14న ట్వీట్‌ చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని