Sourav Ganguly: బీసీసీఐపైనే దాదా ఆసక్తి.. లీగ్‌ ఛైర్మన్‌ ఆఫర్‌కు నో..!

బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తదుపరి అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ పేరు వినిపిస్తుండగా.. గంగూలీ ఈ పదవిలో కొనసాగేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.

Published : 11 Oct 2022 18:01 IST

దిల్లీ: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ పదవిలో మరింత కాలం కొనసాగేందుకు ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఆసక్తి చూపిస్తున్నారట. ఈ క్రమంలోనే టీ20 లీగ్‌ ఛైర్మన్‌ పదవిని ఆయన తిరస్కరించినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.

బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గతవారం దాదా దిల్లీలోని అనేకమంది పెద్దలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే రెండోసారి బీసీసీఐ పగ్గాలు గంగూలీకి అప్పగించేందుకు వారు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ‘‘గంగూలీకి టీ20 లీగ్‌ ఛైర్మన్‌ పదవిని ఆఫర్‌ చేశాం. అయితే ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. బీసీసీఐకి అధ్యక్షుడిగా ఉన్న తాను ఇప్పుడు అదే సంస్థలోని ఓ సబ్‌ కమిటీకి నాయకత్వం వహించలేనని దాదా చెప్పారు. ప్రస్తుతమున్న పదవిలోనే కొనసాగేందుకు ఆయన ఆసక్తి చూపించారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. లీగ్‌ క్రికెట్‌ ఛైర్మన్‌ పదవిని గంగూలీ నిరాకరించడంతో ఆ బాధ్యతలను అరుణ్‌ ధుమాల్‌కు అప్పగించాలని భావిస్తున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.

ఇక, దాదా స్థానంలో బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్‌ రోజర్‌ బిన్నీ పదవి చేపట్టడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ప్రస్తుత కార్యదర్శి జై షా అదే పదవిలో కొనసాగున్నట్లు తెలుస్తోంది. ఇక బీసీసీఐ ఉపాధ్యక్ష పదవి బరిలో రాజీవ్‌శుక్లా ముందున్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని