Updated : 08 Jul 2021 23:49 IST

Ganguly: వారిని పంపాలా వద్దా అనేది సెలక్టర్ల నిర్ణయం 

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ

కోల్‌కతా: ఇంగ్లాండ్‌ పర్యటనలో గాయపడిన యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ స్థానంలో మరో ఇద్దరిని పంపించాలని అభ్యర్థన వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పందించారు. అది సెలెక్టర్ల నిర్ణయమని స్పష్టం చేశారు. గాయపడిన గిల్‌ స్థానంలో పృథ్వీ షా, దేవ్‌దత్‌ పడిక్కల్‌ను పంపాలని టీమ్‌ఇండియా మేనేజర్‌ గిరిశ్‌ డోంగ్రే గతనెల చివర్లో సెలెక్షన్‌ కమిటికి మెయిల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ చేతన్‌ శర్మ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో అది మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే గురువారం 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న గంగూలీ మీడియాతో ముచ్చటించారు. షా, పడిక్కల్‌ను అక్కడికి పంపడమనేది కమిటీ నిర్ణయమని తేల్చిచెప్పారు.

మరోవైపు పృథ్వీషా, పడిక్కల్‌ ప్రస్తుతం శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా జట్టులో శ్రీలంక పర్యటనలో కొనసాగుతున్నారు. ఈ నెల 13 నుంచి భారత్‌ ఆ జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అలాగే కోహ్లీ నేతృత్వంలోని మరో టీమ్‌ఇండియా ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. అక్కడ ఇప్పటికే గిల్‌ కాకుండా కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, అభిమణ్యు ఈశ్వరన్‌ లాంటి ఓపెనర్లు ఉన్నారు. అలాంటప్పుడు మళ్లీ ఇద్దరిని కొత్తగా ఇంగ్లాండ్‌కు ఎందుకు పంపాలన్నది సెలెక్షన్‌ కమిటీ వాదనగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వారు మౌనంగా ఉన్నారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ ఏడాది కరోనా వైరస్‌ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ను తిరిగి యూఏఈలో నిర్వహిస్తామని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి ఏం జరగదని, తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం టీ20 ప్రపంచకప్‌పై స్పందించిన దాదా.. ఆ మెగా టోర్నీని భారత్‌లో నిర్వహించకపోవడం బాధాకరమే అయినా ఎవరూ ఇలాంటి విపత్తును ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు. ఇవి అనుకోని పరిస్థితులని వివరించారు. గతేడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వైరస్‌ కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిందని, ఇప్పుడు కూడా అలా జరిగితే క్రికెట్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. అందువల్లే ఇక్కడి నుంచి తరలించి యూఏఈలో నిర్వహిస్తున్నట్లు దాదా పేర్కొన్నారు. చివరగా తన ఆరోగ్యం గురించి మాట్లాడిన ఆయన.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని