Gary Kirsten: గ్యారీ కిరిస్టెన్ ‘మాంత్రికుడు’ కాదు.. వెంటనే అద్భుతాలు జరిగిపోవు: పాక్‌ మాజీ క్రికెటర్

లీగ్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిన పాకిస్థాన్‌ జట్టుపై మాజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తాజాగా మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Published : 18 Jun 2024 10:08 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియాను 2011 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిపిన కోచ్‌ గ్యారీ కిరిస్టెన్. అయితే, ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ప్రధాన కోచ్‌గా వచ్చాడు. ఆ జట్టు మాత్రం లీగ్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. కెప్టెన్ బాబర్‌ అజామ్‌తోపాటు టీమ్‌ సభ్యులపై పాక్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకంగా కోచ్‌ కిరిస్టెన్‌ కూడా జట్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా జట్టుపైనా విమర్శలు చేశాడు. 

‘‘పాకిస్థాన్ క్రికెట్‌కు ఇది సిగ్గుచేటు. ఇలాంటిరోజు వస్తుందని ఊహించలేదు. ఇదంతా క్రికెట్‌లో భాగమేనని కొందరు అంటారు. క్రికెటర్ల కెరీర్‌తో ఆడుకుంటే.. ఇలాంటి ఫలితాలే వస్తాయి. పాక్‌ దేశవాళీ క్రికెట్‌లో చాలామంది క్రికెటర్లు టన్నుల కొద్దీ పరుగులు చేసినా.. వారికి జాతీయజట్టు తరఫున ఆడే అవకాశం మాత్రం రాలేదు. అహ్మద్ జమాల్, షానవాజ్‌ దహాని వేచి చూస్తేనే ఉన్నారు. అద్భుతమైన బౌలర్ మహమ్మద్ హస్నైన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. కేవలం బాబర్-రిజ్వాన్‌ మీదనే ఆధారపడినట్లుంది. మన కెప్టెన్‌ జింబాబ్వే, ఐర్లాండ్‌.. ఇలా చిన్న టీమ్‌లపైనే భారీగా పరుగులు చేస్తుంటాడు. అలాంటి క్రికెటర్‌ను విరాట్‌ కోహ్లీతో పోల్చడం దారుణం

వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు కొత్త కోచ్‌ను తీసుకొచ్చారు. భారత్‌ గతంలో వరల్డ్‌ కప్‌ గెలవడంలో గ్యారీ కిరిస్టెన్ కీలక పాత్ర పోషించాడని అతడిని ఎంపిక చేశారు. కొన్ని నెలల్లోనే అది సాధ్యం కాలేదు. అతడేమీ మెజీషియన్‌ కాదు. పాక్‌ క్రికెట్‌లో ప్రతీ దశలోనూ రాజకీయాలు ఎక్కువ. ఇలాంటివాటికి గ్యారీ త్వరగా అలవాటు పడాలి. అప్పుడే తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలడు. యూఎస్‌ఏ పిచ్‌ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్‌ లేకపోవడం దారుణం. వరల్డ్‌ కప్‌ ముందు ఇంగ్లాండ్, ఐర్లాండ్‌కు జట్టును పంపించకుండా.. యూఎస్‌లో ఆడిస్తే బాగుండేది. పొట్టి కప్‌ కోసం ప్రకటించిన జట్టు కూడా చెత్తదే’’ అని కనేరియా వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని