టీమ్‌ఇండియాను ఇలా చూసి గర్వపడుతున్నా 

2011 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించి పదేళ్లు పూర్తైన సందర్భంగా నాటి కోచ్‌, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. గతరాత్రి ఓ ట్వీట్‌ చేస్తూ భారత జట్టును కొనియాడాడు...

Updated : 03 Apr 2021 12:15 IST

2011 ప్రపంచకప్‌పై గ్యారీకిర్‌స్టెన్‌ సంతోషం

(Photo: Gary Kirsten Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: 2011 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా నాటి కోచ్‌, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. గతరాత్రి ఓ ట్వీట్‌ చేస్తూ భారత జట్టును కొనియాడాడు. ఈ పదేళ్లలో టీమ్‌ఇండియా ఎదిగిన తీరుకు గర్వపడుతున్నట్లు చెప్పాడు.

‘టీమ్‌ఇండియా ఐసీసీ ప్రపంచకప్‌ సాధించి పదేళ్లు అయ్యింది. నా కెరీర్‌లో అత్యంత గొప్ప విజయాల్లో కచ్చితంగా ఇదీ ఒకటి. ఆరోజు నుంచి భారత జట్టు ఎదిగిన తీరు, ఆటగాళ్లు వృద్ధి చెందిన పరిస్థితులు చూసి చాలా గర్వపడుతున్నా. అద్భుతమైన జ్ఞాపకాలు మిగిల్చినందుకు టీమ్‌ఇండియాకు ధన్యవాదాలు’ అని కిర్‌స్టెన్‌ ట్వీట్‌ చేశాడు.

2007లో టీమ్‌ఇండియా కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రేగ్‌ ఛాపెల్‌ వైదొలిగాక బీసీసీఐ 2008లో ఆ బాధ్యతలను గ్యారీ కిర్‌స్టెన్‌కు అప్పగించింది. దాంతో ధోనీసేనను అతడు అత్యుత్తమ జట్టుగా తీర్చిదిద్దాడు. ఈ క్రమంలోనే 2011 వన్డే ప్రపంచకప్ వరకూ భారత జట్టు కోచ్‌గా కొనసాగాడు. ఆపై కిర్‌స్టెన్‌ టీమ్‌ఇండియా కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు. తర్వాత 2011 జూన్‌ నుంచి 2013 ఆగస్టు వరకు దక్షిణాఫ్రికా కోచ్‌గా పనిచేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని