టీమ్‌ఇండియా కొత్త కోచ్‌గా గంభీర్‌ ఏం చేస్తాడో!

భారత నూతన కోచ్‌గా గంభీర్‌ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్‌గా ఐపీఎల్‌లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. 

Updated : 10 Jul 2024 16:29 IST

గౌతమ్‌ గంభీర్‌.. ఈ పేరుకు భారత క్రికెట్లో ఓ ప్రత్యేక స్థానముంది. 2007, 2011 ప్రపంచకప్‌ విజయాల్లో గౌతి కీలకపాత్ర పోషించాడు. రిటైరై కోచ్‌గా అవతారం ఎత్తిన తర్వాత ఆ పాత్రలోనూ ఒదిగిపోయాడు. దూకుడైన కోచ్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. ఆ దూకుడే ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టుకు ట్రోఫీˆ అందించింది. ఈ విజయమే గౌతికి ఓ గొప్ప ఆఫర్‌ ఇచ్చింది. అదే టీమ్‌ఇండియా కోచ్‌ పదవి! రాహుల్‌ ద్రవిడ్‌ పదవి కాలం టీ20 ప్రపంచకప్‌తోనే ముగియడంతో బీసీసీఐ కొత్త కోచ్‌గా గౌతిని ఎంపిక చేసింది. కానీ అతడు ఈ పాత్రలో ఎలా రాణిస్తాడో అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీ20లకు కోహ్లి, రోహిత్, జడేజా గుడ్‌బై చెప్పడంతో వారు లేని లోటును భర్తీ చేయడం గౌతి ముందున్న పెద్ద సవాల్‌. సమర్థులైన కుర్రాళ్లు చాలామందే ఉన్నా.. మూడు ఫార్మాట్లలోనూ ఆడే ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించడం కీలకం. 

సీనియర్లతో సవాల్‌

గంభీర్‌కు కోచ్‌ పదవి అంత తేలికేం కాదు. అతడేం కుర్రాళ్ల జట్టును నడిపించబోవట్లేదు. కోహ్లి, రోహిత్‌శర్మ లాంటి సూపర్‌స్టార్లతో పాటు ఇప్పటికే ఎస్టాబ్లిష్‌ అయిన యువ కెరటాలతో కూడిన భారత జట్టును అతడు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ముఖ్యంగా కోహ్లిని సమన్వయం చేసుకుంటూ సాగాల్సి ఉంటుంది. గతంలో ఈ స్టార్‌తో గౌతికి ఒకటికి రెండుసార్లు వివాదాలు అయ్యాయి. ఈ ఐపీఎల్‌లో ఇద్దరూ తమ మధ్య విభేదాలు లేవు అన్నట్లుగానే వ్యవహరించారు. కానీ అది ఐపీఎల్‌! ఇప్పుడు గౌతి భారత జట్టుకు కోచ్‌! అతడి మార్గనిర్దేశనంలో టీమ్‌ఇండియా సీనియర్లు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. గంభీర్‌ రాకతో కోహ్లి కెరీర్‌ ఎన్నోరోజులు ఉండదేమో అని ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఇప్పటికే పోస్టులు కనబడుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే టీమ్‌ఇండియాకు మంచిది కాదు. జట్టు వాతావరణమే దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇక సీనియర్‌ ఆటగాడు, సారథి రోహిత్‌తో గంభీర్‌ ఎలా ఉంటాడనేది కూడా ఆసక్తికరం. రాహుల్‌ ద్రవిడ్‌ మాదిరే పెద్దన్న పాత్ర పోషిస్తూ గంభీర్‌ జట్టుకు మార్గనిర్దేశనం చేయాల్సిన అవసరం ఉంది.

మంచి ఛాన్స్‌

భారత జట్టుకు ఎన్నో సేవలు చేసినా కూడా సరైన గుర్తింపు రాలేదన్నది గౌతమ్‌ గంభీర్‌ ఏకైక ఫిర్యాదు. చాలాసార్లు బహిరంగంగానే అతడీ విషయాన్ని వెల్లడించాడు. ఇప్పుడు గంభీర్‌కు మళ్లీ తానేంటో నిరూపించుకునే అవకాశం వచ్చింది. పాత్ర మారినా తన ముద్ర వేసే గోల్డెన్‌ ఛాన్స్‌ చిక్కింది. శ్రీలంక పర్యటన ద్వారా కోచ్‌గా అరంగేట్రం చేయబోతున్న గౌతి.. తొలి టూర్‌లో ఎలాంటి ఫలితాలు తెస్తాడో చూడాలి. ప్రతిభావంతులను గుర్తించి అవకాశాలు ఇవ్వడం దగ్గర నుంచి.. సీనియర్ల సేవలను సరిగా వాడుకోవడం వరకు అతడి ముందు పెద్ద బాధ్యతలే ఉన్నాయి. ముఖ్యంగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీˆ 2027 వన్డే ప్రపంచకప్‌లకు బలమైన జట్టును తయారు చేయడానికి ఇప్పటి నుంచే కసరత్తులు జరగాలి. కూర్పుపై ప్రయోగాలు చేయాలి. జట్టుపై అవగాహన రావాలి. ఈ కొత్త బాధ్యతలను మరి గౌతి ఎంతవరకు సమర్థంగా నిర్వర్తిస్తాడో చూడాలి. కోల్‌కతా జట్టులో తనకు ఎంతో ఉపయోగపడిన కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ను కూడా టీమ్‌ఇండియా కోచింగ్‌ స్టాఫ్‌లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. మరి తాను కోరుకున్న కోచింగ్‌ టీమ్‌తో.. బలమైన భారత జట్టుతో అతడు ఎలాంటి ఫలితాలు సాధిస్తాడన్నది ఆసక్తికరం. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు