ODI WC 2023: ఈ వరల్డ్‌ కప్‌లో వారిద్దరే స్పెషల్: గౌతమ్ గంభీర్

వన్డే ప్రపంచకప్‌లో (ODI WC 2023) ఎంతమంది స్టార్లు ఉన్నా.. ఈసారి మాత్రం ఇద్దరు ఆటగాళ్లు తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. 

Published : 03 Oct 2023 14:02 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) సంగ్రామం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. నేటితో వార్మప్‌ మ్యాచ్‌లకు చివరి రోజు. ఈ టోర్ని స్వదేశంలో జరగనున్న నేపథ్యంలో భారత్‌పై భారీ అంచనాలున్నాయి. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, బాబర్ అజామ్, స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్ ఆటను చూసేందుకు అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత వరల్డ్ కప్‌లో ఐదు శతకాలు సాధించిన రోహిత్ శర్మతోపాటు పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని అభిప్రాయపడ్డాడు.

‘‘ఈ సారి వరల్డ్‌ కప్‌లో రోహిత్, బాబర్ ఆట ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. బాబర్‌ నుంచి మూడు లేదా నాలుగు సెంచరీలు వస్తాయని భావిస్తున్నా. అతడిలో ఆ సత్తా ఉంది. ఇక రోహిత్ శర్మ ఇప్పటికే వన్డేల్లో డబుల్‌ సెంచరీలు బాదిన ఆటగాడు. అందుకే, ఈసారి వరల్డ్‌ కప్‌లో వీరిద్దరే స్పెషల్. బాబర్ అజామ్‌ టెక్నిక్ బాగుంటుంది’’ అని గంభీర్‌ తెలిపాడు.

టాప్ స్కోరర్ ఎవరంటే..?

మెగా టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా ఎవరు నిలుస్తారు? అనే ప్రశ్నకు గంభీర్‌ సమాధానం ఇచ్చాడు. అయితే, విరాట్ లేదా రోహిత్, బాబర్‌, శుభ్‌మన్‌ గిల్‌ కాదంట. ఇంగ్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జోస్ బట్లర్ టాప్‌ స్కోరర్‌గా నిలుస్తాడని అభిప్రాయపడ్డాడు. 2019లో వారి సొంత మైదానాల్లో అద్భుతంగా ఆడి ఇంగ్లాండ్‌ విజేతగా నిలవడంలో బట్లర్‌ కూడా కీలక పాత్ర పోషించాడని గుర్తు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని