Gambhir-WV Raman: టీమ్‌ఇండియా కోచ్‌గా గంభీర్‌తో పోటీ.. రామన్‌ ఎక్స్‌ పోస్టు ఎవరి కోసం?

టీమ్‌ఇండియా కోచ్‌ పదవికి గంభీర్‌తో పోటీపడుతున్న డబ్ల్యూవీ రామన్ ఎక్స్‌లో చేసిన ఓ పోస్టు చర్చనీయాంశంగా మారింది. 

Updated : 19 Jun 2024 15:27 IST

దిల్లీ: టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ నియామకం త్వరలోనే జరగనుంది. ఈ పోస్టు కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే విషయాన్ని బీసీసీఐ తెలపలేదు కానీ, మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌, భారత మహిళా జట్టు కోచ్‌గా పనిచేసిన డబ్ల్యూవీ రామన్‌లను మాత్రమే ఇంటర్వ్యూకు పిలిచింది.  మంగళవారం బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) జూమ్‌ కాల్‌ ద్వారా వీరిద్దరిని ఇంటర్వ్యూ చేసింది. టీమ్‌ఇండియా కోచ్‌గా వచ్చే రెండు, మూడేళ్లకు తన ప్రణాళికలను ఇంటర్వ్యూలో గంభీర్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చినట్లు సమాచారం. భారత క్రికెట్‌ పురోగతి కోసం రామన్‌ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చాడు. బుధవారం రెండో రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే, గంభీర్‌ వైపే బీసీసీఐ మొగ్గు చూపుతుందని.. ఇంటర్వ్యూలు లాంఛనమే అని తెలుస్తోంది. ఈనేపథ్యంలో రామన్‌ తాజాగా ఎక్స్‌ (ట్విటర్)లో చేసిన రెండు పదాల పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

మంగళవారం మొదటి రౌండ్ ఇంటర్వ్యూ ముగిసిన అనంతరం రాత్రి డబ్ల్యూవీ రామన్ ‘‘ఓ డియర్‌!!’’ అంటూ నిరాశలో కూరుకుపోక తప్పదన్న అర్థం వచ్చేలా ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. రామన్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు చేశాడో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బీసీసీఐ గంభీర్‌ వైపే మొగ్గు చూపుతుందన్న వార్తలొస్తుండటంతో అతడిని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశాడని కొంతమంది భావిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని