Gautam Gambhir: టీమ్‌ఇండియా కోచ్‌గా గంభీర్‌ ఫిక్స్‌? ఆ డిమాండ్‌కు ఓకే చెప్పిన బీసీసీఐ!

భారత జట్టు కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ ఎంపిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ నెలఖారులో దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్‌ ఉంది. 

Updated : 16 Jun 2024 17:36 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ఈ టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది. జులై 1 నుంచి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కొత్త కోచ్‌గా ఎవరొస్తారన్న దానిపై ఉత్కంఠ ఇంకా వీడటం లేదు. భారత జట్టు కోచ్‌ పదవికి మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతడి ఎంపిక దాదాపు ఖరారైనట్లు కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. కొత్త కోచ్‌ నియమాకం గురించి జూన్‌ చివర్లో బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది.

‘‘భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉండటానికి గంభీర్‌తో చర్చలు జరిపాం. అతను టీ20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేస్తాడు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కోచ్‌గా ఉండటానికి బీసీసీఐ ముందు గంభీర్‌ ఓ డిమాండ్‌ ఉంచినట్లు వార్తలొస్తున్నాయి. సహాయక సిబ్బంది (సపోర్టింగ్ స్టాఫ్‌) నియామకం విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని షరతు పెట్టాడట. అందుకు బోర్డు అంగీకరించినట్లు సమాచారం. దీన్ని బట్టి గంభీర్‌ కోచ్‌గా వస్తే ప్రస్తుతమున్న సహాయక సిబ్బంది మొత్తం తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్‌ కోచ్‌గా పరాస్ మంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్‌గా దిలీప్‌ ఉన్నారు. గంభీర్‌ సహాయక సిబ్బందిలోనే కాకుండా జట్టులోనూ మార్పులు చేస్తాడట.  

‘‘భారత జట్టుకు కోచ్‌గా ఉండాలని అనుకుంటున్నా. జాతీయ జట్టుకు శిక్షణ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. 140 మంది కోట్ల భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు లెక్క’’ అని గంభీర్ ఇటీవల ఓ కార్యక్రమంలో పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని