Gautam Gambhir: ఒక రౌండ్‌ అయింది

టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ నియామకానికి సమయం దగ్గరపడింది. అందరూ అనుకుంటున్నట్లే మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. మంగళవారం అతను బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

Published : 19 Jun 2024 04:24 IST

సీఏసీ ఇంటర్వ్యూలో గంభీర్‌
టీమ్‌ఇండియా కోచ్‌గాప్రకటన లాంఛనమే

దిల్లీ: టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ నియామకానికి సమయం దగ్గరపడింది. అందరూ అనుకుంటున్నట్లే మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. మంగళవారం అతను బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. జూమ్‌ కాల్‌ ద్వారా జరిగిన ఇంటర్వ్యూలో గంభీర్‌తో సీఏసీ ఛైర్మన్‌ అశోక్‌ మల్హోత్రాతో పాటు సభ్యులు జతిన్‌ పరాంజపె, సులక్షణ నాయక్‌ మాట్లాడారు. బుధవారం ఇంకో రౌండ్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. టీమ్‌ఇండియా కోచ్‌ పదవికి దరఖాస్తు చేసిన వారిలోంచి గంభీర్‌ కాకుండా డబ్ల్యూవీ రామన్‌ను మాత్రమే బీసీసీఐ ఇంటర్వ్యూకు పిలిచింది. రామన్‌కు కూడా ఇంటర్వ్యూ జరిగినప్పటికీ గంభీర్‌నే కోచ్‌గా చేయడానికి బీసీసీఐ ఆసక్తితో ఉందని.. ఇంటర్వ్యూలు లాంఛనమే అని తెలుస్తోంది. టీమ్‌ఇండియా కోచ్‌గా వచ్చే రెండు మూడేళ్లకు తన ప్రణాళికలను ఇంటర్వ్యూలో గంభీర్‌ ప్రెజెంటేషన్‌ ఇస్తున్నట్లు సమాచారం. రెండో రౌండ్‌ కూడా పూర్తయ్యాక గంభీర్‌ను కోచ్‌గా ప్రకటించే అవకాశముంది. ‘‘గంభీర్‌ సీఏఈ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఒక రౌండ్‌ పూర్తయింది. బుధవారం ఇంకో రౌండ్‌ ఉంటుంది. గంభీర్‌ తర్వాత రామన్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఇద్దరితోనూ జూమ్‌ కాల్‌లోనే మాట్లాడారు. భారత క్రికెట్‌ పురోగతి కోసం రామన్‌ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చాడు. 40 నిమిషాల పాటు సాగిన ఇంటర్వ్యూలో సీఏసీ సభ్యులు రామన్‌కు ముందుగా కొన్ని ప్రశ్నలు సంధించారు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ టీ20 ప్రపంచకప్‌ అనంతరం బాధ్యతల నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే.

శ్రేయస్‌కు లైన్‌ క్లియర్‌! 

దిల్లీ: మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. త్వరలోనే టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. జులై-ఆగస్టు నెలల్లో జింబాబ్వే, శ్రీలంక జట్లతో సిరీస్‌లకు అతను ఎంపికయ్యే అవకాశముంది. గత సీజన్లో రంజీ ట్రోఫీ ఆడనందుకు శ్రేయస్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌ను బీసీసీఐ కాంట్రాక్టుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి అతను టీమ్‌ఇండియాకు కూడా ఎంపిక కావట్లేదు. అయితే ఐపీఎల్‌లో శ్రేయస్‌ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ట్రోఫీ అందించాడు. ఆ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్‌ త్వరలోనే టీమ్‌ఇండియా కోచ్‌ కాబోతున్నాడు. దీంతో శ్రేయస్‌ పునరాగమనానికి లైన్‌ క్లియరైనట్లేనని భావిస్తున్నారు. జులై 5 నుంచి భారత జట్టు.. జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్‌ ఆడుతుంది. ఆ తర్వాత నెలాఖరులో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ మొదలవుతుంది. ఈ రెండింట్లోనూ శ్రేయస్‌ ఆడే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని