KL Rahul: అలా చేయడం కేఎల్‌ను బాధించే ఉంటుంది: గౌతమ్‌ గంభీర్‌

IND vs AUS: బ్యాటింగ్ ప్రదర్శన దారుణంగా ఉండటంతో ఆసీస్‌తో మూడో టెస్టుకు కేఎల్‌ రాహుల్‌ను (KL Rahul) పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం వల్ల అతడు చాలా బాధ పడి ఉంటాడని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌ వ్యాఖ్యానించాడు.

Published : 08 Mar 2023 19:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గతకొంతకాలంగా విఫలమవుతూ వస్తున్న టీమ్‌ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై (KL Rahul) ఆసీస్‌తో మూడో టెస్టుకు వేటుపడింది. అంతకుముందు వరుసగా అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం  చేసుకోకపోవడంతో సోషల్‌ మీడియాలో విమర్శలు చెలరేగాయి. దీంతో మూడో టెస్టులో (IND vs AUS) అతడిని తొలగించి శుభ్‌మన్‌గిల్‌కు జట్టు మేనేజ్‌మెంట్  అవకాశం ఇచ్చింది. కానీ, గిల్‌ కూడా నిరాశపరిచాడు. దీంతో మళ్లీ కేఎల్‌కు ఛాన్స్‌ ఇస్తే బాగుంటుందనే వాదన తెరమీదకొచ్చింది. కానీ, ఫామ్‌ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టెస్టు సిరీస్‌ ముగిశాక.. ఆసీస్‌తో వన్డే సిరీస్‌ కూడా ఉంది. మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2023) ప్రారంభం కానుంది. అయితే ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్‌ ఐపీఎల్‌ను వేదికగా వినియోగించుకోవాలని.. ఫామ్‌ సమస్య నుంచి బయటపడాలని టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్, లఖ్‌నవూ ఫ్రాంచైజీ మెంటార్ గౌతమ్‌ గంభీర్‌ సూచించాడు. 

‘‘ప్రతి ఆటగాడు ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కెరీర్‌లో ఇదొక దశ మాత్రమే. అలా కాదు.. ఎప్పుడూ ఫామ్‌లోనే ఉండాలని బయట నుంచి వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. అయితే, అలా కెరీర్‌ ఆరంభం నుంచి చివరి వరకు ఇలా కొనసాగిన ఆటగాళ్లు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. ఇలాంటి విషయాలు చాలా మంచి చేస్తాయి.  ఇలా అడిగితే మిమ్మల్ని (విమర్శకులను ఉద్దేశించి) చాలా బాధకు గురి చేస్తాయి కదా.. అలాగే ఆటగాళ్లను కూడా ఇబ్బంది పెడతాయని తెలుసుకోవాలి.  ఐపీఎల్‌లో ఓ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తూ నాలుగైదు సెంచరీలు సాధించిన ఓ బ్యాటర్‌.. అంతర్జాతీయ మ్యాచ్‌కు వచ్చేసరికి తుది జట్టులో లేకుండా డ్రింక్స్‌ తీసుకెళ్లాల్సి వస్తే అతడికి చాలా బాధ కలుగుతుంది. అందుకే, ఈసారి ఐపీఎల్‌ను కేవలం టోర్నమెంట్‌గానే కాకుండా ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి వేదికగా మార్చుకోవాలి’’ అని గంభీర్‌ తెలిపాడు. 

రంజీ మ్యాచ్‌లు ఆడితేనే ఉత్తమం (IND vs AUS)

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెటర్లు తప్పకుండా రంజీ మ్యాచ్‌లు ఆడితే బాగుండేదనే వ్యాఖ్యలను గంభీర్ అంగీకరించాడు. ‘‘ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రంజీ ట్రోఫీ ఆడితే బాగుండేది.  వంద శాతం కాదు.. 200 శాతం భారత ఆటగాళ్లు ఆడాల్సింది. నెట్స్‌లో 20 రోజుల క్యాంప్‌ను నడిపే బదులు రంజీ మ్యాచ్‌లను ఆడించి ఉంటే సన్నద్ధత చాలా బాగుండేది. ఆసీస్‌ కూడా తొలి రెండు మ్యాచుల్లో తీవ్రంగా ఇబ్బంది పడింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు లేకపోవడం వల్లే అలా జరిగింది. ఇదే నెగిటివ్‌ మైండ్‌సెట్‌. ఇలాంటిదే భారత బ్యాటర్లకు ఎదురైంది. ప్రతి ముఖ్యమైన సిరీస్‌కు ముందు రెడ్‌బాల్ క్రికెట్‌ ఆడితే ప్రయోజనం ఉంటుంది’’ అని చెప్పాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని