Gambhir - Kohli: విరాట్‌తో వాగ్వాదం.. 2013 నాటి ఘటనపై గంభీర్‌ కామెంట్‌

తన సహచరులతో వ్యక్తిగతమైన వివాదాలు ఏమీ లేవని, ఆటలో భిన్నాభిప్రాయాలు...

Published : 20 Mar 2022 01:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తన సహచరులతో తనకు వ్యక్తిగతమైన విభేధాలేవీ లేవని, ఉన్నవన్నీ ఆట పరంగానేనని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ సీజన్‌లో లఖ్‌నవూ ఫ్రాంచైజీకి గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు మాట్లాడాడు. మాజీ సారథి ధోనీ అంటే తనకెంతో గౌరవమని చెప్పిన గౌతీ.. 2013లో ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా విరాట్ కోహ్లీతో చోటుచేసుకున్న స్వల్ప వాగ్వాదంపైనా స్పందించాడు.

‘‘ఆ రోజు కోహ్లీపై వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఎప్పుడైనా సరే ఆటలో పోటీతత్వం ఉండాలని కోరుకుంటా. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ధోనీ, కోహ్లీ ఎవరి స్టైల్‌లో పోటీపడతారు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొన్నిసార్లు జట్టు కోసం దూకుడుగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్న పద్ధతిలోనే టీమ్‌ ఆడాలని కోరుకుంటాం. ఆ క్రమంలోనే మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, ఆ మ్యాచ్‌లో కోహ్లీపై వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అలాగే కోహ్లీ ఇప్పటి వరకు సాధించిన విజయాలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే విరాట్‌ టాలెంట్‌ ఏంటనేది కెరీర్‌ ఆరంభం నుంచి చూశాను కాబట్టి నాకు తెలుసు. నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం కానీ, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో అద్భుత పనితీరు కనబరిచాడు’’ అని గంభీర్‌ తెలిపాడు. ఐపీఎల్‌ -2013 సీజన్‌లో విరాట్ కోహ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) సారథి కాగా.. గౌతమ్‌ గంభీర్ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో ఆర్‌సీబీ, కేకేఆర్‌ లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని