Gautam Gambhir: ఆ అవకాశాన్ని మిస్‌ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధగా ఉంది: గంభీర్‌

టీమ్ఇండియా మాజీ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని తన జీవితంలో పశ్చాత్తాపం చెందిన ఏకైక విషయాన్ని వెల్లడించాడు. 

Published : 23 Jun 2024 00:03 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ 2011 ప్రపంచ కప్‌ విజేతగా నిలవడంలో గౌతమ్ గంభీర్ కీలకపాత్ర పోషించాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో 275 పరుగుల లక్ష్యఛేదనలో గంభీర్‌ (97; 122 బంతుల్లో 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును బలమైన స్థితిలో నిలిపాడు. కానీ, చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ని ముగించలేకపోయాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్‌.. తన జీవితంలో పశ్చాత్తాపం చెందే విషయం ఏదైనా ఉందంటే అది 2011 ప్రపంచ కప్‌లో భారత్‌ విజయ లాంఛనాన్ని పూర్తి చేయకపోవడమే అని పేర్కొన్నాడు. 

‘‘ఆ మ్యాచ్‌ని నేను ముగించాల్సింది. మ్యాచ్ విజయ లాంఛనాన్ని మరొకరికి వదిలేయకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత నాదే. కాలాన్ని వెనక్కి తిప్పే అవకాశం వస్తే నేను మొదట చేసే పని అదే. మళ్లీ ఆ మ్యాచ్‌లోకి వెళ్లి విజయానికి కావాల్సిన ఆఖరి పరుగు నేనే చేస్తాను. ఎన్ని రన్స్‌ చేశానన్నది ముఖ్యం కాదు. విజయానికి కావాల్సిన పరుగులు చేశానా? లేదా? అనేదే కీలకం’’ అని గంభీర్ వివరించాడు. 

టీమ్ఇండియాకు సుదీర్ఘ కాలం కెప్టెన్సీ చేసే అవకాశం రానందుకు తనకు బాధగా లేదని గౌతీ చెప్పాడు. ‘‘నేనేప్పుడూ అభిమానులను అలరించేందుకు ఆడేవాడిని. ఏ జట్టుకు ఆడినా ఆ టీమ్‌ని గెలిపించేందుకు ప్రయత్నిస్తా. టీమ్ఇండియాకు కెప్టెన్సీ చేసే అవకాశం రానందుకు బాధగా లేదు. ఆరు మ్యాచ్‌ల్లో జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కింది. దానిని సమర్థవంతంగా నిర్వహించేందుకు నా శక్తి మేరకు కృషి చేశా’’ అని గంభీర్ పేర్కొన్నాడు. 

2011 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ని కెప్టెన్‌ ధోనీ (91) సిక్సర్‌తో ముగించిన సంగతి తెలిసిందే. తర్వాత భారత్‌ మరోసారి విశ్వవిజేతగా నిలవలేకపోయింది. 2023 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని