Virat Kohli: కోహ్లీ విషయంలో ఏ మార్పూ ఉండదు: గంభీర్‌

టీమ్‌ఇండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ పూర్తి స్థాయిలో తప్పుకొన్నాక తనలో ఏ మార్పూ ఉండదని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు...

Updated : 01 Feb 2022 10:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ పూర్తి స్థాయిలో తప్పుకొన్నాక తనలో ఏ మార్పూ ఉండదని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన గౌతీ.. కోహ్లీ ఆటతీరుపై స్పందించాడు. ‘జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో ఎవరైనా బాగా ఆడి తమ టీమ్‌ని గెలిపించాలని ఆశిస్తారు. అప్పుడు అదే ప్రధానంగా అనిపిస్తుంది. తొలి రోజు నుంచే ఎవరూ కెప్టెన్‌ అవ్వాలని ఊహించుకోరు. నాయకత్వం అనేది ఒక గౌరవం. అదనపు బాధ్యత మాత్రమే. ఈ విషయంలో కోహ్లీ కూడా నాలాగే ఆలోచిస్తాడని అనుకుంటా. అందుకే ఇప్పుడతడు సారథిగా లేకపోయినా ఎలాంటి మార్పూ ఉండదని అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా మార్పు కనిపిస్తే కచ్చితంగా అక్కడ ఏదో ఒక సమస్య ఉందని అర్థం’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

మరోవైపు టీమ్‌ఇండియా ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేయడం, దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌ కోల్పోవడం చూస్తుంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మూస ధోరణి ప్రదర్శిస్తుందా.. అనే సందేహం కలుగుతోంది. దీనిపై మాట్లాడిన గంభీర్‌.. తాను అలాంటి వాటిని నమ్మనని చెప్పాడు. క్రికెట్‌ అనేది చాలా సింపుల్‌ గేమ్‌ అని, అందులో ఒకటే ధోరణి ఉంటుందని మాజీ ఓపెనర్‌ చెప్పుకొచ్చాడు. ‘నేనెప్పుడూ ఒకటే విషయం అనుసరిస్తా. ఛేజింగ్‌ చేస్తుంటే చివరి పరుగును పూర్తి చేయడం, బౌలింగ్‌ చేస్తుంటే ఆఖరి వికెట్‌ పడగొట్టడం. . ఈ ధోరణి తప్ప నేను ఇంకేదీ పట్టించుకోను. ఎలాగైనా పని పూర్తి చేశామా లేదా అనేదే ముఖ్యం’ అని గంభీర్‌ తన ఆలోచనా విధానం వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని