Gautam Gambhir: భారత కోచ్‌గా గంభీర్‌! ఈడెన్ గార్డెన్స్‌లో ఫేర్‌వెల్ వీడియో షూట్

టీమ్ ఇండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం ముగియడంతో ఆ రేసులో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) ముందున్నట్లు తెలుస్తోంది. 

Published : 07 Jul 2024 15:55 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్‌ టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా రావడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే ప్రకటన వెలువడుతుందని సమాచారం. తాజాగా ఈ వార్తలకు బలం చేకూర్చే మరో అంశం తెరపైకి వచ్చింది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా ఉన్న గంభీర్‌.. టీమ్ఇండియాకు కోచ్‌గా వస్తే కేకేఆర్‌ మార్గనిర్దేశకుడిగా తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గంభీర్‌ ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఫేర్‌వెల్ వీడియో షూటింగ్‌ పాల్గొన్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి గంభీర్‌ భారత కోచ్‌గా రావడం ఫిక్సయినట్లు భావించొచ్చు.

‘‘గంభీర్ తన అభిమానులకు ఓ సందేశంతో వీడ్కోలు చెప్పాలనుకున్నారు. దాని కోసమే ఈడెన్ గార్డెన్స్‌లో వీడియోను చిత్రీకరించాం’’ అని క్రికెట్ అసోసియేషన్‌ ఆఫ్ బెంగాల్ తరఫున హాజరైన ఓ అధికారి తెలిపారు. ఈ వీడియోని గంభీర్ వ్యక్తిగత టీం చిత్రీకరించింది. దీంట్లో కేకేఆర్ ఫ్రాంచైజీకి ఎటువంటి సంబంధం లేదు. ఇందులో కేకేఆర్‌తో గంభీర్‌ ప్రయాణం, 2024లో ఆ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన సన్నివేశాలు ఉన్నాయి. టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా గంభీర్ వచ్చిన అనంతరం ఈ వీడియోని అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. 

ప్రధాన కోచ్‌ ప్రకటన ఎప్పుడు? 

టీ20 ప్రపంచ కప్‌తో కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగిసింది.  త్వరలో శ్రీలంక పర్యటనకు భారత్‌ కొత్త కోచ్ నేతృత్వంలో వెళ్లనుందని బీసీసీఐ  కార్యదర్శి జై షా తెలిపారు. లంకతో టీమ్‌ఇండియా 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ప్రస్తుతం భారత జట్టు ఐదు టీ20ల సిరీస్‌ ఆడేందుకు జింబాబ్వే వెళ్లిన విషయం తెలిసిందే. వారికి కోచ్ గా వీవీఎస్‌ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నాడు. శ్రీలంక టూర్‌కు ముందు గంభీర్‌ను కోచ్‌గా ప్రకటించే అవకాశముంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని