Gautam Gambhir: గంభీరే టీమ్‌ఇండియా కోచ్‌!

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ త్వరలోనే కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు! భారత పురుషుల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా అతని ఎంపిక ఖాయమైందని తెలిసింది. బీసీసీఐ అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.

Published : 17 Jun 2024 06:56 IST

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ త్వరలోనే కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు! భారత పురుషుల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా అతని ఎంపిక ఖాయమైందని తెలిసింది. బీసీసీఐ అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌తో ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం పూర్తవుతుంది. ఆ వెంటనే అతని స్థానంలో గంభీర్‌ తన పని మొదలెట్టనున్నాడు. ఈ మేరకు గంభీర్‌ డిమాండ్‌కు బీసీసీఐ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. జట్టు సహాయక కోచింగ్‌ సిబ్బందిని తానే నిర్ణయిస్తానని, అందుకు సమ్మతిస్తేనే కోచ్‌గా వస్తానని గంభీర్‌ డిమాండ్‌ చేశారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అందుకు బోర్డు  కూడా అంగీకరించిందని సమాచారం. ‘‘భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవి కోసం గంభీర్‌తో చర్చించాం. టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ద్రవిడ్‌ స్థానాన్ని అతను భర్తీ చేస్తాడు’’ అని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం బ్యాటింగ్‌కు విక్రమ్‌ రాథోడ్, బౌలింగ్‌కు పారస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌కు దిలీప్‌ సహాయ కోచ్‌లుగా ఉన్నారు. వీళ్ల స్థానాల్లో కొత్తవాళ్లను గంభీర్‌ తీసుకునే అవకాశముంది. భారత జట్టు కోచ్‌గా గంభీర్‌ను ఎంపిక చేస్తారని కొంతకాలంగా ఊహాగానాలు  సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్‌లో మెంటార్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన 42 ఏళ్ల గంభీర్‌ కూడా టీమ్‌ఇండియా కోచ్‌ పదవిపై ఆసక్తి కనబరిచాడు. జాతీయ జట్టుకు కోచ్‌గా పని చేయడం కంటే పెద్ద గౌరవం ఇంకేముంటుందని ఇటీవల పేర్కొన్నాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లను టీమ్‌ఇండియా సొంతం చేసుకోవడంలో గంభీర్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని