Gautam Gambhir: భారత ప్రధాన కోచ్‌ పదవి.. గంభీర్‌ పెట్టిన ఐదు కండీషన్లు ఇవేనా!

భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవి కోసం గౌతమ్‌ గంభీర్‌ పేరు ఖాయమైనట్లే. అయితే, బీసీసీఐ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. జులై నుంచి కొత్త కోచ్‌ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.

Updated : 24 Jun 2024 11:00 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ పదవి రేసులో ముందున్న గౌతమ్ గంభీర్‌.. బీసీసీఐ ఎదుట ఐదు కండీషన్లు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో సీనియర్‌ క్రికెటర్ల భవితవ్యానికి సంబంధించిన అంశమూ కీలకమని తెలుస్తోంది. ఇప్పటికే గంభీర్‌ (Gautam Gambhir)ను బీసీసీఐ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అతడితోపాటు డబ్ల్యూవీ రామన్‌ కూడా ఉన్నారు. అయితే, గంభీర్‌ వైపే బోర్డు మొగ్గు చూపనుంది. అదే సమయంలో రామన్‌ సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో కొద్ది రోజుల్లోనే ప్రధాన కోచ్‌ (Head Coach) ఎవరు అనేది బీసీసీఐ ప్రకటించనుంది. ఈ క్రమంలో గంభీర్‌ పెట్టిన ఐదు కండీషన్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వాటన్నింటినీ బీసీసీఐ (BCCI) కూడా అంగీకరించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. 

ఇవే అవి.. 

  • క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో ఎవరి జోక్యం ఉండకూడదు. బోర్డు లేదా బయట నుంచి ఒత్తిళ్లను సహించే ప్రసక్తే లేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) మెంటార్‌గానూ గంభీర్‌ ఇలానే వ్యవహరించాడు.
  • సహాయక సిబ్బందిని ఎంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ కోచ్‌లతోపాటు ఇతర సిబ్బంది నియామకంలో ఇతరుల పాత్ర ఉండకూడదు.
  • మూడో నిబంధన అత్యంత కీలకమైంది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌ వేదికగా జరగనుంది. సీనియర్ క్రికెటర్లు రోహిత్, విరాట్, రవీంద్ర జడేజా, షమీకి ఇదే చివరి అవకాశం. ఒకవేళ టైటిల్‌ను నెగ్గడంలో భారత్‌ (Team India) విఫలమైతే.. వారందరినీ జట్టునుంచి తప్పించేందుకు ఇబ్బందిలేకుండా ఉండాలి. అయితే, మూడు ఫార్మాట్ల నుంచా? లేదా అనేది తెలియరాలేదు.
  • టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్నందున.. భారత్‌ కూడా మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రత్యేకంగా జట్టును సిద్ధం చేసుకోవాలి. అందుకోసం భవిష్యత్తులో ఆటగాళ్లను ఎంపిక చేయాలి. 
  • వన్డే ప్రపంచకప్‌ 2027 కోసం ఇప్పటినుంచే రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు అనుమతించాలి. వచ్చే సంవత్సరం వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. జట్టు ఎంపికలో స్వేచ్ఛ ఉండాలి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని