ODI WC 2023: ఆ ఒక్క విభాగంలో టీమ్ఇండియా సెట్ కావాలి: గౌతమ్ గంభీర్‌

వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) సన్నద్ధతలో భాగంగా టీమ్‌ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. సరైన జట్టు కూర్పు కోసం దీనిని వినియోగించుకోవాలని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ సూచించాడు.

Updated : 19 Sep 2023 13:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌ (ODi World Cup 2023) ముంగిట టీమ్ఇండియా (Team India) మరో సిరీస్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఆసియా కప్‌ను నెగ్గిన భారత జట్టు ఆస్ట్రేలియాతో (IND vs AUS) మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్‌ ప్రారంభం నాటికి భారత జట్టు ఓ విభాగంలో సెట్‌ కావాలని.. లోయర్‌ ఆర్డర్‌ మరింత నాణ్యమైన క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాలని.. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించాలని పేర్కొన్నాడు. 

‘‘రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఎలాంటి పిచ్‌పైనైనా పది ఓవర్ల కోటా వేయగలడు. అదేవిధంగా అద్భుతమైన ఫీల్డర్‌. ఇదే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పొషించాల్సిన అవసరం ఉంది. కేవలం ఆరుగురు బ్యాటర్లతోనే వరల్డ్‌ కప్‌లో ఆడటం సులువేం కాదు. ఇషాన్ కిషన్‌ను ఐదో స్థానంలో ఆడిస్తే కొన్ని ప్రశ్నలు తలెత్తడం సహజం. లోయర్‌ ఆర్డర్‌లో హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా విలువైన పరుగులు చేయాలి. మ్యాచ్‌లను గెలిపించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుంది. మరీ ముఖ్యంగా జడేజాపై ఎక్కువగా ఉంటుంది. చివరి 10 ఓవర్లలో 80 లేదా 90 పరుగులు చేయాల్సి వస్తే ఆరేడు స్థానాల్లో వచ్చే బ్యాటర్లు కలిసి జట్టును గెలిపించాలి’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.

ఆసియా కప్‌లో బంతితో ఫర్వాలేదనిపించిన రవీంద్ర జడేజా.. బ్యాటింగ్‌లో మాత్రం తన స్థాయి ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. సెప్టెంబర్ 22 నుంచి ఆసీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లోనైనా బ్యాటింగ్‌లో ఫామ్‌లోకి వస్తే వచ్చే వరల్డ్‌ కప్‌లో టీమ్‌ఇండియాకు తిరుగుండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని