ధోనీకి 10కి 4 మార్కులే: వీరూ

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరుపొందిన ఎంఎస్‌ ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంలో అర్థంలేదని టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. పరుగులు చేయకుండా ఔటైనా తప్పులేదన్నాడు. కనీసం ముందుగా వచ్చి మిగతా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం సారథిగా...

Published : 23 Sep 2020 14:37 IST

మహీ పరుగులతో జట్టుకు ప్రయోజనమేంటన్న గౌతీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరుపొందిన ఎంఎస్‌ ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంలో అర్థంలేదని టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. పరుగులు చేయకుండా ఔటైనా తప్పులేదన్నాడు. కనీసం ముందుగా వచ్చి మిగతా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం సారథిగా అతడి కర్తవ్యమని సూచించాడు. ఆఖరి ఓవర్లో చేసిన పరుగులతో జట్టుకు ఏం లాభం జరిగిందని ప్రశ్నించాడు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో గౌతీ మాట్లాడాడు.

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 217 పరుగుల లక్ష్య ఛేదనలో అనుభవం లేని సామ్‌ కరణ్‌, రుతురాజ్‌ను ముందుగా పంపించాడు. జట్టు విజయానికి 38 బంతుల్లో 103 పరుగులు అవసరమైన దశలో ధోనీ క్రీజులోకి వచ్చాడు. చివరి వరకూ సింగిల్స్‌కే పరిమితం అయ్యాడు. ఆఖరి ఓవర్లో మాత్రం వరుసగా మూడు సిక్సర్లు బాదినా అప్పటికే ఓటమి ఖరారైపోయింది.

‘నిజం చెప్పాలంటే ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగుకు రావడం ఆశ్చర్యం కలిగించింది. కరణ్‌, రుతురాజ్‌ను ముందు పంపించడంలో అర్థంలేదు. అలా చేస్తే ముందుండి నడిపించడం ఎలా అవుతుంది? మహీ ఆఖరి ఓవర్లో చేసిన పరుగులతో ఏం ప్రయోజనం? అవి వ్యక్తిగత పరుగులే అవుతాయి. ముందుగా వచ్చి ఔటైనా ఫర్వాలేదు. సారథి ముందుండి నడిపిస్తేనే జట్టు ప్రేరణ పొందుతుంది. సురేశ్ రైనా లేని సమయంలో కరణ్‌, రుత్‌రాజ్‌ను ముందుగా పంపించి నీకన్నా‌ అత్యుత్తమం అన్న భావాన్ని ప్రజల్లో కలిగిస్తున్నావు’ అని గంభీర్‌ అన్నాడు. 

మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం గౌతీ తరహా వ్యాఖ్యలే చేశాడు. రాజస్థాన్‌ మ్యాచ్‌లో మహీ సారథ్యం అంత బాగాలేదని ‘క్రిక్‌బజ్‌’ కార్యక్రమంలో అన్నాడు. భారీ లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో ఎందుకు వచ్చాడో అర్థం  కాలేదని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో అతడి సారథ్యానికి 10కి 4 మార్కులే వేస్తానని వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని