
Hardik Pandya: హార్దిక్ టీ20 జట్టులోకి వస్తాడు.. అయితే: గౌతమ్ గంభీర్
ఇంటర్నెట్ డెస్క్: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్‌పైనా, తిరిగి జట్టులోకి చోటుపై చర్చ కొనసాగుతూనే ఉంది. వెన్నునొప్పితో బాధపడిన హార్దిక్ ఐపీఎల్‌లోనూ, టీ20 ప్రపంచకప్‌లోనూ బౌలింగ్ చేయలేదు. స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే సేవలందించాడు. అయితే బ్యాటింగ్‌లోనూ పెద్దగా రాణించిందేమీ లేదు. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసిన సందర్భంగా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మాట్లాడుతూ.. హార్దిక్ బౌలింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. అయితే బౌలింగ్ చేయకపోగా.. బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌కు హార్దిక్‌ను జట్టు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. మరోవైపు యువక్రికెటర్ల నుంచి కూడా పోటీ ఎక్కువైంది. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నాటికి ఫిట్‌నెస్ సాధించి.. బౌలింగ్ చేయగలిగితేనే జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యకు మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ బాసటగా నిలిచాడు. హార్దిక్ తప్పకుండా టీ20 జట్టులోకి వస్తాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే హార్దిక్ తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవాలని, బౌలింగ్ చేయగలగాలని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ హార్దిక్ ప్లేస్‌ను భర్తీ చేస్తే.. ఆ ఆటగాళ్లకు కుదురుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని, అప్పుడే వారేంటో తెలుసుకోవచ్చని గంభీర్ పేర్కొన్నాడు.
‘‘జట్టులోని ఆరో స్థానం (హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఆర్డర్)లో ఆటగాడి మార్పు ఒక్క రోజులో అయ్యేది కాదు. హార్దిక్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఉండలేం. ఒకవేళ హార్దిక్ ఫిట్‌నెస్ సాధించి రెగ్యులర్‌గా బౌలింగ్ చేస్తే మాత్రం జట్టులోకి వచ్చేందుకు తప్పకుండా అవకాశాలు ఇవ్వాలి. ఇప్పటికీ అతడు యువకుడే కావడం మరో సానుకూలాంశం. ’ అని గంభీర్ విశ్లేషించాడు. అలానే ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే మాత్రం ఎక్కువ సమయం ఇవ్వాలని పేర్కొన్నాడు. అప్పుడే సదరు ఆటగాడి సామర్థాన్ని అంచనా వేసేందుకు వీలు కలుగుతుందని చెప్పాడు. ప్రతి సిరీస్‌కూ జట్టును మారుస్తూ ఉంటే మాత్రం.. తుది 11 మందిని ఎంచుకోవడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుందని వివరించాడు. ప్రస్తుతం ప్రతి ఆటగాడికి ప్రత్యామ్నాయం ఉన్నందున జట్టులో ఎవరూ శాశ్వతం కాదని స్పష్టం చేశాడు. అయితే ఆటగాళ్లకు మన క్రికెట్ బోర్డు అండగా నిలవాలని గంభీర్ సూచించాడు.
► Read latest Sports News and Telugu News