Sourav Ganguly: ఆ ముగ్గురూ ఇప్పుడున్న ఆటగాళ్ల కంటే తక్కువ సంపాదించారు: గంగూలీ

సునీల్ గావస్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ వంటి భారత మాజీ ఆటగాళ్లు ప్రస్తుత భారత ఆటగాళ్లు సంపాదించినంత డబ్బు సంపాదించలేకపోయారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నారు. కానీ, వాళ్లందరికీ బాగా ఆడాలనే ఆకలి ఉండేదని దాదా పేర్కొన్నాడు.  

Published : 16 Jun 2022 22:15 IST

 

ఇంటర్నెట్ డెస్క్: సునీల్ గావస్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ వంటి భారత మాజీ ఆటగాళ్లు ప్రస్తుత భారత ఆటగాళ్లు సంపాదించినంత డబ్బు సంపాదించలేకపోయారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నారు. కానీ, వాళ్లందరికీ బాగా ఆడాలనే ఆకలి ఉండేదని దాదా పేర్కొన్నాడు. ఆటగాడి ప్రదర్శనతో డబ్బుకు ముడిపెట్టలేమని వివరించాడు. ఆటగాళ్లు డబ్బు కోసం మాత్రమే ఆడరని, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం, భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గర్వంగా చెప్పుకోవడం కోసం కూడా ఆడతారని గంగూలీ అభిప్రాయపడ్డాడు. భారత టీ20 లీగ్‌ మీడియా హక్కులు రూ.48,390 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైన అనంతరం గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘మొట్ట మొదటి విషయం ఏంటంటే.. డబ్బు అనేది ఆటతీరుకు  సంబంధించినది కాదు. సునీల్ గావస్కర్ కాలం నుంచి చూసుకుంటే అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ వరకు.. ఇప్పుడున్న ఆటగాళ్లు పొందుతున్న డబ్బుకు దగ్గరగా కూడా సంపాదించలేదు. కానీ, వారికి మంచి ప్రదర్శన చేయాలనే ఆకలి ఉండేది’ అని గంగూలీ వ్యాఖ్యానించారు. ‘మీడియా హక్కుల కోసం రెండేళ్ల క్రితమే ప్రణాళిక మొదలైంది. భారత క్రికెట్‌కు ఈ సంవత్సరం చాలా గొప్పది. భారత టీ20 లీగ్‌ని విజయవంతంగా పూర్తి చేశాం. అభిమానులతో స్టేడియాలు నిండిపోయాయి. ఇది చాలా పెద్ద డీల్‌. ద్వైపాక్షిక సిరీస్‌లు కొనసాగుతాయి. అవి ప్రపంచంలోని ఇతర దేశాలు ఆదాయాన్ని సంపాదించడానికి ఉద్దేశించినవి. వచ్చే రెండేళ్లపాటు భారత టీ20 లీగ్‌ ప్రస్తుత మాదిరిగానే (74 మ్యాచ్‌లు) కొనసాగుతుంది’ అని  వివరించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని