గబ్బర్‌ సూపర్‌.. ఊపిరి బిగపట్టేలా మయాంక్‌..

ఐపీఎల్‌ తాజా సీజన్లో దిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ముందు నుంచీ ఫామ్‌ కనబరుస్తున్నాడని టీమ్‌ఇండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌...

Published : 03 May 2021 19:43 IST

ఇద్దరిపై ప్రశంసలు కురిపించిన సన్నీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ తాజా సీజన్లో దిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ముందు నుంచీ ఫామ్‌ కనబరుస్తున్నాడని టీమ్‌ఇండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నారు. ఆ జట్టుకు వరుసగా శుభారంభాలు అందిస్తున్నాడని పేర్కొన్నారు. దిల్లీ మ్యాచులో మయాంక్‌ అగర్వాల్‌ ఆడిన పుల్‌షాట్లు ఆకట్టుకున్నాయని ఆయన  ప్రశంసించారు. నేటితరం క్రికెటర్లు షార్ట్‌ పిచ్‌ బంతుల్ని అలవోకగా సిక్సర్లుగా మలుస్తున్నారని వెల్లడించారు.

‘సీజన్‌ ఆరంభం నుంచీ గబ్బర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అతడేదీ తేలిగ్గా తీసుకోవడం లేదు. కొన్నిసార్లు మంచి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ ఇష్టారీతిన ఆడుతుంటారు. ఇదో చెడ్డ అలవాటు. ధావన్‌ మాత్రం అలా లేడు. అతడి షాట్లను చూడండి. పరుగులు లభించే షాట్లే ఆడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో ఆడే షాట్లే బాదుతున్నాడు. వాటికి ఫలితమూ కనిపిస్తోంది. చూస్తుంటే అతడు దిల్లీకి ఆడటం మరింత ఆస్వాదిస్తున్నాడేమో’ అని సన్నీ వ్యాఖ్యానించారు.

‘దిల్లీ పోరులో మయాంక్‌ ఆఫ్‌సైడ్‌ అద్భుతంగా ఆడాడు. అదే అతడి బలం. కానీ, బంతి షార్ట్‌పిచ్‌లో పడిన ప్రతిసారీ అతడు ఫ్రంట్‌ఫుట్‌తో పుల్‌ చేశాడు. ఇలా చేయడంలో రోహిత్‌ శర్మ అత్యుత్తమ ఆటగాడు. ప్రస్తుతం భారత యువ ఆటగాళ్లూ అతడినే అనుసరిస్తున్నారు. అందుకే ఇప్పటి భారతీయులకు షార్ట్‌పిచ్‌ బంతులేయడం సులభం కాదు. గతంలో సింగిల్‌ లేదా వదిలేసేవారు. ఇప్పుడేం చేస్తున్నారో చూడండి. ఇక మయాంక్‌ ఆడిన అన్ని షాట్లూ నాకు నచ్చాయి. ఆఫ్‌డ్రైవ్స్‌, కవర్‌ డ్రైవ్స్‌ ఇంకా అతనాడిన పుల్‌ షాట్లు ఊపిరి బిగపట్టేలా చేశాయి’ అని సన్నీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని