WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. భారత్‌కు వికెట్‌ కీపర్‌ ఎవరు? సన్నీ కీలక సూచనలు

వరుసగా రెండోసారి కూడా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (WTC Final)కు టీమ్‌ఇండియా వెళ్లింది. ఈసారైనా ఛాంపియన్‌గా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ప్రత్యర్థి ఆసీస్‌ను తక్కువగా అంచనా వేయకూడదు. పేస్‌ పిచ్‌లపై చెలరేగుతుంది. అందుకే, జట్టు ఎంపికలో టీమ్‌ఇండియా (Team India) జాగ్రత్తలు తీసుకోవాలి.

Updated : 15 Mar 2023 11:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీలో (Border - Gavaskar Trophy)ఆసీస్‌పై నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 ఆధిక్యంతో టీమ్‌ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌కూ చేరింది. జూన్‌ 7 నుంచి లండన్‌ వేదికగా ఆస్ట్రేలియాతోనే భారత్‌ (IND vs AUS) తలపడనుంది. అయితే కీలకమైన పోరుకు ముందే టీమ్‌ఇండియా పలు విషయాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. అందులో తొలుత కీపర్‌గా ఎవరు ఉంటారు..? అనేది అభిమానుల్లో మెదిలే మొదటి ప్రశ్న. ఎందుకంటే రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆడిన తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌ గొప్పగా ప్రభావం చూపలేకపోయినా.. ఫర్వాలేదనిపించాడు. ఈ సమయంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక సూచనలు చేశాడు. 

ఇటీవల బ్యాటింగ్‌లో విఫలమవుతున్న కేఎల్ రాహుల్‌ను తీసుకోవాలని సన్నీ సూచించాడు. గత సీజన్‌లో (2021) రాహుల్‌ ప్రదర్శనను బట్టి  కీపర్‌ -బ్యాటర్‌గా  అక్కరకొస్తాడని  చెప్పాడు. ‘‘వికెట్‌ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం పరిగణనలోకి తీసుకుంటే.. అతడితో ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయించొచ్చు. అప్పుడు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంటుంది. ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో కేఎల్ సెంచరీ కూడా చేశాడు. తుది జట్టును ఎంపిక చేసుకునేటప్పుడు దీనిని కూడా గమనించాలి’’ అని గావస్కర్ తెలిపాడు.

ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో రాహుల్‌ విఫలం కావడంతో అతడి స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌కు టీమ్‌ఇండియా  మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. గిల్‌ ఓపెనింగ్‌ బ్యాటరే కానీ, వికెట్‌ కీపర్‌ కాదు. కేఎస్ భరత్‌ను కొనసాగిస్తే మంచిదనే వాదనా వచ్చింది. ఎలాగూ శ్రేయస్‌ గాయం నుంచి కోలుకుని వస్తాడో లేదో తెలియదు. కాబట్టి, అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇస్తే మంచిదని క్రీడా విశ్లేషకులు సూచించారు. రాహుల్‌కు టెస్టుల్లో వికెట్ కీపింగ్‌ అనుభవం తక్కువనే చెప్పాలి. కీలకమైన పోరులో అతడికి అలాంటి బాధ్యతలను అప్పగించడమూ సరైంది కాదనే భావనా అభిమానుల్లో నెలకొంది. అయితే, టీమ్‌ఇండియా ఏం చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు