IND vs SA: దక్షిణాఫ్రికాను సొంతగడ్డపై ఓడిస్తే.. టీమ్‌ఇండియాకు ఆకాశమే హద్దు

త్వరలో దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు విజయం సాధించేందుకు సువర్ణావకాశమని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. ఒక వేళ ఈ సిరీస్‌లో టీమ్ఇండియా..

Published : 22 Dec 2021 11:54 IST

సునీల్ గావస్కర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు విజయం సాధించేందుకు సువర్ణావకాశమని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. భారత జట్టు ఇటీవల విదేశీ పిచ్‌లపై మెరుగ్గా రాణిస్తోందని.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల్లో చేసిన ప్రదర్శనే అందుకు నిదర్శనమని చెప్పాడు.

‘ఇప్పటి వరకు టీమ్‌ఇండియా ఏడు సార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించినా.. ఒక్క సారి కూడా సిరీస్‌ సాధించలేకపోయింది. త్వరలో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు విజయం సాధిస్తే ఆకాశమే హద్దు అవుతుంది. దక్షిణాఫ్రికాలో సరికొత్త చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఇప్పటికే టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉంది. ఏబీ డి విలియర్స్, డు ప్లెసిస్‌, హాషీమ్‌ ఆమ్లా వంటి కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో దక్షిణాఫ్రికా జట్టు బలహీనమైంది. మరోవైపు, క్వింటన్ డి కాక్‌ కూడా తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఇవన్నీ భారత్‌కి కలిసొచ్చే అంశాలే. అందుకే దక్షిణాఫ్రికాలో సిరీస్‌ గెలిచేందుకు ఇదే సువర్ణావకాశం’ అని గావస్కర్‌ అన్నాడు.

‘గత కొద్ది కాలంగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో తడబడుతోంది. అందుకే విజయం కోసం ఎక్కువగా బౌలర్లపైనే ఆధారపడుతోంది. సీనియర్ల రిటైర్మెంట్‌తో సఫారీల బ్యాటింగ్ విభాగం బలహీనంగా ఉన్నా పేస్ దళం మాత్రం బలంగానే కనిపిస్తోంది. వారి నుంచి టీమ్‌ఇండియాకు ప్రతిఘటన ఎదురుకావొచ్చు. అయితే, భారత జట్టులో 7, 8, 9వ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి రాణించగల టెయిలెండర్లు ఉండటం సానుకూలాంశం. ఆఖర్లో వాళ్లు 50-60 పరుగులు చేసినా ఫలితం మరోలా ఉంటుంది’ అని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కిదే తొలి విదేశీ పర్యటన కావడంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని