సోహేల్‌ రెచ్చగొట్టడంతో తర్వాతి బంతికే.. 

టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ 1996 ప్రపంచకప్‌లో బెంగళూరులో పాకిస్థాన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. తాజాగా రవిచంద్రన్‌ అశ్విన్‌తో...

Published : 14 Jul 2020 17:52 IST

1996 భారత్‌-పాక్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌పై వెంకటేశ్‌ ప్రసాద్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ 1996 ప్రపంచకప్‌లో బెంగళూరులో పాకిస్థాన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. తాజాగా రవిచంద్రన్‌ అశ్విన్‌తో ఓ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో ముచ్చటించిన ప్రసాద్‌ పాకిస్థాన్‌ మాజీ సారథి ఆమిర్‌ సోహేల్‌తో జరిగిన వివాదాస్పద స్లెడ్జింగ్‌ గురించి వివరించాడు. ఆ మ్యాచ్‌లో తమ ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరిగిందని, సోహేల్‌ తన బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన మరుసటి బంతికే అతడిని ఔట్‌ చేశానని చెప్పాడు. పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరైనా టీమ్‌ఇండియా బౌలర్లపై చెలరేగడం తనకు నచ్చదని, అలాంటి సమయంలో తాను ప్రశాంతంగా ఉండడం చాలా కష్టమని చెప్పాడు.  

‘అది నిజంగా చెంపపెట్టులాంటి సంఘటన. 15వ ఓవర్‌లో నేను బౌలింగ్‌ చేస్తుండగా సోహేల్‌ ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా ఒక బౌండరీ బాదాడు. నేనా షాట్‌ను ఊహించలేదు. అదెంతో ఒత్తిడిలో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌. అతడు ఫోర్‌ కొట్టాక బ్యాట్‌ను బౌండరీ వైపు చూపించి చేతి వేళ్లతో సైగలు చేశాడు. తర్వాతి బంతికి ఇంకో ఫోర్‌ కొడతానని చెప్పాడు. ఆ మాటలు నాకు వినిపించడంతో ఇద్దరి మధ్యా మాటలు పెరిగాయి. అప్పుడు నా మదిలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. నామీద ఏ బ్యాట్స్‌మన్‌ ఆధిపత్యం చెలాయించినా నాకు నచ్చదు. నా మనస్తత్వం అలాంటిది. ఎవరైనా అలా చేస్తే వెంటనే వారికి తిరిగివ్వాలనుకునేవాడిని’ అని ప్రసాద్‌ నాటి స్లెడ్జింగ్‌ను గుర్తుచేసుకున్నాడు.  

‘అప్పుడే అతడిని ఔట్‌ చేయాలని నిర్ణయించుకున్నా. దాంతో బ్యాట్స్‌మన్‌కు బంతి అందకుండా వికెట్ టు వికెట్‌ వేయాలనుకున్నా. నా కోపాన్ని అదుపులో ఉంచుకొని అలాగే చేశా. తర్వాతి బంతికే సోహేల్‌ బౌల్డయ్యాడు’ అని మాజీ పేసర్‌ వివరించాడు.  ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా పాకిస్థాన్‌ ముందు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ 93 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఛేదనలో పాక్‌ ధాటిగా ఆరంభించిడంతో ఆ జట్టు తేలిగ్గా గెలిచేలా అనిపించింది. ముఖ్యంగా ఓపెనర్‌ ఆమిర్‌ సోహేల్‌(55) ధాటిగా ఆడాడు. అతడు 15వ ఓవర్‌లో ఔటయ్యాక పాక్‌ క్రమంగా వికెట్లు కోల్పోయింది. సోహేల్‌ ఔటవ్వడంతోనే మ్యాచ్‌ మలుపు తిరిగింది. చివరికి ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేయడంతో 39 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని