Sports News: చదువు తప్పించుకోవడానికి..

ఎవరైనా నచ్చిన ఆటను ఎంచుకుని దానిలో రాణించేందుకు ప్రయత్నిస్తారు.. లేకపోతే ఏదైనా లక్ష్యం పెట్టుకుని ఆ గేమ్‌లోకి దిగుతారు..

Updated : 02 Jun 2021 09:40 IST

ఈనాడు క్రీడావిభాగం: ఎవరైనా నచ్చిన ఆటను ఎంచుకుని దానిలో రాణించేందుకు ప్రయత్నిస్తారు.. లేకపోతే ఏదైనా లక్ష్యం పెట్టుకుని ఆ గేమ్‌లోకి దిగుతారు.. కానీ హరియాణా కుర్రాడు సంజీత్‌ రూటే వేరు.. చదువును తప్పించుకునేందుకు బాక్సింగ్‌ను ఎంచుకున్నాడతను!! కానీ బాక్సింగ్‌ అతడిని వదల్లేదు. సంజీత్‌లో స్ఫూర్తిని నింపి ఆసియా ఛాంపియన్‌ను చేసింది. తాజాగా దుబాయ్‌లో     జరిగిన ఆసియా బాక్సింగ్‌ టోర్నీలో ఒలింపిక్‌ రజత పతక విజేత లెవిట్‌ను ఓడిస్తూ 91 కిలోల విభాగంలో పసిడి గెలిచి సత్తా చాటాడు 26 ఏళ్ల సంజీత్‌. 

బాక్సింగ్‌లోకి సంజీత్‌ ప్రయాణమే అనూహ్యం. అతడు ఈ క్రీడలోకి వచ్చే సమయానికే సంజీత్‌ సోదరుడు సంజీవ్‌ బాక్సర్‌. కానీ అతడు ఈ ఆటలో రాణించలేక వుషూ క్రీడలను ఎంచుకున్నాడు. దీంతో తమ రెండో తనయడు సంజీత్‌ను ఆటల్లోకి రానీయకూడదని గట్టి పట్టుదలతో ఉన్నారు అతడి తల్లిదండ్రులు. కానీ సంజీత్‌కు మాత్రం చదువు పెద్దగా అబ్బలేదు. పైగా పుస్తకాలు అంటేనే భయపడేవాడు. అందుకే చదువును తప్పించుకునేందుకు క్రీడాకారుడు కావాలని నిర్ణయించుకున్నాడు. అన్న బాటలో బాక్సర్‌ను అవుతానని తల్లిదండ్రులకు చెప్పాడు. మొదట వాళ్లు వ్యతిరేకించినా సంజీత్‌ పట్టుదలతో వారు మనసు మార్చుకున్నారు. అన్న సంజీవే అతడి తొలి కోచ్‌. ఇలా 2010లో ఆటలోకి వచ్చిన అతడు త్వరగా ఎదిగాడు. రింగ్‌లో చక్కని ఫుట్‌వర్క్, శక్తివంతమైన పంచ్‌లతో విజయాలు సాధిస్తూ వేగంగా ఎదిగాడు.

పంచ్‌ పవర్‌: నెమ్మదిగా సంజీత్‌ పంచ్‌లకు పతకాలు రావడం మొదలైంది. జాతీయ స్థాయిలో జూనియర్‌ విభాగంలో రాణించిన అతడు.. సీనియర్‌ విభాగంలోనూ సత్తా చాటాడు. జాతీయ కోచ్‌ కట్టప్ప శిక్షణలో మరింత రాటుదేలిన సంజీత్‌.. 2018లో జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌ అయ్యాడు. ఆ తర్వాత ఇండియా ఓపెన్లోనూ స్వర్ణం గెలిచి శభాష్‌ అనిపించాడు. ప్రపంచ కాంస్య పతక విజేత తుర్సొనోవ్‌ లాంటి బాక్సర్లను ఓడించి సత్తా చాటాడు. 2019లో కజకిస్థాన్‌లో జరిగిన ప్రెసిడెంట్స్‌ కప్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో క్వార్టర్‌ఫైనల్‌ వరకు వెళ్లిన సంజీత్‌.. త్రుటిలో ఓడిపోయాడు. అప్పుడు పరాజయం పాలైంది లెవిట్‌ చేతిలో కావడం విశేషం. నిజానికి అతడు టోక్యోకు కచ్చితంగా అర్హత సాధించాల్సిన వాడే. అయితే 2019 ప్రపంచ మిలటరీ క్రీడల్లో సంజీత్‌ భుజానికి గాయమైంది. దీనికి శస్త్ర చికిత్స జరగడంతో ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు దూరం కావాల్సి వచ్చింది. తాజాగా లెవిట్‌పై గెలిచి ఆసియా ఛాంపియన్‌ అయిన సంజీత్‌ మరోసారి సత్తా నిరూపించుకున్నాడు. ‘‘ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడం నా కెరీర్‌లోనే అత్యుత్తమ ఘట్టం. ఒలింపిక్స్‌ పతక విజేతను ఓడించడం చాలా గొప్పగా అనిపిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌కు తప్పకుండా అర్హత సాధిస్తానని అనుకున్నా.  అయితే పారిస్‌లో జరగాల్సిన ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీ కరోనా మహమ్మారి కారణంగా రద్దు కావడంతో ఆశలు ఆవిరయ్యాయి’’ అని సంజీత్‌ చెప్పాడు.  ‘‘ఇప్పుడు సంజీత్‌ అంటే శక్తివంతమైన పంచ్‌లకు పేరు. 2018లో ప్రెసిడెంట్స్‌ కప్‌లో లెవిట్‌ చేతిలో ఓడిన తర్వాత అతడి ఆట ఎంతో మెరుగైంది. రింగ్‌లో వేగం పెరిగింది.. పంచ్‌లు మరింత పదును తేలాయి. అయితే రింగ్‌లో తనకు తాను వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం’’ అని జాతీయ కోచ్‌ కట్టప్ప చెప్పాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని