VVS Laxman: రహానె ఓ మార్గం కనుక్కోవాలి 

మెరుగైన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ విభాగం నాటకీయంగా తమ జట్టు కుప్పకూల్చడంతో సౌథాంప్టన్‌లో భారత్‌ భయాలు

Updated : 21 Jun 2021 09:58 IST

వీవీఎస్‌ లక్ష్మణ్‌

మెరుగైన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ విభాగం నాటకీయంగా తమ జట్టు కుప్పకూల్చడంతో సౌథాంప్టన్‌లో భారత్‌ భయాలు నిజమయ్యాయి. బౌలర్లకు అనుకూలించిన పరిస్థితులను ఉపయోగించుకున్న కివీస్‌.. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ స్వభావం, క్రమశిక్షణను ప్రశ్నించింది. దురదృష్టవశాత్తూ భారత బ్యాట్స్‌మెన్‌ సరైన సమాధానాలు ఇవ్వలేదు. 300 చేసేలా కనిపించిన జట్టు.. 217కే ఆలౌటైంది. కోహ్లి, రహానేలపైనే మూడో రోజు జట్టు ఆశలు పెట్టుకుంది. కానీ తన ఓవర్‌నైట్‌ స్కోరుకు ఒక్క పరుగూ చేర్చనివ్వకుండానే విరాట్‌ను జేమీసన్‌ బుట్టలో వేసుకున్నాడు. ప్రత్యర్థి పేస్‌ దళంలో తక్కువ అనుభవం ఉన్న ఈ పొడగరి పేసర్‌ ఎక్కువగా ఆకట్టుకున్నాడు. అంత పొడుగున్న ఇలాంటి బౌలర్‌ లెంగ్త్, ఫుల్‌ బంతులేసి బ్యాట్స్‌మెన్‌ను ఎల్బీడబ్ల్యూ అయేలా ప్రేరేపించడం గొప్ప విషయం. మొదట విరాట్‌కు దూరంగా బంతులేసిన అతను.. ఒకేసారి వికెట్లకు నేరుగా బౌలింగ్‌ చేసి ఔట్‌ చేశాడు. మరో ఫుల్‌ బంతితో పంత్‌ను వెనక్కి పంపాడు. సుమారు అర్ధగంట పాటు ఓపిక పట్టిన పంత్‌.. జేమీసన్‌ ఊరించేలా వేసిన బంతికి తొందరపడి రెండో స్లిప్‌లో చిక్కాడు. అలాంటి పేలవ షాట్‌ ఆడినందుకు అతను చింతించాడు. కొన్నిసార్లు అలా జరుగుతుంటుంది. ఈ విషయంపై జట్టు మేనేజ్‌మెంట్‌ దృష్టి సారించాలి. రహానె వికెట్‌ ఎక్కువగా నిరాశపరిచింది. షార్ట్‌పిచ్‌ బంతికి అతనలా ఔటవడం ఇదే తొలిసారి కాదు. అనుభవజ్ఞుడైన రహానె అలాంటి బంతులను ఆడేందుకు ఓ మార్గం కనుక్కోవాలి. ఎందుకంటే ప్రతి షార్ట్‌ పిచ్‌ బంతిని పుల్‌ చేయాలనుకోవడం అత్యంత ప్రమాదకరం. స్క్వేర్‌లెగ్‌లోకి ఫీల్డర్‌ వచ్చినప్పటికీ అతను సగం షాటే ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. భారత్‌ అనుకున్న దానికంటే తక్కువ స్కోరే చేసినప్పటికీ.. కొన్నేళ్లుగా గొప్పగా రాణిస్తున్న బౌలింగ్‌ దళంపై భరోసా పెట్టుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, అదీ డ్యూక్‌ బంతితో వికెట్లు పడగొట్టడం కష్టమేమీ కాదు. భారత్‌ చేయాల్సిందిల్లా.. న్యూజిలాండ్‌లా ఓపికతో ఉంటూ, ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ, క్యాచ్‌లను పట్టుకోవడమే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని