Wimbledon: జకోవిచ్, ఫెదరర్‌ మళ్లీ..

2019 వింబుల్డన్‌ ఫైనల్‌ గుర్తుందా? స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్, సెర్బియా వీరుడు నొవాక్‌ జకోవిచ్‌ మధ్య అద్భుత పోరాటాన్ని అభిమానులు అంత తేలిగ్గా మరిచిపోరు. అయిదు సెట్ల హోరాహోరీ పోరులో జకోవిచ్‌...

Updated : 26 Jun 2021 10:40 IST

వింబుల్డన్‌లో పోటీపడే అవకాశం 
వేర్వేరు పార్శ్వాల్లో దిగ్గజ ఆటగాళ్లు 

లండన్‌: 2019 వింబుల్డన్‌ ఫైనల్‌ గుర్తుందా? స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్, సెర్బియా వీరుడు నొవాక్‌ జకోవిచ్‌ మధ్య అద్భుత పోరాటాన్ని అభిమానులు అంత తేలిగ్గా మరిచిపోరు. అయిదు సెట్ల హోరాహోరీ పోరులో జకోవిచ్‌ రెండు మ్యాచ్‌ పాయింట్లు కాచుకుని అప్పుడు టైటిల్‌ గెలిచాడు. ఏడాది విరామం తర్వాత జరుగుతున్న వింబుల్డన్‌లో మరోసారి ఫెదరర్, జకోవిచ్‌ మధ్య ఫైనల్‌ పోరాటం అభిమానులకు కనువిందు చేసే అవకాశముంది. ఈసారి వీరిద్దరు వేర్వేరు పార్శ్వాల్లో టైటిల్‌ కోసం పోటీపడనున్నారు. శుక్రవారం వింబుల్డన్‌ నిర్వాహకులు డ్రా విడుదల చేశారు. తొలి రౌండ్లో టాప్‌సీడ్‌ జకోవిచ్‌ వైల్డ్‌ కార్డు ఎంట్రీ 19 ఏళ్ల జాక్‌ డ్రేపర్‌తో ఆడనున్నాడు. ఆరో సీడ్‌ రోజర్‌ ఫెదరర్‌ ఫ్రాన్స్‌ ఆటగాడు అడ్రియన్‌ మనారినోతో తొలి పోరు ఆడనున్నాడు. 13వసారి వింబుల్డన్‌ ఫైనల్‌ చేరుకోవాలంటే మాత్రం అతడు డానియెల్‌ మెద్వెదెవ్, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌లను దాటాలి. రెండుసార్లు ఛాంప్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) 24వ సీడ్‌ నికోల్జ్‌ బసిలాష్విలితో తొలి రౌండ్లో పోటీపడనున్నాడు. జకోవిచ్, ముర్రే సెమీస్‌లో ఎదురుపడొచ్చు. నం.3 నాదల్, నం.5 డొమినిక్‌ థీమ్‌ వింబుల్డన్‌ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. మహిళల విభాగంలో 24వ గ్రాండ్‌స్లామ్‌ వేటలో ఉన్న సెరెనా విలియమ్స్‌ తొలి రౌండ్లో 100వ ర్యాంక్‌ క్రీడాకారిణి అలెక్‌జాండ్ర సాస్నోవిచ్‌తో తలపడనుంది. క్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ ఆష్‌ బార్టీ, అయిదో సీడ్‌ బియాంకా ఆండ్రెస్కూ.. అయిదో సీడ్‌ ఎలీనా స్వితోలినాతో ఆరోసీడ్‌ సెరెనా ఢీకొనే అవకాశముంది. సోమవారం వింబుల్డన్‌ ఆరంభం కానుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సిమోనా హలెప్‌ గాయం కారణంగా టోర్నీకి దూరమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని