రికాకో ఓ ధీర 

ఒలింపిక్స్‌లో పతకం.. ప్రతి అథ్లెట్‌ కల ఇది. ఆ అమ్మాయి అలాంటి కలతోనే కొలనులో దిగింది.

Published : 17 Jul 2021 08:53 IST

ఒలింపిక్స్‌లో పతకం.. ప్రతి అథ్లెట్‌ కల ఇది. ఆ అమ్మాయి అలాంటి కలతోనే కొలనులో దిగింది. 4 ఏళ్ల వయసులోనే స్విమ్మింగ్‌పూల్‌కు పరిచయమై.. ఎనిమిదేళ్లకే జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొంది. 15 ఏళ్లకే ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రికార్డులు కొల్లగొట్టింది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఏడు ఈవెంట్లలో పోటీపడింది.. పతకం మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితే 2018 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణ పతకాలతో మెరిసిన ఈ సంచలన స్విమ్మర్‌ స్వదేశంలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పసిడితో మెరవాలని ఎన్నో కలలు కనింది. కానీ విధి ఆమెను ఆసుపత్రిపాలు చేసింది. ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాటం చేసి విజయం సాధించిన ఆ సంచలన స్విమ్మర్‌ 21 ఏళ్ల రికాకో ఇకీ. ఇప్పుడు ఆమె మళ్లీ ఒలింపిక్స్‌ బాట పట్టింది. పతకం గెలిచే అవకాశం తక్కువే.. కానీ స్వదేశంలో ఒలింపిక్స్‌ బరిలో దిగుతున్నానన్న ఆనందం ఆమెకు ఎక్కువ సంతృప్తి కలిగిస్తోంది. రికాకోకు లుకేమియా ఉన్నట్లు 2019 ఫిబ్రవరిలో తేలింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చాన్నాళ్లూ పోరాడింది. అతి క్లిష్టమైన వైద్యంతో బతికి బయటపడింది. ఈ సమయంలో ఆమె ఏకంగా 18 కిలోలు బరువు తగ్గిపోయింది. అసలు తిరిగి ఆటలోకి వస్తానా అని భయపడింది.

కానీ మళ్లీ సాధన మొదలుపెట్టి ఈ ఏప్రిల్‌లో జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. వ్యక్తిగత విభాగాల్లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయినా.. 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రిలే, 4×100 మీటర్ల మెడ్లే రిలే జట్లలో చోటు సంపాదించింది. ‘‘ఎదుర్కొన్న కష్టాలను తలుచుకుంటే ఇప్పుడు నేను సాధించింది గొప్పగా అనిపిస్తోంది. ఒలింపిక్స్‌లో ఆడబోతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’ అని ఇకీ తెలిపింది. ఆస్ట్రేలియాలో శిక్షణ శిబిరంలో ఉండగా ఆమె అనారోగ్యం బారిన పడింది. పరీక్షల్లో లుకేమియాగా తేలడంతో కుంగిపోయింది. నెలల పాటు వైద్యం చేయించుకుని డిసెంబర్‌లో ఆసుపత్రి నుంచి డిశార్జీ అయిన ఆమె.. ఈసారి ఒలింపిక్స్‌ ఆశలు వదులుకుంది. 2024 పారిస్‌పైనే దృష్టి పెట్టాలని అనుకుంది. అయితే 2020 ఒలింపిక్స్‌ వాయిదా పడడంతో ఆమెకు మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ ఏడాది జాతీయ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటడం ద్వారా టీమ్‌ విభాగాల్లో చోటు దక్కించుకుంది. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని