IND vs ENG: టీమ్‌ఇండియా బౌలింగ్‌ అత్యుత్తమం: సచిన్‌

టాస్‌ గెలిచిన రూట్‌ టీమ్‌ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించడం ఆశ్చర్యానికి గురిచేసింది. భారత పేస్‌ దళాన్ని చూసి ఇంగ్లాండ్‌ ఆందోళనకు చెందుతుందనడానికి ఇదొక సంకేతంగా భావించా. వాతావరణం బాగుంటే ఈ టెస్టును మనం గెలుస్తామని..

Updated : 18 Aug 2021 07:44 IST

ఇంగ్లాండ్‌ టెస్టు జట్టులో కెప్టెన్‌ జో రూట్‌ మాత్రమే సెంచరీ సాధించేలా కనిపిస్తున్నాడని దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ అన్నాడు. టీమ్‌ఇండియా పేస్‌ దాడి ఇంగ్లాండ్‌ జట్టును విస్మయానికి గురిచేసిందని తెలిపాడు. లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా చిరస్మరణీయ విజయంపై సచిన్‌ అభిప్రాయాలు అతని మాటల్లోనే..

దిల్లీ : టాస్‌ గెలిచిన రూట్‌ టీమ్‌ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించడం ఆశ్చర్యానికి గురిచేసింది. భారత పేస్‌ దళాన్ని చూసి ఇంగ్లాండ్‌ ఆందోళనకు చెందుతుందనడానికి ఇదొక సంకేతంగా భావించా. వాతావరణం బాగుంటే ఈ టెస్టును మనం గెలుస్తామని శుక్రవారం ఉదయం 8 గంటలకు ఒక స్నేహితుడికి సందేశం పంపా. ప్రస్తుత ఇంగ్లాండ్‌ జట్టుకు బ్యాటింగ్‌లో కుప్పకూలిన చరిత్ర ఉంది. అక్కడే వారు పట్టుకోల్పోయినట్లుగా అనిపించింది. ఫలానా ఆటగాడు పెద్ద సెంచరీ సాధించగలడని అనిపించే బ్యాట్స్‌మెన్‌ ఇంగ్లాండ్‌ జట్టులో ఎంతమంది ఉన్నారు? రూట్‌ మినహా మరెవరూ అలా కనిపించట్లేదు. అలిస్టర్‌ కుక్, మైకెల్‌ వాన్, కెవిన్‌ పీటర్సన్, ఇయాన్‌ బెల్, జొనాథన్‌ ట్రాట్, ఆండ్రూ స్ట్రాస్‌ వంటి ఆటగాళ్లు ఎందరో గతంలో ఇంగ్లాండ్‌ జట్లకు ఆడారు. ప్రస్తుత జట్టులోని బ్యాట్స్‌మెన్‌ సెంచరీలు సాధించొచ్చు. కాని నిలకడగా భారీ శతకాలు చేసేవాళ్లు ఎందరున్నారు? రూట్‌ తప్పితే ఇంకెవరూ ఆ స్థాయిలో లేకపోవడం ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ పరిస్థితికి నిదర్శనం. బహుశా రూట్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోడానికి అదే కారణం కావొచ్చు.

ఆ ఇద్దరిదీ కీలకపాత్ర
భారత బ్యాటింగ్‌కు రోహిత్‌శర్మ దారి చూపించాడు. బ్యాటింగ్‌లో రోహిత్‌ నాయకుడిలా కనిపించాడు. అతనికి రాహుల్‌ అద్భుతమైన సహకారం అందించాడు. ఇంగ్లాండ్‌లో రోహిత్‌ ఇటీవలి ఇన్నింగ్స్‌లను గమనిస్తే అతను ఉన్నత స్థాయికి చేరుకున్నాడని చెప్పగలను. టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 28/3తో కష్టాల్లో ఉన్న సమయంలో పుజారా, రహానె కీలకపాత్ర పోషించారు. మరో రెండు వికెట్లు వెంటనే పడుంటే 60/5తో పరిస్థితి ఘోరంగా తయారయ్యేది. ఫలితం మరోలా ఉండేది. వారిద్దరు ఇన్నింగ్స్‌లో స్థిరత్వం తెచ్చారు. ఆ సమయంలో జట్టుకు ఏది మంచిదో అదే వాళ్లు చేశారు. ఈ సిరీస్‌లో విరాట్‌కు గొప్ప ఆరంభం లభించలేదు. మెదడులో ఇలాంటి ఆలోచనలు సాంకేతిక లోపాలకు దారితీస్తాయి. శుభారంభం లభించకపోతే అతిగా ఆలోచించడం మొదలుపెడతారు. ఆందోళన స్థాయిలు పెరుగుతాయి. ఫామ్‌లో లేని బ్యాట్స్‌మన్‌ వికెట్‌కు అడ్డంగా ఎక్కువ ఆడతారు. లేదా క్రీజులో పాదాలు అస్సలు కదలవు. ప్రతి ఒక్కరికి అలా జరుగుతుంది. ఫామ్‌ పూర్తిగా మానసిక స్థితి, శరీర పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

బుమ్రా రాటుదేలేది అప్పుడే
ప్రస్తుతం ప్రపంచంలోనే టీమ్‌ఇండియా బౌలింగ్‌ విభాగం అత్యుత్తమంగా ఉంది. ప్రతిభ, క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌ కోసం కష్టపడేతత్వం, నేర్చుకునే స్వభావానికి టీమ్‌ఇండియా బౌలింగ్‌ విభాగం ప్రతిరూపం. గత తరాలతో ఇప్పటి బౌలర్లను పోల్చడం నాకిష్టం ఉండదు. అప్పుడు ఆడిన బ్యాట్స్‌మెన్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కపిల్‌దేవ్, శ్రీనాథ్, జహీర్‌ఖాన్‌లు భిన్నమైన బ్యాట్స్‌మెన్‌ను ఎదుర్కొన్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు బుమ్రా సుదీర్ఘ స్పెల్స్‌ వేయలేదు. బుమ్రా ఎంత ఎక్కువగా బౌలింగ్‌ చేస్తే అంత బాగా రాటుదేలుతాడు. అతనికి పెద్ద మనసుతో పాటు తెలివి కూడా ఉంది. షార్ట్‌ పిచ్‌ డెలివరీల తర్వాత నెమ్మది బంతితో రాబిన్సన్‌ను బుమ్రా అద్భుతంగా బోల్తాకొట్టించాడు.

సిరాజ్‌ భిన్నం
మహ్మద్‌ సిరాజ్‌ది త్వరగా నేర్చుకునే తత్వం. పరిస్థితులకు తొందరగా అలవాటుపడతాడు. ఫాస్ట్‌ బౌలర్లకు త్వరగా నేర్చుకునే లక్షణం ఉండాలి. ప్రతి పేసర్‌కు బౌలింగ్‌ను అభివృద్ధి చేసుకునే దశ ఉంటుంది. ప్రస్తుతం సిరాజ్‌ అదే దశలో ఉన్నాడు. ఇప్పుడు అతనో భిన్నమైన బౌలర్‌. తన బౌలింగ్‌ను వేగంగా మెరుగు పరుచుకున్నాడు. నిరుడు మెల్‌బోర్న్‌ టెస్టుకు ఇప్పటికి సిరాజ్‌లో చాలా మార్పొచ్చింది. ఓవర్‌ను ఎలా నిర్మించుకోవాలి.. స్పెల్‌ను ఎలా పూర్తి చేయాలో చాలా బాగా నేర్చుకున్నాడు. ఇలాంటి ఆలోచన సామర్థ్యం చాలా కీలకం. ప్రతిసారి అతను నూటికి నూరు శాతం ప్రదర్శన కనబరుస్తాడు’’ అని సచిన్‌ వివరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని