Updated : 08 Oct 2021 07:11 IST

IPL 2021: పంజాబ్‌ నెగ్గినా ఇంటికే

చెన్నైపై గెలుపు

చెలరేగిన రాహుల్‌

ఐపీఎల్‌ సీజన్‌ను పంజాబ్‌ విజయంతో ముగించింది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆ జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించింది. రాహుల్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచినా.. రాజస్థాన్‌ రాయల్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చిత్తుగా ఓడించడంతో పంజాబ్‌ (14 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు) ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు రెండో అంచెలో వరుసగా నాలుగు విజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరిన ధోని సేన..
హ్యాట్రిక్‌ ఓటమితో (14 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లు) లీగ్‌ దశను ముగించింది.

దుబాయ్‌: పంజాబ్‌ కింగ్స్‌కు అదిరే విజయం.. గురువారం జరిగిన పోరులో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (76; 55 బంతుల్లో 8×4, 2×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/35), జోర్డాన్‌ (2/20) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేఎల్‌ రాహుల్‌ (98 నాటౌట్‌; 42 బంతుల్లో 7×4, 8×6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లక్ష్యాన్ని పంజాబ్‌ కేవలం 13 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. చెన్నై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ (3/28) ఒక్కడే రాణించాడు.

రాహుల్‌.. ఫటాఫట్‌: పంజాబ్‌ ఛేదనలో రాహుల్‌ ఆటే హైలైట్‌. గెలుపు మాత్రమే కాకుండా జట్టు ఓవరాల్‌ రన్‌రేట్‌ పెంచాలన్న లక్ష్యంతో ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై అతడు ఎదురుదాడి చేశాడు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో జోరు షురూ చేసిన కేఎల్‌.. ఆ తర్వాత టాప్‌గేర్‌లోకి వెళ్లిపోయాడు. స్వీప్‌, గ్లాన్స్‌, పుల్‌ షాట్లతో చెన్నై బౌలర్లను ఆటాడుకున్నాడు. శార్దూల్‌ ఠాకూర్‌ ఒకే ఓవర్లో మయాంక్‌ (12), సర్ఫ్‌రాజ్‌ (0) వికెట్లు తీసినా.. రాహుల్‌ మాత్రం తగ్గలేదు. శార్దూల్‌ బౌలింగ్‌నే ఫ్లిక్‌తో ఓ అద్భుతమైన సిక్స్‌ కొట్టిన కేఎల్‌.. దీపక్‌ చాహర్‌ వేసిన ఓ ఫుల్‌ బంతిని మోకాళ్లు వంచుతూ మరో చూడచక్కని సిక్స్‌ బాదేశాడు. ఈ క్రమంలోనే అతడు 25 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్కు అందుకున్నాడు. పది ఓవర్లకు పంజాబ్‌ స్కోరు 92 పరుగులు అయితే అందులో రాహుల్‌ వాటానే 63 పరుగులంటే అతడెంత ధాటిగా ఆడాడో అర్ధం చేసుకోవచ్చు. సిక్స్‌లే లక్ష్యం అన్నట్లు అతడు ఆడడంతో పంజాబ్‌ దాదాపు పది రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. పదకొండో ఓవర్లో దీపక్‌ బౌలింగ్‌లో మరో సిక్స్‌ అందుకున్న రాహుల్‌.. ఆ తర్వాత బ్రావో బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు లాగించాడు. ఈ రెండు సిక్స్‌లలో తొలి సిక్స్‌ను మణికట్టు ఉపయోగిస్తూ చాలా సులభంగా ఫ్లిక్‌తో స్టాండ్స్‌లోకి పంపాడు. ఈ ఒక్క ఓవర్‌లోనే బ్రావో 20 పరుగులు ఇచ్చుకున్నాడు. 13 ఓవర్‌ తొలి బంతికి మార్‌క్రమ్‌ (13) వెనుదిరిగినా.. మరో కళ్లుచెదిరే సిక్స్‌తో రాహుల్‌ మ్యాచ్‌ను ఘనంగా ముగించాడు.

డుప్లెసిస్‌ ఒక్కడే: అంతకుముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌ అంతా డుప్లెసిస్‌ చుట్టే తిరిగింది. పంజాబ్‌ బౌలర్ల దెబ్బకు 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జట్టును డుప్లెసిస్‌ ఆదుకున్నాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన అతడు అర్ధసెంచరీ చేయడమే కాక.. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టాడు. జడేజా (15 నాటౌట్‌)తో కలిసి అతడు ఆరో వికెట్‌కు విలువైన 67 పరుగులు జత చేశాడు.


చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) షారుక్‌ఖాన్‌ (బి) అర్ష్‌దీప్‌ 12; డుప్లెసిస్‌ (సి) రాహుల్‌ (బి) షమి 76; మొయిన్‌ అలీ (సి) రాహుల్‌ (బి) అర్ష్‌దీప్‌ 0; ఉతప్ప (సి) హర్‌ప్రీత్‌ (బి) జోర్డాన్‌ 2; రాయుడు (సి) అర్ష్‌దీప్‌ (బి) జోర్డాన్‌ 4; ధోని (బి) రవి బిష్ణోయ్‌ 12; జడేజా నాటౌట్‌ 15; బ్రావో నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 134

వికెట్ల పతనం: 1-18, 2-29, 3-32, 4-42, 5-61, 6-128

బౌలింగ్‌: షమి 4-0-22-1; హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4-0-22-0; అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-35-2; జోర్డాన్‌ 3-0-20-2; రవి బిష్ణోయ్‌ 4-0-25-1; హెన్రిక్స్‌ 1-0-9-0

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ నాటౌట్‌ 98; మయాంక్‌ ఎల్బీ (బి) శార్దూల్‌ 12; సర్ఫ్‌రాజ్‌ (సి) డుప్లెసిస్‌ (బి) శార్దూల్‌ 0; షారుక్‌ ఖాన్‌ (సి) బ్రావో (బి) దీపక్‌ చాహర్‌ 8; మార్‌క్రమ్‌ (సి) ధోని (బి) శార్దూల్‌ 13; హెన్రిక్స్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (13 ఓవర్లలో 4 వికెట్లకు) 139

వికెట్ల పతనం: 1-46, 2-46, 3-80, 4-126

బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-48-1; హేజిల్‌వుడ్‌ 3-0-22-0; శార్దూల్‌ ఠాకూర్‌ 3-0-28-3; జడేజా 1-0-9-0; బ్రావో 2-0-32-0


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని