T20 World Cup: వారెవ్వా వేడ్‌..

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో

Updated : 12 Nov 2021 08:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ కీలక పాత్ర పోషించాడు. 17 బంతుల్లోనే 41 పరుగులు చేయడంతో ఆసీస్‌ సులభంగా గెలుపొందింది.చివరి 4 ఓవర్లలో ఆసీస్‌ 50 పరుగులు చేయాల్సిన స్థితిలో మ్యాచ్‌లో స్పష్టమైన ఫేవరెట్‌ పాకిస్థానే. కానీ ఆసీస్‌ మరో ఓవర్‌ మిగిలి ఉండగానే గెలుస్తుందని ఒక్కరైనా ఊహించి ఉండరు. అంత అనూహ్యంగా మలుపు తిరిగింది మ్యాచ్‌. స్టాయినిస్‌, వేడ్‌   గేర్లు మార్చి ఆసీస్‌ను పోటీలోకి తెచ్చారు. 17వ ఓవర్లో (రవూఫ్‌)  స్టాయినిస్‌ ఓ సిక్స్‌, ఫోర్‌ కొట్టగా.. తర్వాతి ఓవర్లో (హసన్‌ అలీ) వేడ్‌ సిక్స్‌, ఫోర్‌ దంచాడు. అయినా చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన స్థితిలో లక్ష్యం ఆసీస్‌కు తేలిగ్గా ఏమీ లేదు. పైగా 19వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చింది టోర్నీ ఆరంభం నుంచి బ్యాట్స్‌మెన్‌కు కొరకరాని కొయ్యగా మారిన పేసర్‌ షహీన్‌ షా అఫ్రిది. అతణ్ని ఎదుర్కోవడం, బౌండరీలు బాదడం కష్టమైన పనే.

ఆ ఓవర్లో బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేస్తే.. పాక్‌ పైచేయి సాధించగలిగేది. అందుకు తగ్గట్లే తన పదునైన పేస్‌తో తొలి మూడు బంతుల్లో నాలుగు పరుగులే ఇచ్చి ఆసీస్‌పై ఒత్తిడి పెంచాడు అఫ్రిది. కానీ ఆ తర్వాత అతడికి, పాకిస్థాన్‌కు దిమ్మదిరిగే షాక్‌ తగిలింది. తర్వాతి మూడు బంతుల్లోనే మ్యాచ్‌ ముగిసింది. ఒత్తిడిలో వేడ్‌ బుర్ర చురుగ్గా పనిచేసింది. తెలివిగా బ్యాటింగ్‌ చేసిన అతడు.. అఫ్రిది బుల్లెట్‌ బంతులకు చుక్కలు చూపించాడు. వరుసగా మూడు సిక్స్‌లు బాది ఆసీస్‌కు సంచలన విజయాన్ని అందించాడు. మొదట వికెట్లను వదిలేస్తూ బంతిని షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లోకి కొట్టిన వేడ్‌.. ఆ తర్వాత మిడ్‌ వికెట్‌ మీదుగా దంచాడు. ఆ తర్వాత కళ్లు చెదిరే స్కూప్‌తో  వికెట్‌కీపర్‌గా మీదుగా స్టాండ్స్‌లో పడేశాడు. అంతే..  ఆసీస్‌ సంబరాల్లో మునిగిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని