Thomas Cup: బ్యాడ్మింటన్‌లో సువర్ణాధ్యాయం.. థామస్‌కప్‌ విజేతగా భారత్

భారత్‌ చరిత్ర సృష్టించింది. చిరస్మరణీయమైన ప్రదర్శనతో థామస్‌కప్‌ విజేతగా నిలిచింది.

Updated : 15 May 2022 16:27 IST

(ఫొటో సోర్స్‌: బాయ్‌ ట్విటర్‌)

బ్యాంకాక్‌ : భారత్‌ చరిత్ర సృష్టించింది. చిరస్మరణీయమైన ప్రదర్శనతో థామస్‌కప్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో బలమైన జట్టును ఓడించి బ్యాడ్మింటన్‌లో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. 14సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాపై చారిత్రక విజయాన్ని భారత్‌ నమోదు చేసింది. అద్భుత ఆటతీరులో భారత ఆటగాళ్లు తుదిపోరులో ఇండోనేషియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రత్యర్థి జట్టుపై 3-0 తేడాతో విజయ కేతనాన్ని ఎగరవేశారు.

తొలుత 20 ఏళ్ల యువ ఆటగాడు లక్ష్యసేన్ 8-21, 21-17, 21-16 తేడాతో ఒలింపిక్స్‌ రజత పతక విజేత ఆంథోనీ గింటింగ్‌పై విజయం  సాధించి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత డబుల్స్‌లో తెలుగు కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్‌ - చిరాగ్ శెట్టి  జోడీ 18-21, 23-21, 21-19తో మహ్మద్‌ అహసన్‌-సంజయ సుకమౌల్జోపై గెలుపొందారు. దీంతో ఇండోనేషియాపై 2-0 ఆధిక్యంలోకి భారత్‌ దూసుకెళ్లింది. ఈ రెండు గేముల్లోనూ తొలి సెట్‌ను కోల్పోయి మరీ విజయం సాధించడం విశేషం.  ఇక ఆఖరి గేమ్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ 21-15, 23-21 వరుస సెట్లలో జొనాతన్‌ క్రిస్టీని బోల్తా కొట్టించి 3-0 ఆధిక్యంతో థామస్‌ కప్‌ను భారత్‌ కైవసం చేసుకునేలా చేశాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని