ఓడినా.. ఘనంగానే

ప్రపంచకప్‌లో మొరాకో సంచలన జైత్రయాత్రకు ముగింపు పడింది. సెమీస్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఓడినా.. ఆ జట్టు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘనమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది.

Published : 16 Dec 2022 02:26 IST

అల్‌ ఖోర్‌: ప్రపంచకప్‌లో మొరాకో సంచలన జైత్రయాత్రకు ముగింపు పడింది. సెమీస్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఓడినా.. ఆ జట్టు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘనమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా, తొలి అరబ్‌ దేశంగా.. అటు ఖండానికి, ఇటు అరబ్‌ ప్రపంచానికి ఖ్యాతి తెచ్చిపెట్టింది. సెమీస్‌ పోరులో స్టాండ్స్‌ ఎర్ర చొక్కాలతో నిండిపోయిందంటేనే ఆ జట్టు ఎంతలా జనాలపై ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. ఆరోసారి ప్రపంచకప్‌ ఆడుతున్న ఆ జట్టు.. క్రొయేషియా, బెల్జియం లాంటి అగ్రశ్రేణి జట్లను వెనక్కినెట్టి అసలు గ్రూప్‌ దశ దాటుతుందనే అంచనాలే లేవు. కానీ క్రొయేషియాతో డ్రా చేసుకుని.. బెల్జియం, కెనడాలపై విజయాలతో అగ్రస్థానంతో ప్రిక్వార్టర్స్‌ చేరింది. నాకౌట్లో వరుసగా ఐరోపా శక్తిమంతమైన జట్లు స్పెయిన్‌, పోర్చుగల్‌పై గెలిచి ఔరా అనిపించింది. సెమీస్‌ ముందు వరకూ ప్రత్యర్థి ఆటగాళ్లకు ఒక్క గోల్‌ కూడా చేసే అవకాశమే ఆ జట్టు ఇవ్వలేదు. దీన్ని బట్టి ఆ జట్టు రక్షణశ్రేణి ఎంత దృఢంగా నిలబడిందో తెలుస్తోంది. కానీ ఫ్రాన్స్‌తో మ్యాచ్‌లో కీలక డిఫెండర్ల సేవలు కోల్పోవడంతో ఆ జట్టు బలహీనంగా మారింది. అయినా చివరి వరకూ పోరాడింది. ఇప్పుడిక మూడో స్థానం కోసం శనివారం క్రొయేషియాతో ఆ జట్టు తలపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు