ఫ్రాన్స్‌ పంజా

అసలు గ్రూప్‌ దశ దాటడమే కష్టమనుకున్న ఆ జట్టు గ్రూప్‌లో అగ్రస్థానం సాధించింది.. ఆ జట్టుపై గోల్స్‌ తేలిక అనుకుంటే.. హేమాహేమీ జట్లకూ సాధ్యం కాని విధంగా ప్రత్యర్థికి ఒక్క గోలైనా ఇవ్వకుండా సెమీఫైనల్‌ వరకు దూసుకొచ్చింది..

Updated : 16 Dec 2022 03:44 IST

సెమీస్‌లో మొరాకోపై 2-0తో గెలుపు
ఫైనల్లో అర్జెంటీనాతో ఢీ

అసలు గ్రూప్‌ దశ దాటడమే కష్టమనుకున్న ఆ జట్టు గ్రూప్‌లో అగ్రస్థానం సాధించింది.. ఆ జట్టుపై గోల్స్‌ తేలిక అనుకుంటే.. హేమాహేమీ జట్లకూ సాధ్యం కాని విధంగా ప్రత్యర్థికి ఒక్క గోలైనా ఇవ్వకుండా సెమీఫైనల్‌ వరకు దూసుకొచ్చింది.. గత టోర్నీ రన్నరప్‌ క్రొయేషియాను నిలువరించింది.. ప్రపంచ రెండో ర్యాంకర్‌ బెల్జియంకు షాకిచ్చింది.. స్పెయిన్‌ను ఇంటికి పంపింది.. పోర్చుగల్‌ను పడగొట్టింది! కానీ.. ఫ్రాన్స్‌ ముందు ఆ జట్టు ఆటలు సాగలేదు. సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా నిలిచిన మొరాకో ప్రయాణానికి అక్కడితోనే ముగింపు పలికింది ఫ్రాన్స్‌. అంచనాలను నిలబెట్టుకుంటూ.. అద్భుతమైన ఆటతీరుతో ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వరుసగా రెండో సారి ఫైనల్లో అడుగుపెట్టింది. చెరో గోల్‌ చేసిన హెర్నాండెజ్‌, రాండాల్‌.. మైదానంలో మెరుపులా కదిలిన ఎంబపె, గ్రీజ్‌మన్‌ ఆ జట్టు హీరోలు. ఇక మెస్సి × ఎంబాపె పోరుకు.. మూడోసారి కప్పుపై కన్నేసిన అర్జెంటీనా, ఫ్రాన్స్‌ సమరానికి.. ఆదివారం లుసైల్‌ స్టేడియం ఎదురు చూస్తోంది.

అంచనాలను తలకిందులు చేస్తూ ప్రపంచకప్‌లో తొలిసారి సెమీస్‌ చేరిన మొరాకో.. కీలక పోరులో ఫ్రాన్స్‌ ముందు తేలిపోయింది. బలమైన ప్రత్యర్థి ముందు ఆ జట్టు పోరాటం సరిపోలేదు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీస్‌లో ఫ్రాన్స్‌ 2-0 తేడాతో గెలిచి.. నాలుగోసారి ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరింది. స్టార్‌ ఆటగాళ్లు ఎంబాపె, గిరూడ్‌లు గోల్‌ కొట్టకుండా ప్రత్యర్థి అడ్డుకున్నా.. హెర్నాండెజ్‌ (5వ నిమిషంలో), రాండాల్‌ కోలో (79వ) రూపంలో మొరాకోకు ముప్పు తప్పలేదు. గాయంతో ఇబ్బంది పడుతున్న మొరాకో కెప్టెన్‌ రొమెయిన్‌ సైస్‌ 21వ నిమిషంలోనే బయటకు వెళ్లిపోవడం, మరో డిఫెండర్‌ నాయెఫ్‌ ఆడకపోవడం ఆ జట్టుపై ప్రభావం చూపింది. గోల్స్‌ చేయకున్నా ఎంబాపె, గ్రీజ్‌మన్‌ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ ఆధిపత్యం చలాయించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గ్రీజ్‌మన్‌ బంతిపై నియంత్రణ కొనసాగించి.. ప్రత్యర్థికి అవకాశమే లేకుండా చేశాడు. బంతిని పాస్‌ చేస్తూ.. ప్రత్యర్థి ఆటగాళ్లను అడ్డుకుంటూ.. డ్రిబ్లింగ్‌ చేస్తూ.. ఇలా మైదానంలో ఎక్కడ చూసినా ఈ మిడ్‌ఫీల్డరే కనిపించాడు. ఆరంభంలోనే బంతిని పాస్‌ చేసుకుంటూ ప్రత్యర్థి పెనాల్టీ ప్రదేశంలోకి ప్రవేశించిన అతను జట్టు తొలి గోల్‌లో కీలకంగా వ్యవహరించాడు. అందుకే అతనికే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. జట్టు చేసిన రెండు గోల్స్‌లోనూ ఎంబాపె ప్రమేయం ఉంది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్‌ మేక్రాన్‌ ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు.

అనూహ్యంగా ఆ ఇద్దరు..: మ్యాచ్‌లో బంతిపై నియంత్రణలో మొరాకోదే ఆధిపత్యం. కానీ కీలక ఆటగాళ్లు దూరమవడంతో బలహీనంగా మారిన మొరాకో డిఫెన్స్‌ను దాటుకుంటూ ఫ్రాన్స్‌ దాడులు చేసింది. తొలి గోల్‌ అనూహ్యంగా డిఫెండర్‌ హెర్నాండెజ్‌ ఖాతాలో చేరింది. గ్రీజ్‌మన్‌ పెనాల్టీ ప్రదేశంలో బంతిని ఎంబాపెకు పాస్‌ చేశాడు. గోల్‌ పోస్టు ముందే ఉన్న అతణ్ని ప్రత్యర్థి ఆటగాళ్లు అడ్డుకున్నారు. దీంతో అతని కిక్‌ డిఫెండర్‌కు తగిలి పక్కకు బౌన్స్‌ అయింది. అక్కడే ఉన్న హెర్నాండెజ్‌ ఎడమ కాలిని గాల్లోకి లేపి గోల్‌కీపర్‌కు చిక్కకుండా బంతిని లోపలికి తన్నాడు. ఈ టోర్నీలో మొరాకోపై ప్రత్యర్థి ఆటగాడు చేసిన తొలి గోల్‌ ఇదే. అనంతరం స్కోరు సమం చేసేందుకు మొరాకో తీవ్రంగా ప్రయత్నించింది. పదో నిమిషంలో అజెడిన్‌ కిక్‌ను ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ లోరిస్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. 17వ నిమిషంలో గిరూడ్‌ మంచి అవకాశాన్నే సృష్టించుకున్నా గోల్‌ చేయలేకపోయాడు. బంతిని అందుకుని ప్రత్యర్థి గోల్‌పోస్టు వైపు పరుగెత్తిన అతను తన్నిన బంతి గోల్‌పోస్టు పక్క బార్‌కు తగిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత మరోసారి కూడా బంతిని గోల్‌పోస్టు పక్కకు తన్నాడు. 44వ నిమిషంలో అల్‌ యామిక్‌ ఫ్రాన్స్‌కు షాకిచ్చినంత పని చేశాడు. గిరూడ్‌ తలకు కార్నర్‌ కిక్‌ తగలడంతో పైకి లేచిన బంతిని.. నెట్‌ ముందు బైసికిల్‌ కిక్‌తో లోపలికి పంపించేందుకు అతను ప్రయత్నించాడు. కానీ లోరిస్‌ డైవ్‌ చేసి గొప్పగా బంతిని ఆపాడు. అయితే వెనక్కి వచ్చిన బంతిని మళ్లీ నెట్‌లోకి పంపించేందుకు మొరాకో ఆటగాళ్లు వేగంగా స్పందించి ఉంటే స్కోరు సమం చేసే అవకాశం వచ్చేది. తొలి అర్ధభాగంలో ఎంబాపెను లక్ష్యంగా చేసుకున్న మొరాకో.. అతణ్ని అడ్డుకోవడంపైనే దృష్టి సారించింది. దీంతో మొదట్లో అతనికి బంతి అంత సులభంగా దొరకలేదు. అంతే కాకుండా ప్రత్యర్థి ఆటగాళ్లతో పోటీపడే క్రమంలో కిందపడి మధ్యలో చికిత్స కూడా తీసుకున్నాడు. ద్వితీయార్ధంలో మొరాకో డిఫెన్స్‌ అలసిపోయినట్లు కనిపించడంతో ఎంబాపె జోరు పెంచాడు. అటు గ్రీజ్‌మన్‌ కూడా దూకుడు కొనసాగించాడు. డిఫెన్స్‌లో ఫ్రాన్స్‌ బలంగా నిలబడడంతో గోల్‌ పోస్టు వరకూ బంతిని తీసుకెళ్లిన మొరాకో ఆటగాళ్లు గోల్స్‌ మాత్రం చేయలేకపోయారు. 78వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రాండాల్‌ తర్వాతి నిమిషంలోనే గోల్‌ చేసి జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. గోల్‌పోస్టు ముందు నలుగురు డిఫెండర్లను దాటుకుని ఎంబాపె గోల్‌ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి ఓ డిఫెండర్‌ కాలికి తగిలి కుడివైపు ఉన్న రాండాల్‌ ముందుకు వెళ్లింది. గోల్‌పోస్టు ముందే  ఉన్న అతను ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని లోపలికి పంపించాడు. దీంతో మొరాకో మరింత ఢీలా పడింది. అయినా ఇంజూరీ సమయంలో గోల్స్‌ కోసం ఆ జట్టు తీవ్రంగా పోరాడింది. వరుస దాడులు చేసింది. ప్రత్యర్థి గోల్‌పోస్టులోకి చొచ్చుకెళ్లేలా కనిపించింది. గోల్‌పోస్టు ముందు ఫ్రాన్స్‌ ఆటగాడు కౌండె లేకపోయి ఉంటే ఆ జట్టుకు ఆఖర్లో ఓ గోల్‌ దక్కేదే. చివర్లో బలమైన ఫ్రాన్స్‌ రక్షణశ్రేణి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో కన్నీళ్లతో ప్రపంచకప్‌లో అద్భుత ప్రస్థానాన్ని మొరాకో ముగించింది. ఆ జట్టు ఆటగాళ్లను ఫ్రాన్స్‌ క్రీడాకారులు ఓదార్చడం క్రీడాస్ఫూర్తికి అద్దం పట్టింది.


1

చివరగా బ్రెజిల్‌ తర్వాత (1998, 2002) వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో ఫైనల్‌ చేరిన తొలి జట్టు ఫ్రాన్స్‌.


4

ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడం ఫ్రాన్స్‌కిది నాలుగో సారి. 1998, 2018లో కప్పు దక్కించుకున్న ఆ జట్టు.. 2006లో రన్నరప్‌గా నిలిచింది. గత ఏడు ప్రపంచకప్‌ల్లోనూ ఆ జట్టు నాలుగుసార్లు తుదిపోరుకు చేరడం విశేషం.


19

ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ లోరిస్‌ ఆడిన మ్యాచ్‌లు. అత్యధిక ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆడిన గోల్‌కీపర్‌గా మాన్యుయల్‌ నోయర్‌ (జర్మనీ) సరసన చేరాడు.


* మ్యాచ్‌లో 4 నిమిషాల 39 సెకన్లకు హెర్నాండెజ్‌ గోల్‌ కొట్టాడు. 1958 (బ్రెజిల్‌ తరపున ఎడ్వాల్డో) తర్వాత ఓ ప్రపంచకప్‌ సెమీస్‌లో తక్కువ సమయంలో నమోదైన గోల్‌ ఇదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని