Lionel Messi: లియొనెల్‌ వెనుక లియొనెల్‌

2018 ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌ చేతిలో ఓడిపోవడంతో అర్జెంటీనా ఫుట్‌బాల్‌లో నైరాశ్యం ఆవరించింది. కెప్టెన్‌ లియొనెల్‌ మెస్సి రిటైర్‌మెంట్‌ ప్రకటించి అభిమానులకు ఇంకా పెద్ద షాకిచ్చాడు.

Published : 19 Dec 2022 04:22 IST

2018 ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌ చేతిలో ఓడిపోవడంతో అర్జెంటీనా ఫుట్‌బాల్‌లో నైరాశ్యం ఆవరించింది. కెప్టెన్‌ లియొనెల్‌ మెస్సి రిటైర్‌మెంట్‌ ప్రకటించి అభిమానులకు ఇంకా పెద్ద షాకిచ్చాడు. ఒకవైపు జట్టు ఓడిపోయిందనే బాధ.. ఇంకోవైపు తమ ఆరాధ్య ఆటగాడు ఫుట్‌బాల్‌కు దూరమవుతున్నాడనే వేదన. అసలు జట్టు పుంజుకుంటుందా అన్న అనుమానం! కానీ నాలుగేళ్ల తర్వాత ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా అర్జెంటీనా! మెస్సి తిరిగొచ్చాడు.. విజయాలు వరుస కట్టాయి. కప్‌ సొంతమైంది. దీనికి ప్రత్యక్ష కారణం మైదానంలో మెస్సి అయితే.. పరోక్షంగా మరో లియొనల్‌ అర్జెంటీనాను నడిపించాడు. వేదనలో ఉన్న మెస్సికి ఉద్భోద చేసి.. జట్టులో జవసత్వాలు తెచ్చి ట్రాక్‌ ఎక్కించాడు. అతడే లియొనెల్‌ స్కాలోని.. అర్జెంటీనా మేనేజర్‌.

గత ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్‌లోనే అర్జెంటీనా ఇంటిముఖం పట్టిన తర్వాత కెప్టెన్‌ మెస్సి వీడ్కోలు చెబితే అప్పటి మేనేజర్‌ జార్జ్‌ సంపోలి కూడా ఓటమికి బాధ్యత వహిస్తూ తప్పుకున్నాడు. ఈ సంక్షోభ సమయంలో జట్టును మళ్లీ గాడిలో పెట్టేందుకు కోచ్‌గా ఉండాలని అర్జెంటీనా ఫుట్‌బాల్‌ సమాఖ్య అభ్యర్థనను దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా తిరస్కరించాడు. మాజీ ఆటగాళ్లు డిగో సిమోన్‌, మార్సెలో గాలార్డో, మొరికో లాంటి వాళ్లు తాము కోచ్‌గా ఉండలేమని తేల్చి చెప్పారు. ఈ స్థితిలో 2015లో రిటైరై అర్జెంటీనా కోచింగ్‌ సిబ్బందిలో ఒకడిగా ఉన్న లియొనెల్‌ స్కాలోని ఆ జట్టుకు దిక్కుగా మారాడు. స్కాలోనికి మేనేజర్‌ పదవి అప్పగించడంపై మారడోనాతో సహా మాజీలంతా తీవ్రంగా విమర్శించారు. విమర్శలు ఎదురైనా.. తీవ్ర ఒత్తిడి ఉన్నా స్కాలోని తొణకలేదు. మేనేజర్‌ బాధ్యతలు తీసుకున్నాక అతడి చేసిన మొదటి పని మెస్సిని తిరిగి జట్టులోకి తీసుకు రావడం. 16 ఏళ్ల క్రితం తనతో కలిసి ఆడిన మెస్సితో బంధాన్ని దృఢపరుచుకున్నాడు. అక్కడ నుంచి స్కాలోని మాయ మొదలైంది. జట్టును ఏకతాటిపై నడిపించి భిన్నమైన వ్యూహాలతో అర్జెంటీనా ఆటతీరులో మార్పు తెచ్చాడు.

వరుస విజయాలు: ఒత్తిడికి లొంగిపోయే అలవాటు నుంచి బయటపడిందంటే అది అతడి ఘనతే. ముందుగా లీగుల్లో అదరగొడుతున్న జేవియర్‌, మార్కోస్‌, గోంజాలో హిగియాన్‌, లుకాస్‌ బిగ్లియా లాంటి కుర్రాళ్లను గుర్తించాడు. మెస్సితో పాటు అతడికి వారసులుగా నిలవగల ఆటగాళ్లను తయారు చేసే పనిలో పడ్డాడు. జూలియన్‌ అల్వెరెజ్‌ ఆ కోవకే చెందుతాడు. జట్టులో ఆటగాళ్ల మధ్య సోదర బంధాన్ని పెంచాడు. మెస్సికి వీలైనంత స్వేచ్ఛ ఇచ్చాడు. మేనేజర్‌ను పూర్తిగా నమ్మినప్పుడు ఆటగాళ్లు అద్భుతాలు చేయగలరని నిరూపించాడు. స్కాలోని హయాంలో అర్జెంటీనా డిఫెన్స్‌ దుర్భేద్యంగా మారింది. అటాకింగ్‌లోనూ మెరుగైంది. స్కాలోని మేనేజర్‌గా ఉన్న సమయంలో 56 మ్యాచ్‌లు ఆడిన అర్జెంటీనా 41 మ్యాచ్‌ల్లో విజయాలు అందుకుంది. కేవలం ఆరింట్లోనే ఓడింది. 2021 కోపా అమెరికా కప్‌ గెలవడంలో అతడిది కీలకపాత్ర. గత 28 ఏళ్లలో అర్జెంటీనాకు అదే తొలి మేజర్‌ టైటిల్‌. వరుసగా 35 విజయాలు సాధించి ఈసారి ప్రపంచకప్‌కు వచ్చిన అర్జెంటీనా.. తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో కంగుతిని ఢీలా పడింది. అయినా మళ్లీ జట్టు పుంజుకుని ఫైనల్‌ చేరడమే కాదు కప్‌ కూడా నెగ్గిందంటే ఆ ఘనత మైదానంలో మెస్సిది మాత్రమే కాదు తెర వెనుక స్కాలోనిది కూడా. కీలక సమయాల్లో అతడి వ్యూహాలు అర్జెంటీనాకు కలిసొచ్చాయి. క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌పై ముగ్గురు డిఫెండర్లను దింపడం, లూకా మోడ్రిచ్‌ను నియంత్రించడానికి క్రొయేషియాతో సెమీస్‌లో ముగ్గురు మిడ్‌ఫీల్డర్లను ఏర్పాటు చేయడం లాంటివి అందులో కీలకమైనవి.


2

ప్రపంచకప్‌ ఫైనల్లో హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టిన రెండో ఆటగాడు ఎంబాపె. ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు జెఫ్‌ హస్ట్‌ (1966) అతని కంటే ముందున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇది రెండో హ్యాట్రిక్‌. ప్రిక్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌పై పోర్చుగల్‌ ఆటగాడు రామోస్‌ మూడు గోల్స్‌ కొట్టాడు.


3

ప్రపంచకప్‌ ఫైనల్లో 0-2తో వెనకబడి ఓ జట్టు తిరిగి పుంజుకోవడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు జర్మనీ (1954లో 0-2 నుంచి 3-2కు, 1986లో 0-2 నుంచి 2-2కు)లో ఇలా పుంజుకుంది.


172

ఈ ప్రపంచకప్‌లో నమోదైన గోల్స్‌. అత్యధిక గోల్స్‌ నమోదైన ప్రపంచకప్‌ ఇదే. గతంలో 1998, 2014 టోర్నీల్లో 171 గోల్స్‌ చొప్పున నమోదయ్యాయి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని