జైలు మేలు చేసింది

జైలు తనకు మేలే చేసిందని, ఇకపై జీవితంలో తప్పులు చేయకుండా కొత్త అధ్యాయాన్ని సాగిస్తానని టెన్నిస్‌ దిగ్గజం బోరిస్‌ బెకర్‌ తెలిపాడు.

Updated : 22 Dec 2022 11:02 IST

బెర్లిన్‌: జైలు తనకు మేలే చేసిందని, ఇకపై జీవితంలో తప్పులు చేయకుండా కొత్త అధ్యాయాన్ని సాగిస్తానని టెన్నిస్‌ దిగ్గజం బోరిస్‌ బెకర్‌ తెలిపాడు. దివాలా నేరాల కింద బ్రిటన్‌లోని వాండ్స్‌వర్త్‌ కారాగారంలో ఎనిమిది నెలల శిక్ష అనుభవించిన అతను ఇటీవల విడుదలయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జైలు జీవితాన్ని ఈ ఆరు గ్రాండ్‌స్లామ్‌ల విజేత పంచుకున్నాడు. ‘‘ఒక్కరే ఉండే జైలు గదిలోకి నన్ను పంపించారు. నా జీవితంలో నేను గడిపిన అత్యంత ఒంటరి క్షణం అదే. జైలుకు తరలించే ముందు కుటుంబ సభ్యులకు కనీసం వీడ్కోలు చెప్పలేకపోయా. తోటి ఖైదీలు దాడి చేస్తారేమోనని భయపడ్డా. అంతకుముందు జైలు జీవితం గురించి సినిమాలు చూసినా ఎలాంటి ఉపయోగం కలగలేదు. నా భద్రత కోసం జైలు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒక్కడినే ఉండేలా గది ఇచ్చారు. నాకు సాయంగా ఉండేందుకు ముగ్గురు అనుభవజ్ఞులైన ఖైదీలను ఏర్పాటు చేశారు. కారాగారంలో హింస  అనేది పెద్ద సమస్యగా మారింది. తోటి ఖైదీలు నన్ను బెదిరించేవాళ్లు. అక్కడ పెట్టే ఆహారం తినలేక తొలిసారి నా జీవితంలో ఆకలిని అనుభవించా. అక్కడి వాళ్లకు ఆంగ్లం, గణితం బోధించా. నా పుట్టినరోజుకు సహచర ఖైదీలు కేకులు తెచ్చారు. స్వేచ్ఛా ప్రపంచంలోనూ అలాంటి సంఘీభావాన్ని చూడలేదు. కోర్టు విచారణ సందర్భంగా మరింత స్పష్టతతో, ఉద్వేగంతో ఉండాల్సింది. నేను తప్పు చేశా. నేరాన్ని అంగీకరించా. ఇప్పటికీ మంచే జరిగింది. మరింత దారుణమైన శిక్ష ఉండొచ్చని అనుకున్నా. ఇప్పుడు జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలెడతా’’ అని బెకర్‌ తెలిపాడు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే జర్మనీలో ఇకపై ఉండబోనని, భాగస్వామితో కలిసి మియామి లేదా దుబాయికి వెళ్తానని అతను చెప్పాడు. దివాలా  తీశానని ప్రకటించిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బును అక్రమంగా బదిలీ చేయడం, ఆస్తులను దాచడం లాంటి నేరాల్లో అతనికి ఈ ఏడాది   ఏప్రిల్‌లో 30 నెలల జైలుశిక్షను విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని