T20 League Auction: ఎవరిదో జాక్‌పాట్‌

భారత టీ20 సమరానికి ముందు మరో సమరం. అయితే ఇది పరుగుల కోసం కాదు.. ఆటగాళ్ల కోసం.

Updated : 23 Dec 2022 13:43 IST

భారత టీ20 లీగ్‌ మినీ వేలం నేడు

కోచి

భారత టీ20 సమరానికి ముందు మరో సమరం. అయితే ఇది పరుగుల కోసం కాదు.. ఆటగాళ్ల కోసం. పేరుకే మినీ వేలం కానీ సామ్‌ కరన్‌, స్టోక్స్‌, కామెరాన్‌ గ్రీన్‌ వంటి మేటి ఆల్‌రౌండర్లు శుక్రవారం జరిగే వేలంపై ఆసక్తిని అమాంతం పెంచేస్తున్నారు. మరి రికార్డులు బద్దలవుతాయా? జాక్‌పాట్‌ ఎవరికి తగులుంది? ఆశ్చర్యపరిచేదెవరు? చూడాల్సిందే.


ఎప్పుడు.. ఎక్కడ?

ఇది నిరుడు జరిగిన మెగా వేలం లాంటిది కాదు. ప్రతి ఏటా ఉండే వేలం. అమ్మకానికి తక్కువ మంది ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు. ఫ్రాంఛైజీల దగ్గర డబ్బు కూడా అంత ఎక్కువగా ఉండదు. కానీ కొన్ని జట్ల వద్ద వేలాన్ని ఆసక్తిగా మలిచేంత సొమ్మైతే ఉంది. ఈసారి భారత టీ20 లీగ్‌ వేలానికి వేదిక కోచి. శుక్రవారం మధ్యాహ్నం 2.30కు వేలం ఆరంభమవుతుంది.


వేలంలో ఎంతమంది?

వేలానికి 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. తుది జాబితాలో ఆ సంఖ్యను 405కు కుదించారు. 273 మంది భారత క్రికెటర్లు, 132 మంది విదేశీ క్రికెటర్లు వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఖాళీలు మాత్రం పరిమితమే. ఫ్రాంఛైజీలన్నీ కలిపి గరిష్టంగా 87 (విదేశీయులు 30) మందినే కొనుక్కునే అవకాశముంది. ఒక ఫ్రాంఛైజీలో కనిష్టంగా 18 మంది, గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండాలి. ఒక జట్టులో గరిష్టంగా ఎనిమిది మంది విదేశీ క్రికెటర్లకు చోటుంది.


అత్యధికం ఎవరికో..?

భారత టీ20 వేలం అంటేనే రికార్డుల మోత. అమ్మకానికి ఎంత మంది ఉన్నా.. అత్యంత ఆసక్తి కలిగించే విషయం మాత్రం అత్యధిక ధర పలికే వీరుడెవరన్నదే. 2021 వేలంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌కు జాక్‌పాట్‌ తగిలింది. రూ.16.25 కోట్లతో భారత టీ20 లీగ్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. రాజస్థాన్‌ అతణ్ని కొనుక్కుంది. టీ20 ప్రపంచకప్‌లో విశేషంగా రాణించిన ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌కు ఈసారి రికార్డు ధర పలికితే ఆశ్చర్యం లేదు. అత్యధిక డబ్బు ఉన్న హైదరాబాద్‌, పంజాబ్‌ కరన్‌ కోసం గట్టిగా పోటీపడే అవకాశముంది. ఆల్‌రౌండర్లు స్టోక్స్‌ (ఇంగ్లాండ్‌), కామెరాన్‌ గ్రీన్‌ (ఆస్ట్రేలియా)కు కూడా భారీ ధర పలుకుతుందని భావిస్తున్నారు. మరో ఇంగ్లాండ్‌ ఆటగాడు బ్రూక్‌కూ మంచి డిమాండ్‌ ఉండొచ్చు. హైదరాబాద్‌ వదులుకున్న కేన్‌ విలియమ్సన్‌, పూరన్‌ ఏ జట్టులో చేరతారన్నది ఆసక్తికరం. మయాంక్‌ అగర్వాల్‌ను ఎవరు కొంటారో చూడాలి. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ కూడా అదృష్టానికి పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు.


15 ఏళ్ల చిన్నోడు కూడా..

అఫ్గానిస్థాన్‌కు చెందిన 15 ఏళ్ల మిస్టరీ స్పిన్నర్‌ అలా మహ్మద్‌ ఘజాన్‌ఫార్‌ ఈ భారత టీ20 లీగ్‌ వేలంలో ఉన్న అతి చిన్న వయసు ఆటగాడు. అఫ్గాన్‌ దేశవాళీ క్రికెట్లో మూడు టీ20 మ్యాచ్‌లే ఆడినప్పటికీ తన ప్రతిభతో అందరినీ ఆకర్షించిన ఈ కుర్రాడు.. భారత టీ20 లీగ్‌ వేలం తుది జాబితాలో చోటు సంపాదించాడు. ఇక భారత మాజీ లెగ్‌స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా 40 ఏళ్ల వయసులో వేలంలో అతి పెద్ద వయస్కుడిగా ఉన్నాడు.


వీళ్లపై ఓ కన్నేయండి

ఇంకా అరంగేట్రం చేయని కొంత మంది దేశీ ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఆసక్తి ప్రదర్శించే అవకాశముంది. భారీ సిక్స్‌లు కొట్టగల పంజాబ్‌ ఆల్‌రౌండర్‌ సన్వీర్‌ సింగ్‌, విజయ్‌ హజారె ట్రోఫీలో వరుసగా అయిదు శతకాలతో రికార్డు సృష్టించిన తమిళనాడు వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జగదీశన్‌లకు కూడా మంచి ధర పలకొచ్చు. విదర్భ పేసర్‌ యశ్‌ ఠాకూర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎడమచేతి వాటం ఫినిషర్‌ ఆకాశ్‌ వశిష్ఠ్‌లూ వేలంలో జట్లను ఆకర్షించవచ్చు. ఆకాశ్‌ ఉపయుక్తమైన స్పిన్నర్‌ కూడా. జమ్ము కశ్మీర్‌ యువ పేసర్లు షారుఖ్‌ దర్‌, ముజ్తబా యూసుఫ్‌ వేలంలో ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని