KL Rahul: కుల్‌దీప్‌ను తప్పించినందుకు బాధ లేదు: కేఎల్‌ రాహుల్‌

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో కుల్‌దీప్‌ను తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. స్పిన్‌కు ఎక్కువగా అనుకూలించిన పిచ్‌పై అతణ్ని ఎందుకు ఆడించలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Published : 26 Dec 2022 08:32 IST

మీర్పూర్‌: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో కుల్‌దీప్‌ను తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. స్పిన్‌కు ఎక్కువగా అనుకూలించిన పిచ్‌పై అతణ్ని ఎందుకు ఆడించలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ కుల్‌దీప్‌ విషయంలో తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి బాధ లేదని, అది సరైందేనని టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ చెప్పాడు. ‘‘కుల్‌దీప్‌ను తప్పించేలా తీసుకున్న నిర్ణయంపై బాధ లేదు. అది సరైందే. ఈ పిచ్‌పై మా పేసర్లు కూడా వికెట్లు తీశారు. వీళ్లకూ పిచ్‌ సహకరించింది. అస్థిరమైన బౌన్స్‌ లభించింది. ఇక్కడ వన్డేలు ఆడిన అనుభవం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. స్పిన్‌, బౌన్స్‌కు సహకారం లభించడం చూశాం. జట్టు కూర్పు సమతూకంతో ఉండాలనుకున్నాం. తొలి టెస్టును గెలిపించిన కుల్‌దీప్‌ను పక్కకు పెట్టాలన్నది కఠిన నిర్ణయం. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ (సబ్‌స్టిట్యూట్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేయడం) అవకాశం ఉంటే రెండో ఇన్నింగ్స్‌లో అతనితో బౌలింగ్‌ చేయించేవాణ్ని’’ అని అతను తెలిపాడు. ఈ సిరీస్‌లో రాహుల్‌ (57 పరుగులు), కోహ్లి (45) విఫలమయ్యారు. ఫార్మాట్లకు తగ్గట్లుగా వేగంగా ఆటను మార్చుకోవడం సవాలేనని ఈ నేపథ్యంలో రాహుల్‌ వ్యాఖ్యానించాడు. ‘‘మూడు ఫార్మాట్లు ఆడుతుంటే.. ఒక దాని నుంచి మరొకదానికి మారడం కష్టంగా ఉంటుంది. ఆ ఫార్మాట్‌కు తగ్గట్లుగా ఆటను మార్చుకోవడానికి సమయం పడుతుందని నా అభిప్రాయం. పరిస్థితులను ఎంత త్వరగా అర్థం చేసుకుంటామనేది సవాలే. ఈ సిరీస్‌లో నా ప్రదర్శన గొప్పగా లేదని ఒప్పుకుంటా. దురదృష్టవశాత్తూ మా షెడ్యూల్‌ కూడా తీరిక లేని విధంగా ఉంది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు, టెస్టులకు మధ్య కాస్త విరామం ఉండాలి’’ అని అతను పేర్కొన్నాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శ్రేయస్‌ ఉత్తమంగా ఆడుతున్నాడని రాహుల్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని