IND Vs BAN: హమ్మయ్య..గెలిచారు

ఆదివారం ఆట మొదలైంది. గింగిరాలు తిరుగుతున్న బంతి.. ఎప్పుడు ఎంత ఎత్తులో వస్తుందో తెలియని అస్థిర బౌన్స్‌. బంతి బ్యాటర్ల ప్యాడ్లను తాకుతోంది.. ప్రత్యర్థి ఆటగాళ్లు పదేపదే అప్పీల్‌ చేస్తున్నారు.. వికెట్లు పడుతున్నాయి.. లక్ష్యం కొంచెం కొంచెం కరుగుతోంది.

Updated : 26 Dec 2022 08:18 IST

సిరీస్‌ 2-0తో వశం
రెండో టెస్టులో టీమ్‌ఇండియా విజయం
గట్టెక్కించిన అశ్విన్‌, శ్రేయస్‌

ఆదివారం ఆట మొదలైంది. గింగిరాలు తిరుగుతున్న బంతి.. ఎప్పుడు ఎంత ఎత్తులో వస్తుందో తెలియని అస్థిర బౌన్స్‌. బంతి బ్యాటర్ల ప్యాడ్లను తాకుతోంది.. ప్రత్యర్థి ఆటగాళ్లు పదేపదే అప్పీల్‌ చేస్తున్నారు.. వికెట్లు పడుతున్నాయి.. లక్ష్యం కొంచెం కొంచెం కరుగుతోంది. భారత స్కోరు 74/7. విజయానికి ఇంకా 71 పరుగులు కావాలి. మరో వికెట్‌ పడితే అంతే సంగతి! బంగ్లాదేశ్‌ చేతిలో భారత్‌కు మొట్టమొదటి టెస్టు ఓటమి తప్పదేమోనన్న అనుమానాలు. కానీ కఠిన పరిస్థితుల్లో అశ్విన్‌, శ్రేయస్‌ నిలబడ్డారు. స్పిన్నర్ల ముప్పేట దాడిని తట్టుకుని.. పరాభవ ప్రమాదాన్ని తప్పించారు. ఎనిమిదో వికెట్‌కు అభేద్యమైన 71 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. 2-0తో టెస్టు సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్‌ నవ్వులతో పర్యటన ముగించింది.

మీర్పూర్‌: హమ్మయ్యా.. భారత్‌ గెలిచింది. ఉత్కంఠభరితంగా ముగిసిన రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. 145 పరుగుల ఛేదనలో.. ఓవర్‌నైట్‌ స్కోరు 45/4తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా నాలుగో రోజు మరో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అశ్విన్‌ (42 నాటౌట్‌; 62 బంతుల్లో 4×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (29 నాటౌట్‌; 46 బంతుల్లో 4×4) జట్టును ఆదుకున్నారు. మెహిదీ మిరాజ్‌ (5/63) సత్తాచాటాడు. మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లో మెరిసిన అశ్వినే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’. పుజారా (2 టెస్టుల్లో 222 పరుగులు) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానాన్ని బలోపేతం చేసుకుంది.

ఆ ఇద్దరు నిలబడి..

నాలుగో రోజు రెండో ఓవర్లోనే ఉనద్కత్‌ (13)ను షకిబ్‌ (2/50) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 26తో బ్యాటింగ్‌ కొనసాగించిన అక్షర్‌ (34)కు జత కలిసిన పంత్‌ (9) మరోసారి ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తాడనే ఆశలు కలిగాయి. కానీ అతను ఈ సారి నిలబడలేకపోయాడు. మిరాజ్‌ బంతిని ఎలా ఆడాలో అర్థం కాక వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. తన తర్వాతి ఓవర్లోనే అక్షర్‌ పోరాటానికి ముగింపు పలికిన మిరాజ్‌.. భారత్‌ను గట్టిదెబ్బ తీశాడు. మరో వికెట్‌ పడితే భారత్‌ పని అయిపోయినట్లే! మిగిలింది ఉమేశ్‌, సిరాజ్‌ మాత్రమే. కానీ సుడులు తిరుగుతున్న బంతులను.. అస్థిర బౌన్స్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ అశ్విన్‌, శ్రేయస్‌ జోడీ గొప్పగా బ్యాటింగ్‌ చేసింది. తన వ్యక్తిగత స్కోరు ఒక్క పరుగు వద్ద మిరాజ్‌ బౌలింగ్‌లో మొమినుల్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అశ్విన్‌ అదరగొట్టాడు. మంచి ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. మొదట వికెట్‌ కాపాడుకోవడానికి ప్రాధాన్యతనిచ్చి ఓపిక ప్రదర్శించిన ఈ జంట.. క్రీజులో కుదురుకున్నాక బౌండరీలతో ఒత్తిడిని తగ్గించుకుంది. వేగంగా విజయాన్ని అందించాలని భావించిన అశ్విన్‌.. ఒక్కసారిగా టాప్‌గేరులోకి వెళ్లిపోయాడు. మెహదీ ఓవర్లో 16 పరుగులతో మ్యాచ్‌ ముగించాడు. తొలి బంతినే ఒంటిచేతి సిక్సర్‌గా మలచిన అశ్విన్‌.. చివరి రెండు బంతులకు ఫోర్లు కొట్టి విజయ నాదం చేశాడు.

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 227; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 314
బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: 231; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ (స్టంప్డ్‌) నురుల్‌ (బి) మిరాజ్‌ 7; రాహుల్‌ (సి) నురుల్‌ (బి) షకిబ్‌ 2; పుజారా (స్టంప్డ్‌) నురుల్‌ (బి) మిరాజ్‌ 6; అక్షర్‌ (బి) మిరాజ్‌ 34; కోహ్లి (సి) మొమినుల్‌ (బి) మిరాజ్‌ 1; ఉనద్కత్‌ ఎల్బీ (బి) షకిబ్‌ 13; పంత్‌ ఎల్బీ (బి) మిరాజ్‌ 9; శ్రేయస్‌ నాటౌట్‌ 29; అశ్విన్‌ నాటౌట్‌ 42; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (47 ఓవర్లలో 7 వికెట్లకు) 145 

వికెట్ల పతనం: 1-3, 2-12, 3-29, 4-37, 5-56, 6-71, 7-74
బౌలింగ్‌: షకిబ్‌ 14-0-50-2; తైజుల్‌ 11-4-14-0; మెహిదీ మిరాజ్‌ 19-4-63-5; తస్కిన్‌ 1-0-4-0; ఖాలెద్‌ 2-0-12-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని