Team India: సంబరపడదామా!

భారత క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులోనూ విజయం సాధించింది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. కానీ గెలిచినంత మాత్రాన టీమ్‌ఇండియా చేసిన తప్పులన్నీ ఒప్పయితాయా? ఒక విజయం అన్ని లోపాలనూ కప్పేస్తుందని, ఒక ఓటమి లేని బలహీనతల్ని ఎత్తి చూపిస్తుందని నానుడి!

Updated : 26 Dec 2022 08:17 IST

భారత క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులోనూ విజయం సాధించింది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. కానీ గెలిచినంత మాత్రాన టీమ్‌ఇండియా చేసిన తప్పులన్నీ ఒప్పయితాయా? ఒక విజయం అన్ని లోపాలనూ కప్పేస్తుందని, ఒక ఓటమి లేని బలహీనతల్ని ఎత్తి చూపిస్తుందని నానుడి! ఈ గెలుపు మత్తులో.. టాప్‌ఆర్డర్‌ వైఫల్యం, సెలక్షన్‌ తప్పిదాలు, స్టార్‌ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన వంటి విషయాలను పట్టించుకోకుండా వదిలేస్తే, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే భారత క్రికెట్‌కు జరిగే నష్టాన్ని నివారించడం కష్టం.

కొందరు ఆటగాళ్ల పోరాటం వల్ల, కాస్త అదృష్టం కూడా కలిసొచ్చి రెండో టెస్టు భారత్‌ సొంతమైంది కానీ.. మీర్పూర్‌లో మన జట్టు ప్రదర్శన చూశాక నిజంగా విజయానికి అర్హమైందా అంటే ధీమాగా ఔనని చెప్పలేని పరిస్థితి. సెలక్షన్‌ దగ్గర్నుంచి ఆటతీరు వరకు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా చేసిన తప్పుల చిట్టా పెద్దదే. బంగ్లాదేశ్‌ లాంటి బలహీన జట్టుపై చచ్చీ చెడీ గెలవడం అంటే ఓటమితో సమానం! పేరుకు మనది పెద్ద జట్టే కానీ.. బంగ్లాదేశ్‌ పర్యటనలో మనవాళ్లు ముందు వన్డే సిరీస్‌ కోల్పోయారు. టెస్టు సిరీస్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. రెండో టెస్టులో ఓటమి భయం కూడా వెంటాడింది. శ్రేయస్‌తో కలిసి లోయరార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన అశ్విన్‌ వీరోచితంగా ఆడబట్టి రెండో టెస్టు గెలిచాం కానీ.. లేదంటే ఓటమి తప్పకపోయేది.

కొన్నేళ్లుగా నిలకడ లేమికి మారుపేరుగా మారుతున్న టాప్‌ఆర్డర్‌.. ఈ మ్యాచ్‌లో మరింత పేలవ ప్రదర్శన చేసింది. ఒకప్పుడు పెట్టని కోటలా ఉన్న కోహ్లి ఇప్పుడు వరుస వైఫల్యాలతో జట్టుకు భారమవుతున్నాడు. 1, 19, 24, 1.. ఇవీ బంగ్లాతో టెస్టు సిరీస్‌లో కోహ్లి స్కోర్లు. బ్యాటింగ్‌తో పాటు అతడి ఫీల్డింగ్‌ ప్రమాణాలు కూడా పడిపోతున్నాయి. రెండో టెస్టు మూడో రోజు అతను స్లిప్‌లో మూడు క్యాచ్‌లు వదిలేశాడు. కేఎల్‌ రాహుల్‌ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. తాత్కాలికంగా జట్టు పగ్గాలందుకున్న అతను ముందుండి నడిపిస్తాడనుకుంటే.. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 22, 23, 10, 2 పరుగులే చేశాడు. రోహిత్‌ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు కానీ.. ఇటీవల అతడి ప్రదర్శనా అంతంతమాత్రమే. పుజారాలోనూ నిలకడ లోపించింది. తొలి టెస్టులో సెంచరీ చేసిన అతను.. రెండో మ్యాచ్‌లో తేలిపోయాడు. పుజారాతో పాటు శుభ్‌మన్‌ రెండో ఇన్నింగ్స్‌లో పేలవమైన ఫుట్‌వర్క్‌తో వికెట్లు సమర్పించుకున్నారు. టర్న్‌ అవుతున్న బంతుల్ని బ్యాక్‌ఫుట్‌పై ఆడాలన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచి ముందుకెళ్లి ఆడి స్టంపౌటవడమేంటో? టాప్‌ఆర్డర్‌ వైఫల్యంతో తర్వాతి బ్యాటర్ల మీద ఒత్తిడి పెరుగుతోంది.

లోయరార్డర్‌ ఆటగాళ్లు ఎన్ని మ్యాచ్‌ల్లో జట్టును రక్షిస్తారు? ఫ్లాట్‌ పిచ్‌లు ఎదురైనపుడు బాగా ఆడేసి సగటులు సరిచేసుకుంటున్నారే తప్ప.. ఎలాంటి పిచ్‌లు, పరిస్థితుల్లో అయినా నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లు కరవైపోయారు. బాగా బౌన్స్‌ అయ్యే, ఎక్కువ స్పిన్‌ తిరిగే పిచ్‌ల మీద నిలబడి ఆడే బ్యాటర్లు కనిపించడం లేదు. ఈ మధ్య జట్టులో ‘స్టార్‌’ సంస్కృతి బాగా పెరిగిపోతోంది. గత ప్రదర్శనల ఆధారంగానే చాలామంది జట్టులో కొనసాగుతున్నారు. స్టార్‌ హోదా, బోర్డులో తమకున్న అండదండల వల్ల తమ స్థానాలకు ముప్పేమీ లేదన్న ధీమా కొందరిలో కనిపిస్తోంది. ఏ ఆటగాడూ వైఫల్యాలను అధిగమించేందుకు శ్రమిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒకప్పుడు గావస్కర్‌ లాంటి దిగ్గజాలు అంతర్జాతీయ మ్యాచ్‌ల మధ్య కాస్త ఖాళీ దొరికితే రంజీ మ్యాచ్‌లు ఆడేవాళ్లు. సచిన్‌ ఎన్నడూ ప్రాక్టీస్‌కు దూరమయ్యేవాడు కాదు. ఏ సిరీస్‌ నుంచి విరామం తీసుకునేవాడు కాదు. కానీ ఇప్పటి ఆటగాళ్లు పనిభారం పేరుతో తరచుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. దేశవాళీల జోలికే వెళ్లట్లేదు. మ్యాచ్‌ల్లో వరుస వైఫల్యాలు, చేసిన తప్పులే చేయడం చూస్తే నెట్స్‌లో వీళ్లు ఏమాత్రం శ్రమిస్తున్నారన్న సందేహాలు కలుగుతున్నాయి. పేరు గొప్ప ఆటగాళ్ల విషయంలో వీలైనంత త్వరగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

బీసీసీఐ ఏం చేస్తున్నట్లు?

అన్ని ఫార్మాట్లలోనూ జట్టు ప్రదర్శన పడిపోతోంది. స్టార్‌ ఆటగాళ్లు రోజు రోజుకూ జట్టుకు భారంగా మారుతున్నారు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. సెలక్టర్లు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. మరి మన క్రికెట్‌ వ్యవస్థను నడిపిస్తున్న బీసీసీఐ ఏం చేస్తోందన్నది ప్రశ్న? టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత జట్టు అంత ఘోరమైన ప్రదర్శన చేశాక కనీసం ఒక సమీక్ష సమావేశం లేదు. ఎవరి మీదా చర్యలు లేవు. బంగ్లాదేశ్‌ చేతిలో వన్డే సిరీస్‌ ఓడినా అంతా గప్‌చుప్‌! బోర్డులో క్రికెట్‌ పాలనను పట్టించుకునే, జట్టును గాడిన పెట్టే వారు కరవయ్యారన్నది ఇటీవల వినిపిస్తున్న విమర్శ. దేశంలో క్రికెట్‌ ప్రతిభకు లోటు లేకపోయినా, అద్భుతమైన ఆటగాళ్లు రాష్ట్ర స్థాయుల్లో ఉన్నా వారికి సరైన ప్రోత్సాహం అందించి టీమ్‌ఇండియాలోకి తెచ్చే ప్రయత్నం ఇటీవల కాలంలో సరిగా జరగట్లేదనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డయిన బీసీసీఐ.. రాష్ట్ర సంఘాలకు డబ్బులిచ్చేసి చేతులు దులుపుకుంటోందే తప్ప, ఆయా రాష్ట్రాల్లో ప్రతిభాన్వేషణ మీద దృష్టి పెట్టట్లేదు.

దేశంలో రెండు మూడు రాష్ట్రాలు మినహాయిస్తే చాలా వరకు క్రికెట్‌ సంఘాలు సరైన దారిలో నడవట్లేదు. హైదరబాద్‌ క్రికెట్‌ సంఘం విషయానికే వస్తే ప్రతిభావంతుల్ని వెలుగులోకి తెచ్చి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యతను అదెప్పుడో పక్కన పెట్టేసింది. రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు, అశ్రిత పక్షపాతం, అవినీతితో రోజు రోజుకూ భ్రష్టుపట్టిపోతోంది. ఇక్కడ భవిష్యత్తు లేదని యువ ఆటగాళ్లు వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లడం, లేదంటే క్రికెట్‌ మానేసి వేరే కెరీర్‌ చూసుకుంటుండడం వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందనడానికి నిదర్శనం. ఆంధ్రా క్రికెట్‌ సంఘం పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఓవైపు రాష్ట్ర సంఘాలను పర్యవేక్షిస్తూ ప్రతిభావంతులను వెలుగులోకి తేవడం, అలాగే జాతీయ జట్టును గాడిన పెట్టడం బీసీసీఐ ముందున్న తక్షణ కర్తవ్యాలు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చలాయించిన విండీస్‌ ఎలా పతనమైందో, మేటి జట్లలో ఒకటిగా ఉన్న దక్షిణాఫ్రికా ఎలా గాడి తప్పుతోందో చూసైనా బీసీసీఐ మేల్కోవాలి. లేకుంటే భారత క్రికెట్‌ అట్టడుగు స్థాయికి చేరడానికి ఎంతో కాలం పట్టదు.


ఎలా సమర్థించుకుంటారు?

భారత్‌-బంగ్లా తొలి టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌ 8 వికెట్లతో ఉత్తమ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లోనూ రాణించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కూడా అందుకున్నాడు. అలాంటి బౌలర్‌ను స్పిన్‌కు పూర్తిగా సహకరించిన మీర్పూర్‌లో రెండో టెస్టుకు దూరం పెట్టడం అనూహ్యం. పిచ్‌ గురించి పూర్తి అవగాహన ఉన్న ఆతిథ్య జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. భారత్‌ మాత్రం ఇద్దరు స్పిన్నర్లకు పరిమితమై మూడో పేసర్‌గా 12 ఏళ్లుగా టెస్టు మ్యాచే ఆడని ఉనద్కత్‌ను ఎంచుకుంది. ఉనద్కత్‌ దేశవాళీల్లో రాణించి ఉండొచ్చు కానీ.. యువ పేసర్లు ఎంతోమంది అందుబాటులో ఉండగా సుదీర్ఘ కాలం అంతర్జాతీయ క్రికెట్‌ ఆడని, వయసు పెరిగిన బౌలర్‌ను ఎందుకు ఎంచుకున్నట్లు? స్పిన్‌ పిచ్‌లో ఆడబోతూ ఫామ్‌లో ఉన్న కుల్‌దీప్‌ను కాదని ఉనద్కత్‌ను తుది జట్టులోనూ ఎందుకు ఆడించినట్లు? ఈ నిర్ణయాన్ని సెలక్షన్‌ కమిటీ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎలా సమర్థించుకుంటాయి? రెండో టెస్టులో భారత్‌ గెలవబట్టి సరిపోయింది కానీ.. లేదంటే కుల్‌దీప్‌పై వేటు పెద్ద దుమారమే రేపేది. కుల్‌దీప్‌ అందుబాటులో ఉంటే బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అంత స్కోరు చేసేది కాదు, ఛేదనలో భారత్‌ కష్టపడాల్సిన పనీ ఉండేది కాదు!

ఇటీవలే దేశవాళీ క్రికెట్లో ప్రవేశ పెట్టిన ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధన అందుబాటులో ఉంటే కుల్‌దీప్‌ను బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో ఆడించేవాళ్లమని కెప్టెన్‌ రాహుల్‌ చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గత ఏడాది కాలంలో ఇలాగే సెలక్షన్‌ విషయంలో ఎన్నో నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. టీ20 ప్రపంచకప్‌ వైఫల్యానికి కూడా సెలక్షన్‌ తప్పిదాలే కారణమన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా రాహుల్‌, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లను జట్టులో కొనసాగించారు. పంత్‌ లాంటి విధ్వంసక ఆటగాడికి అవకాశమివ్వకుండా రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితం చేసి అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశారు. హర్షల్‌ పటేల్‌కూ పెద్దగా అవకాశాలివ్వలేదు. గత ఏడాది కాలంలో పదే పదే జట్టును మార్చడం, కొన్ని మ్యాచ్‌లు ఆడించి పక్కన పెట్టేయడం, ఒక్కో సిరీస్‌కు ఒక్కొక్కరికి జట్టు పగ్గాలివ్వడం.. ఇలా అంతా అయోమయంగా తయారైంది. ప్రపంచకప్‌ పరాభవం తర్వాతైనా పరిస్థితి మారుతుందనుకుంటే సెలక్షన్‌ నిర్ణయాలు ఇంకా ఘోరంగా తయారవుతున్నాయి. ఓవైపు ఇంగ్లాండ్‌ జట్టు దూకుడుకు మారుపేరైన ఆటతీరుతో అన్ని ఫార్మాట్లలో దూసుకెళ్తుంటే.. టీమ్‌ఇండియా బంగ్లా లాంటి చిన్న జట్టుపై ఆడిన తీరు.. స్వల్ప లక్ష్య ఛేదనలో రక్షణాత్మక వైఖరితో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న తీరు మన తిరోగమనానికి సంకేతం!


చివరి 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో..

రాహుల్‌ - 2, 10, 23, 22, 10, 12, 8, 50, 23, 123

రోహిత్‌ - 46, 15, 29, 127, 11, 59, 19, 21, 83, 12*

శుభ్‌మన్‌ - 7, 20, 110, 20, 4, 17, 47, 44, 1, 52

కోహ్లి - 1, 24, 19*, 1, 20, 11, 13, 23, 45, 29

పుజారా - 6, 24, 102*, 90, 66, 13, 9, 43, 53, 3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు