IPL: సొమ్ముతో నా ఆట మారదు: కామెరాన్‌ గ్రీన్‌

ఐపీఎల్‌లో తనకు భారీ ధర పలకడం తనను లేదా తన ఆటను మార్చదని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ అన్నాడు. 23 ఏళ్ల గ్రీన్‌ ఐపీఎల్‌ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడు.

Updated : 27 Dec 2022 09:12 IST

మెల్‌బోర్న్‌: ఐపీఎల్‌లో తనకు భారీ ధర పలకడం తనను లేదా తన ఆటను మార్చదని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ అన్నాడు. 23 ఏళ్ల గ్రీన్‌ ఐపీఎల్‌ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడు. తాజా వేలంలో ముంబయి ఇండియన్స్‌ అతణ్ని రూ.17.5 కోట్లకు కొనుక్కుంది. ‘‘ఇంత పెద్ద మొత్తం పొందాల్సిన స్థాయిలో నేనేమీ చేయలేదు. నా పేరును వేలంలో నమోదు చేసుకున్నానంతే. అనుకోకుండా అంత పెద్ద ధర పలికింది. అది వ్యక్తిగా నన్ను కానీ.. నా ఆటను కానీ మార్చదు. నేను పెద్దగా మారనని ఆశిస్తున్నా’’ గ్రీన్‌ అన్నాడు. తన లాంటి ఆల్‌రౌండర్‌ సుదీర్ఘకాలం ఆడాలంటే పనిభార నిర్వహణ ముఖ్యమని చెప్పాడు. ‘‘బ్యాటింగ్‌, బౌలింగ్‌లు రెండింటిలోనూ సమానంగా కృషి చేయడం చాలా కష్టం. అందులో ఏదో ఒకదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండు విభాగాల్లోనూ తీవ్రంగా శ్రమిస్తే ఒత్తిడి పెరుగుతుంది’’ అని గ్రీన్‌ అన్నాడు. మ్యాచ్‌కు ముంద]ు తన ప్రాధాన్యత బ్యాటింగ్‌కే ఉంటుందని, మ్యాచ్‌ రోజు బౌలింగ్‌పై ఎక్కువ దృష్టిపెడతానని గ్రీన్‌ చెప్పాడు. గ్రీన్‌ దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో సోమవారం అయిదు వికెట్లు పడగొట్టి సత్తా చాటుకున్నాడు. టెస్టు క్రికెట్లో అతడికిదే తొలి అయిదు వికెట్ల ఘనత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని