IND Vs SL: పోరాడారు కానీ..

207 పరుగుల లక్ష్యం.. సగం ఓవర్లయ్యేసరికి స్కోరు కేవలం 64. అప్పటికే సగం జట్టు పెవిలియన్‌ చేరిపోయింది. మిగిలిన స్పెషలిస్టు బ్యాటర్‌ ఒక్క సూర్యకుమార్‌ మాత్రమే. ఈ స్థితిలో గెలుపు సంగతటుంచితే.. టీమ్‌ఇండియా గౌరవప్రదంగా అయినా ఓడుతుందని ఎవ్వరూ అనుకుని ఉండరు!

Updated : 06 Jan 2023 07:50 IST

రెండో టీ20లో భారత్‌ ఓటమి
అక్షర్‌, సూర్య శ్రమ వృథా
లంకను గెలిపించిన శానక

207 పరుగుల లక్ష్యం.. సగం ఓవర్లయ్యేసరికి స్కోరు కేవలం 64. అప్పటికే సగం జట్టు పెవిలియన్‌ చేరిపోయింది. మిగిలిన స్పెషలిస్టు బ్యాటర్‌ ఒక్క సూర్యకుమార్‌ మాత్రమే. ఈ స్థితిలో గెలుపు సంగతటుంచితే.. టీమ్‌ఇండియా గౌరవప్రదంగా అయినా ఓడుతుందని ఎవ్వరూ అనుకుని ఉండరు!

కానీ భారత్‌ అనూహ్యంగా పోటీలోకి వచ్చింది. గెలుపు కోసం గట్టిగా ప్రయత్నించింది. అందుక్కారణం చెలరేగి ఆడిన అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ జోడీ. స్కై ఆఖరిదాకా ఉంటే పుణెలో అద్భుతమే జరిగేది. కానీ అతను మధ్యలో వెనుదిరగడం.. సాధించాల్సిన రన్‌రేట్‌ అందుకోలేని స్థాయికి చేరిపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్లలో పూర్తిగా అదుపు తప్పిన భారత బౌలింగ్‌.. ఆపై టాప్‌ఆర్డర్‌ ఘోరవైఫల్యం భారత ఓటమికి ప్రధాన కారణాలు.

శ్రీలంకతో తొలి టీ20లో త్రుటిలో గట్టెక్కిన టీమ్‌ఇండియా.. రెండో టీ20లో ఆ జట్టుకు తలవంచక తప్పలేదు. పేలవంగా సాగిన భారత బౌలింగ్‌ను ఆటాడుకున్న లంకేయులు.. 200 పైచిలుకు స్కోరు చేసి పుణెలో భారత్‌కు ఓటమి మిగిల్చారు. మొదట కెప్టెన్‌ దసున్‌ శానక (56 నాటౌట్‌; 22 బంతుల్లో 2×4, 6×6), ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ (52; 31 బంతుల్లో 3×4, 4×6)లతో పాటు అసలంక (37; 19 బంతుల్లో 4×6) కూడా చెలరేగిపోవడంతో లంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. అక్షర్‌ (2/24) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. అనంతరం భారత్‌ 8 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. తొలి 10 ఓవర్లలో తేలిపోయిన భారత్‌.. అక్షర్‌ (65; 31 బంతుల్లో 3×4, 6×6), సూర్యకుమార్‌ (51; 36 బంతుల్లో 3×4, 3×6), మావి (26; 15 బంతుల్లో 2×4, 2×6)ల అద్భుత పోరాటంతో గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శానక (2/4) బంతితోనూ సత్తా చాటాడు. రజిత (2/22) కూడా మెరిశాడు.

ఏదో అనుకుంటే..

భారీ లక్ష్యం ముందున్నా.. బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉన్న భారత్‌ అంత తేలిగ్గా వదలదనే అనుకున్నారు అభిమానులు. కానీ టాప్‌ ఆర్డర్‌ కనీస పోరాటం లేకుండా చేతులెత్తేసింది. గత మ్యాచ్‌లో తేలిపోయిన పేసర్‌ రజిత.. తన తొలి ఓవర్లోనే ఇషాన్‌ (2), శుభ్‌మన్‌ (5)లను ఔట్‌ చేసి భారత్‌ను గట్టి దెబ్బ తీశాడు. ఈ సిరీస్‌లో భారత్‌ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్న మూడో ఆటగాడైన రాహుల్‌ త్రిపాఠి (5) కూడా విఫలం కాగా.. కెప్టెన్‌ హార్దిక్‌ (12) మెరుపులు రెండు షాట్లకు పరిమితమయ్యాయి. దీపక్‌ హుడా (9) కూడా ఎంతోసేపు నిలవలేదు. దీంతో భారత్‌ 57/5తో ఘోర పరాభవం దిశగా అడుగులేసింది. స్కోరు వందైనా దాటుతుందా అని సందేహాలు కలిగిన వేళ.. అక్షర్‌, సూర్య జోడీ అనూహ్యంగా చెలరేగిపోయింది. ముఖ్యంగా అక్షర్‌ కెరీర్లోనే ఉత్తమం అనదగ్గ ఇన్నింగ్స్‌తో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో సిక్సర్ల మోత మోగిస్తూ చూస్తుండగానే, 20 బంతుల్లోనే అర్ధశతకం దాటేశాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన సూర్య కూడా తర్వాత తనదైన శైలిలో షాట్లు ఆడాడు. అతను 33 బంతుల్లో 50 అందుకున్నాడు. 29 బంతుల్లో 61 పరుగులే చేయాల్సి రావడంతో భారత్‌కు అవకాశాలున్నట్లే కనిపించింది. కానీ మదుశంక బౌలింగ్‌లో సూర్య భారీ షాట్‌ ఆడబోయి లాంగాన్‌లో ఫీల్డర్‌కు దొరికిపోవడంతో భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తర్వాత 15 బంతుల్లో 49తో సమీకరణం చాలా కష్టంగా మారగా.. బౌలర్‌ మావి వరుసగా 6, 4, 6 బాది మళ్లీ ఆశలు రేకెత్తించాడు. కానీ రజిత 19వ ఓవర్లో 12 పరుగులే ఇవ్వడం.. చివరి ఓవర్‌ వేసిన శానక మూడో బంతికి అక్షర్‌ను ఔట్‌ చేయడంతో భారత్‌ పనైపోయింది.

లంక బాదుడే బాదుడు

తొలి టీ20లో త్రుటిలో ఓడిన లంక.. ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలన్న సంకల్పాన్ని ఆరంభం నుంచి చాటింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు.. దూకుడుగా బ్యాటింగ్‌ చేసింది. ముఖ్యంగా ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ చెలరేగిపోయాడు. మరో ఎండ్‌లో నిశాంక (33; 35 బంతుల్లో 4×4) నిలకడగా ఆడాడు. కుశాల్‌కు కీ ఇచ్చింది అర్ష్‌దీపే. అతను వరుసగా రెండు నోబాల్స్‌ వేయడంతో ఫ్రీహిట్లకు 4, 6 బాది ఊపందుకున్న కుశాల్‌.. ఇక ఆగలేదు. పేస్‌, స్పిన్‌ అని తేడా లేకుండా అందరు బౌలర్లకూ చుక్కలు చూపిస్తూ 8వ ఓవర్లోనే అర్ధసెంచరీ (27 బంతుల్లో) పూర్తి చేశాడు కుశాల్‌. చాహల్‌ తర్వాతి ఓవర్లో అతణ్ని ఔట్‌ చేసి భారత్‌కు ఉపశమనాన్నిచ్చాడు. తక్కువ వ్యవధిలో రాజపక్స (2), నిశాంక, ధనంజయ డిసిల్వా (3) వెనుదిరగడంతో 8 ఓవర్లకు 80/0 నుంచి 14 ఓవర్లకు 113/4కు చేరుకుంది లంక. అప్పటికి మ్యాచ్‌ భారత్‌ నియంత్రణలో ఉన్నట్లే కనిపించింది. కానీ చివరి 6 ఓవర్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముందుగా అసలంక.. ఆ తర్వాత శానక అసాధారణంగా చెలరేగిపోయారు. శానక అయితే భారత బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. సిక్సర్ల మోత మోగిస్తూ కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, స్కోరును 200 దాటించాడు. చివరి 6 ఓవర్లలో లంక ఏకంగా 83 పరుగులు రాబట్టింది.


అర్ష్‌దీప్‌కు ఏమైంది?

టీమ్‌ఇండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేసి ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు. తన ప్రతిభ చాటుకుని తక్కువ సమయంలో జట్టులో ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు కానీ.. తరచుగా నోబాల్స్‌ వేసే బలహీనతను మాత్రం వదులుకోలేకపోతున్నాడు. ఆరు నెలల వ్యవధిలోనే అతను 14 నోబాల్స్‌ వేయడం గమనార్హం. మొత్తంగా టీ20 క్రికెట్లో అత్యధిక నోబాల్స్‌ వేసిన బౌలర్‌గా చెత్త రికార్డును అతను మూటగట్టుకున్నాడు. పాక్‌ పేసర్‌ హసన్‌ అలీ (14) రికార్డును అతను అధిగమించాడు. లంకతో రెండో టీ20లో అర్ష్‌దీప్‌ రెండు ఓవర్లు మాత్రమే వేయగా.. అందులో నోబాల్స్‌ 5 పడ్డాయంటే అతనెంతగా అదుపు తప్పాడో అర్థం చేసుకోవచ్చు. తన తొలి ఓవర్లో వరుసగా మూడు నోబాల్స్‌ వేసిన అర్ష్‌దీప్‌కు మళ్లీ బౌలింగ్‌ ఇవ్వడానికి హార్దిక్‌ భయపడ్డాడు. తర్వాత 19వ ఓవర్లో మళ్లీ బంతి ఇస్తే ఈసారి ఇంకో రెండు నోబాల్స్‌ వేశాడు. అందులో ఒకటి క్యాచ్‌ ఔట్‌. నోబాల్‌ కావడంతో బతికిపోయిన శానక ఫ్రీహిట్‌కు సిక్సర్‌ బాదాడు. 2 ఓవర్లలోనే అర్ష్‌దీప్‌ 37 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌, శివమ్‌ మావి సైతం ఒక్కో నోబాల్‌ వేశారు.


శ్రీలంక ఇన్నింగ్స్‌: నిశాంక (సి) త్రిపాఠి (బి) అక్షర్‌ 33; కుశాల్‌ మెండిస్‌ ఎల్బీ (బి) చాహల్‌ 52; రాజపక్స (బి) ఉమ్రాన్‌ 2; అసలంక (సి) శుభ్‌మన్‌ (బి) ఉమ్రాన్‌ 37; ధనంజయ డిసిల్వా (సి) హుడా (బి) అక్షర్‌ 3; శానక నాటౌట్‌ 56; హసరంగ (బి) ఉమ్రాన్‌ 0; చమిక నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206

వికెట్ల పతనం: 1-80, 2-83, 3-96, 4-110, 5-138, 6-138

బౌలింగ్‌: హార్దిక్‌ 2-0-13-0; అర్ష్‌దీప్‌ 2-0-37-0; శివమ్‌ మావి 4-0-53-0; అక్షర్‌ పటేల్‌ 4-0-24-2; చాహల్‌ 4-0-30-1; ఉమ్రాన్‌ మాలిక్‌ 4-0-48-3

భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (బి) రజిత 2; శుభ్‌మన్‌ (సి) తీక్షణ (బి) రజిత 5; రాహుల్‌ త్రిపాఠి (సి) కుశాల్‌ (బి) మదుశంక 5; సూర్యకుమార్‌ (సి) హసరంగ (బి) మదుశంక 51; హార్దిక్‌ (సి) కుశాల్‌ (బి) కరుణరత్నె 12; దీపక్‌ హుడా (సి) ధనంజయ (బి) హసరంగ 9; అక్షర్‌ పటేల్‌ (సి) కరుణరత్నె (బి) శానక 65; మావి (సి) తీక్షణ (బి) శానక 26; ఉమ్రాన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 190

వికెట్ల పతనం: 1-12, 2-21, 3-21, 4-34, 5-57, 6-148, 7-189, 8-190

బౌలింగ్‌: మదుశంక 4-0-45-2; కసున్‌ రజిత 4-0-22-2; చమిక కరుణరత్నె 4-0-41-1; హసరంగ 3-0-41-1; తీక్షణ 4-0-33-0; శానక 1-0-4-2


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని