Surya Kumar Yadav: వహ్వా సూర్య.. ఎలా వేసినా దంచికొట్టాడు!

సూర్య అంటేనే పరుగులు సునామీ. ఈ పోరులో అతడి కళాత్మక విధ్వంసాన్ని వర్ణించడానికి మాటలే చాలవు. ఎలా వేసినా దంచి కొట్టాడు. కళ్లు చెదిరే విన్యాసాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తూ, మంత్రముగ్దుల్ని చేస్తూ జట్టుకు కొండంత స్కోరు అందించాడు.

Updated : 08 Jan 2023 09:35 IST

సూర్య అంటేనే పరుగులు సునామీ. శ్రీలంకతో జరిగిన మూడో టీ20 పోరులో అతడి కళాత్మక విధ్వంసాన్ని వర్ణించడానికి మాటలే చాలవు. ఎలా వేసినా దంచి కొట్టాడు. కళ్లు చెదిరే విన్యాసాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తూ, మంత్రముగ్దుల్ని చేస్తూ జట్టుకు కొండంత స్కోరు అందించాడు. ఎలా వేసినా బౌలర్‌కు శిక్షే. బంతులను నిలబడి కొట్టాడు, వంగి కొట్టాడు. పడుతూ కొట్టాడు. చురుకైన కదలికలతో క్రీజులో నాట్యమాడిన సూర్య బౌలర్లను నిస్సహాయులుగా మారుస్తూ.. ఫీల్డర్లకు పనిలేకుండా చేస్తూ.. మైదానానికి అన్నివైపులా బంతిని కొట్టాడు.

9 సిక్స్‌లు, 7 ఫోర్లు కొట్టాడు కానీ.. ప్రతి షాటూ ప్రత్యేకమైందే. ఆరో ఓవర్లో క్రీజులోకి వచ్చాడు సూర్య. అటు శుభ్‌మన్‌ గిల్‌.. ఇటు సూర్య. ఇద్దరూ భిన్న లోకాల్లో ఉన్నట్లనిపించింది. ఎంత తేడానో. చాలా నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసిన గిల్‌ సింగిల్స్‌ తీస్తూ సాగుతుంటే.. సూర్య ప్రతి బంతినీ సిక్స్‌ కొట్టాలన్నంత కసితో బ్యాటింగ్‌ చేశాడు. మొదటి నుంచే టాప్‌ గేర్‌లోనే సాగాడు. తనదైన శైలిలో లెగ్‌సైడ్‌ కళ్లు చెదిరే షాట్లు ఆడాడు. ఆఫ్‌సైడూ అదరగొట్టాడు. పుల్‌,కట్‌, ర్యాంప్‌.. ఇలా అన్ని షాట్లూ ఆడేశాడు.

కరుణరత్నె బౌలింగ్‌లో మిడాఫ్‌ ఫోర్‌తో మొదలైంది స్కై జోరు. వెంటనే తనదైన తరహాలో వికెట్లకు అడ్డంగా కదిలి షార్ట్‌ బంతిని స్క్వేర్‌లెగ్‌లో సిక్స్‌కు తరలించాడు. అతడి మరో ఓవర్లో ర్యాంప్‌ షాట్‌తో బంతిని ఫైన్‌ లెగ్‌లోకి పంపాడు. మదుశంక ఫుల్‌టాస్‌ను కిందపడుతూ షార్ట్‌ ఫైన్‌లెగ్‌లో సిక్స్‌గా మలిచిన తీరును చూసి తీరాల్సిందే. అభిమానులకు పండగే పండగ. కేవలం 26 బంతుల్లో అర్ధశతకం సాధించిన సూర్య ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. మరో 19 బంతుల్లోనే శతకానికి చేరుకున్నాడంటే అతడి జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అతడి టైమింగ్‌ అదరహో. ఇన్నింగ్స్‌ ఆసాంతం హైలైట్స్‌లా సాగింది ఈ ప్రపంచ నంబర్‌వన్‌ టీ20 బ్యాటర్‌ ఆట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని