రోడ్డెక్కిన కుస్తీ యోధులు

భారత రెజ్లింగ్‌లో కలకలం. రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ అనేకమంది అగ్రశ్రేణి రెజ్లర్లు అసాధారణ రీతిలో రోడ్డెక్కారు.

Updated : 19 Jan 2023 09:23 IST

రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వినేశ్‌ ఆరోపణ

డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు దిగిపోవాలంటూ నిరసన

భారత రెజ్లింగ్‌లో కలకలం. రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ అనేకమంది అగ్రశ్రేణి రెజ్లర్లు అసాధారణ రీతిలో రోడ్డెక్కారు. అతడు దిగిపోయేవరకు నిరసన కొనసాగుతుందని ప్రకటించారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడంటూ డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిపై వినేశ్‌ ఫొగాట్‌ తీవ్రమైన ఆరోపణలు చేసింది.

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా టోక్యో ఒలింపిక్‌ కాంస్య పతక విజేత బజ్‌రంగ్‌ పునియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతక విజేత వినేశ్‌ ఫొగాట్‌ సహా అనేక మంది మేటి రెజ్లర్లు దిల్లీలో నిరసనకు దిగారు. బ్రిజ్‌ భూషణ్‌ భాజపా ఎంపీ కూడా. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు దిగిన 30 మంది అథ్లెట్లలో బజ్‌రంగ్‌, వినేశ్‌తో పాటు రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతక విజేత సరిత మోర్‌, సంగీత ఫొగాట్‌, సత్యవర్త్‌ మలిక్‌ కూడా ఉన్నారు. ‘‘మా పోరాటం ప్రభుత్వం లేదా క్రీడామంత్రిత్వ శాఖ లేదా భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌)పై కాదు. మా పోరాటం డబ్ల్యూఎఫ్‌ఐపైనే.  మా పోరాటం ముగింపు వరకు కొనసాగుతుంది’’ అని బజ్‌రంగ్‌ పునియా అన్నాడు. ‘‘సమాఖ్య అధ్యక్షుణ్ని తొలగించేంత వరకు మేము ఎలాంటి అంతర్జాతీయ పోటీల్లో పోటీపడం. భారత రెజ్లింగ్‌ను కాపాడేందుకే ఈ పోరాటం. అధ్యక్షుణ్ని తప్పించేవరకు నిరసన కొనసాగిస్తాం. మాకు విదేశీ కోచ్‌ల మద్దతు లేదు. కానీ అధ్యక్షుడు తన అకాడమీలో మాత్రం విదేశీ కోచ్‌ను నియమించుకున్నాడు. అతడు రెజ్లర్లపై అసభ్య పదజాలాన్ని వాడాడు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మా వద్ద ఉన్నాయి’’ అని అతడు చెప్పాడు. ‘‘దేశం తరఫున పతకాలు గెలవడానికి క్రీడాకారులు ఎంతో కృషి చేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బందిపెట్టడం తప్ప సమాఖ్య చేసిందేమీ లేదు. అథ్లెట్లను వేధించడం కోసం అసంబద్ధమైన నిబంధనలు రూపొందించారు’’ అని సాక్షి మలిక్‌ ట్వీట్‌ చేసింది. ‘బాయ్‌కాట్‌ డబ్ల్యూఎఫ్‌ఐప్రెసిడెంట్‌’ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో అన్షు మలిక్‌, సంగీత ఫొగాట్‌ కూడా దాదాపు ఇదే భావంతో ట్వీట్‌ చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ 2011 నుంచి పదవిలో ఉంటున్నాడు. 2019 ఫిబ్రవరిలో మూడోసారి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడు: బ్రిజ్‌ భూషణ్‌ చాలా ఏళ్లుగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని వినేశ్‌ ఫొగాట్‌ ఆరోపించింది. ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌ షా వెంటనే జోక్యం చేసుకుని అతణ్ని పదవి నుంచి తప్పించాలని కోరింది. లఖ్‌నవూలో జాతీయ శిబిరంలో అనేక మంది కోచ్‌లు మహిళా రెజ్లర్లను లైంగిక దోపిడీ చేశారని చెప్పింది. బ్రిజ్‌ భూషణ్‌ తరఫున శిబిరంలో కొంతమంది మహిళలు.. రెజ్లర్లను సంప్రదించారని అంది. అయితే తాను మాత్రం ఎలాంటి లైంగిక వేధింపులకు గురికాలేదని 28 ఏళ్ల వినేశ్‌ స్పష్టం చేసింది. ఓ బాధితురాలు ఇప్పుడు నిరసనలో పాల్గొన్నదని తెలిపింది. ‘‘డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు తమను లైంగికంగా వేధించాడని కనీసం 10-20 మంది రెజ్లర్లు నాతో చెప్పారు. వాళ్ల తమ కథలను నాతో చెప్పారు. వారి పేర్లను ఇప్పుడు నేను వెల్లడించలేను. ప్రధానమంత్రి, హోమంత్రిని కలిసే అవకాశం వస్తే మాత్రం చెబుతా’’ అని జంతర్‌ మంతర్‌ వద్ద నాలుగు గంటలపాటు నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో వినేశ్‌ చెప్పింది. ‘‘డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడికి సన్నిహితులైన వ్యక్తుల నుంచి.. చంపేస్తామంటూ నాకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఇక్కడ నిరసనకు దిగిన వారిలో ఎవరికి ఎలాంటి హాని జరిగినా బాధ్యత బ్రిజ్‌ భూషణ్‌దే’’ అని వ్యాఖ్యానించింది. తాను ధైర్యంగా మాట్లాడడం వల్ల తనపై ‘క్రమశిక్షణ లేని అథ్లెట్‌’ అన్న ముద్ర వేశారని వినేశ్‌ అంది. టోక్యో ఒలింపిక్స్‌ సందర్భంగా అధికారిక జెర్సీని ధరించకపోవడంతో వినేశ్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెపై నిషేధం విధించింది. కానీ వినేశ్‌ క్షమాపణలు చెప్పడంతో నిషేధాన్ని తొలగించింది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో క్రీడల మంత్రిత్వ శాఖ స్పందించింది. 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్‌ఐని ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే జాతీయ క్రీడా నియమావళి ప్రకారం సమాఖ్యపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. బుధవారం ఆరంభంకావాల్సి ఉన్న జాతీయ శిబిరాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది.


ఆరోపణల్లో నిజం లేదు: భూషణ్‌

నపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ తిరస్కరించాడు. పదవి నుంచి దిగిపోవడానికి నిరాకరించాడు. ‘‘నాపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు. నేనెందుకు వైదొలగాలి? ఒక్క మహిళ అయినా ముందుకొచ్చి లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువు చేస్తే ఉరి శిక్షకు సిద్ధం. నాపై ఓ పారిశ్రామికవేత్త కుట్ర చేస్తున్నాడు. ఈ ఆరోపణలపై సీబీఐ లేదా పోలీసులు దర్యాప్తు చేయొచ్చు. ఇదే రెజ్లర్లు ఒక వారం కింద నన్ను కలిశారు. ఏమీ చెప్పలేదు’’ అని చెప్పాడు. వినేశ్‌ను చంపుతామని తన తరఫున ఎవరో బెదరించారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ‘‘ఆమె పోలీసులను ఎందుకు సంప్రదించలేదు? ప్రధానమంత్రి లేదా క్రీడల మంత్రిని ఎందుకు కలవలేదు’’ అని బ్రిజ్‌ భూషణ్‌ అన్నాడు. ఇటీవల తెచ్చిన కొత్త నిబంధనలు అసౌకర్యం కలిగించడమే రెజ్లర్ల నిరసనకు కారణం కావొచ్చని చెప్పాడు. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఆడాలని, సెలక్షన్‌ ట్రయల్స్‌కు హాజరుకావాలని రెజ్లర్లకు చెప్పడంలో తప్పులేదని అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని