IND Vs NZ: ఇటు గిల్‌.. అటు బ్రాస్‌వెల్‌.. ఉప్పల్‌ వన్డే సూపర్‌‘హిట్‌’

యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (208; 149 బంతుల్లో 19×4, 9×6) అద్వితీయమైన ఆటతో డబుల్‌ సెంచరీ బాదేశాడు. నెమ్మదిగా మొదలైన గాలివాన తుపానులా మారినట్లు.. కళాత్మక విధ్వంసంతో ఉప్పల్‌ను ఊపేశాడు. అతని డబుల్‌ సెంచరీతో కొండంత స్కోరు (349/8) చేసినా జట్టుకు కంగారు తప్పలేదు.

Updated : 19 Jan 2023 06:55 IST

గిల్‌.. జిగేల్‌

హడలెత్తించిన బ్రాస్‌వెల్‌

శుభ్‌మన్‌ సూపర్‌ డబుల్‌

కివీస్‌పై ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం

ఈనాడు-హైదరాబాద్‌

యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (208; 149 బంతుల్లో 19×4, 9×6) అద్వితీయమైన ఆటతో డబుల్‌ సెంచరీ బాదేశాడు. నెమ్మదిగా మొదలైన గాలివాన తుపానులా మారినట్లు.. కళాత్మక విధ్వంసంతో ఉప్పల్‌ను ఊపేశాడు. అతని డబుల్‌ సెంచరీతో కొండంత స్కోరు (349/8) చేసినా జట్టుకు కంగారు తప్పలేదు. బ్రాస్‌వెల్‌ (140; 78 బంతుల్లో 12×4, 10×6) మెరుపు శతకంతో భయపెట్టాడు. దీంతో చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠ తప్పలేదు. పరుగుల వరద పారిన పోరులో కివీస్‌పై భారత్‌దే విజయం.

న్యూజిలాండ్‌ ముందు 350 పరుగుల లక్ష్యం. బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థి ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్‌కు వరుస కట్టేశారు. కివీస్‌ 28.4 ఓవర్లలో 131/6. ఉన్న బంతులు 128. చేయాల్సిన పరుగులు 219. భారత్‌ ఘనవిజయం సాధించడం లాంఛనమే అని ఉప్పల్‌ స్టేడియంలో అభిమానులు సంబరాలకు సిద్ధమైపోయారు. కానీ అసలు కథ తర్వాత మొదలైంది. మన వాళ్లకు పెద్దగా తెలియని బ్రాస్‌వెల్‌ (140; 78 బంతుల్లో 12×4, 10×6) అనే ఆల్‌రౌండర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆశల్లేని స్థితిలో అద్భుతంగా పోరాడాడు. టీమ్‌ఇండియాకు చెమటలు పట్టించాడు. శాంట్నర్‌ (57; 45 బంతుల్లో 7×4, 1×6) అండతో జట్టును విజయానికి చేరువగా తీసుకెళ్లాడు. జట్టును గెలిపించేందుకు తుదికంటా పోరాడిన అతను.. 5 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన సమయంలో చివరి వికెట్‌ రూపంలో వెనుదిరగడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. లేకుంటే శుభ్‌మన్‌ గిల్‌ (208; 149 బంతుల్లో 19×4, 9×6) అద్వితీయ ఇన్నింగ్స్‌కు సార్థకత లేకుండా పోయేది.

శ్రీలంకను చిత్తు చేసిన భారత్‌కు న్యూజిలాండ్‌తో అంత తేలిక కాదని తొలి మ్యాచ్‌లోనే తెలిసొచ్చింది. విలియమ్సన్‌, సౌథీ లాంటి సీనియర్లు లేకపోయినా.. తామెంత ప్రమాదకరమో కివీస్‌ చాటిచెప్పింది. దాదాపుగా చేజారిన మ్యాచ్‌ను చివరి వరకు లాక్కొచ్చి రోహిత్‌ సేనకు చెమటలు పట్టించింది. ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకున్న ఈ మ్యాచ్‌లో చివరికి భారత్‌నే విజయం వరించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఓపెనర్‌ గిల్‌ తన కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీతో చెలరేగిన వేళ.. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 12 పరుగుల తేడాతో నెగ్గి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 8 వికెట్లకు 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం కివీస్‌ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. ఏకపక్షంగా ముగిసేలా కనిపించిన మ్యాచ్‌ను బ్రాస్‌వెల్‌, శాంట్నర్‌ ఉత్కంఠభరితంగా మార్చారు. సొంతగడ్డపై తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన మహ్మద్‌ సిరాజ్‌ (4/46) ఉప్పల్‌ స్టేడియంలో ఉత్తమ బౌలింగ్‌ గణాంకాలతో సత్తాచాటాడు. కుల్‌దీప్‌ (2/43), శార్దూల్‌ (2/54) కూడా ఆకట్టుకున్నారు. శనివారం రాయ్‌పుర్‌లో రెండో వన్డే జరుగుతుంది.

ఆశల్లేని స్థితిలో..: సీనియర్‌ బౌలర్‌ సౌథీ లేని లోటును బౌలింగ్‌లో చూసిన కివీస్‌కు బ్యాటింగ్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ గైర్హాజరీ ప్రభావం పడింది. ఛేదనలో భారత బౌలర్ల దెబ్బకు కివీస్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కాన్వే (10), అలెన్‌ (40; 39 బంతుల్లో 7×4, 1×6), హెన్రీ నికోల్స్‌ (18), డరైల్‌ మిచెల్‌ (9), గ్లెన్‌ ఫిలిప్స్‌ (11), టామ్‌ లేథమ్‌ (24) వరుసగా పెవిలియన్‌ చేరారు. ఆ సమయంలో కివీస్‌ మిగతా 4 వికెట్లు కోల్పోవడం లాంఛనమే అనిపించింది. కానీ బ్రాస్‌వెల్‌ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. పేస్‌, స్పిన్‌ అని తేడా లేకుండా అందరి బౌలింగ్‌లోనూ చెలరేగాడు. అతను కేవలం 57 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. శాంట్నర్‌తో కలిసి 90 బంతుల్లోనే 150 పరుగులు జోడించి జట్టును గెలుపు బాటలోకి తీసుకొచ్చాడు. 45 ఓవర్లకు మొదట భారత్‌ సాధించిన స్కోరుకు సమానంగా పరుగులు చేసింది. అయితే 46వ ఓవర్లో సిరాజ్‌ 3 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయడంతో కివీస్‌ 294/8తో మళ్లీ కష్టాల్లో పడింది. అయినా బ్రాస్‌వెల్‌ పోరాటం ఆపలేదు. అతడి ధాటికి వరుసగా పాండ్య 15, షమి 17 పరుగులు సమర్పించుకున్నారు. 12 బంతుల్లో 24తో సమీకరణం తేలికైంది. 49వ ఓవర్లో హార్దిక్‌ నాలుగు పరుగులే ఇచ్చి ఫెర్గూసన్‌ (8)ను ఔట్‌ చేశాడు. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం. శార్దూల్‌ బౌలింగ్‌లో తొలి బంతినే బ్రాస్‌వెల్‌ సిక్సర్‌గా మలిచాడు. తర్వాతి బంతి వైడ్‌. 5 బంతుల్లో 13 పరుగులు కావాలి. లెగ్‌స్టంప్‌ లైన్‌లో యార్కర్‌కు బ్రాస్‌వెల్‌ వికెట్ల ముందు చిక్కడంతో ఉత్కంఠకు తెరపడింది.

గిల్‌ ఒక్కడు ఒకవైపు..: జట్టులో కోహ్లి, రోహిత్‌, సూర్యకుమార్‌ వంటి ఆటగాళ్లున్నా బుధవారం ఆటంతా శుభ్‌మన్‌దే. శ్రీలంకతో మూడో వన్డేలో సెంచరీతో రాణించిన గిల్‌.. కివీస్‌తో సూపర్‌ డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. 45, 124, 164 స్కోర్ల వద్ద మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన అతను.. చూడచక్కని షాట్లతో అలరించాడు. నొప్పి తెలియకుండా ఆపరేషన్‌ చేసినట్లు లాఘవంగా సిక్సర్లు బాదాడు. రోహిత్‌ (34; 38 బంతుల్లో 4×4, 2×6)తో కలిసి జట్టుకు శుభారంభం అందించిన గిల్‌..  కోహ్లి (8; 10 బంతుల్లో 1×4), ఇషాన్‌ కిషన్‌ (5) విఫలమైనా పరుగుల వేట ఆపలేదు. సూర్యకుమార్‌ యాదవ్‌ (31; 26 బంతుల్లో 4×4) అండతో స్కోరును 150 దాటించాడు. కొద్దిసేపటికే సాంట్నర్‌ బౌలింగ్‌లో షార్ట్‌ బంతిని పుల్‌ చేసి మిడ్‌ వికెట్‌లో సిక్సర్‌గా మలిచిన గిల్‌.. 99 పరుగుల స్కోరుకు చేరుకున్నాడు. ఆ వెంటనే లాంగాన్‌లో సింగిల్‌తో కేవలం 87 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్యతో నాలుగో వికెట్‌కు 65 పరుగులు జోడించిన గిల్‌.. హార్దిక్‌తో అయిదో వికెట్‌కు 74 పరుగులు జతచేశాడు. బ్రాస్‌వెల్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో 150 పరుగుల మైలురాయిని అందుకున్న శుభ్‌మన్‌.. అక్కడ్నుంచి ఒక్కసారిగా గేరు మార్చాడు. ఫోర్లు, సిక్సర్లతో కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫెర్గూసన్‌ 49వ ఓవర్లో అతను విశ్వరూపమే చూపించాడు. 182 పరుగులతో 49వ ఓవర్‌ను ఆరంభించిన గిల్‌.. వరుసగా మూడు సిక్సర్లతో డబుల్‌ సెంచరీ సాధించాడు. అతను చివరి ఓవర్లో ఔటయ్యాడు.
6 ఓవర్లలో నో సింగిల్‌: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా మొదట్లో ఆచితూచి ఆడింది. దీంతో తొలి 6 ఓవర్లలో భారత ఇన్నింగ్స్‌ (35/0)లో ఒక్క సింగిల్‌ కూడా రాలేదు. గిల్‌ 3 ఫోర్లు.. రోహిత్‌ 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది మొత్తంగా 32 పరుగులు రాబట్టగా.. వైడ్‌ల రూపంలో 3 పరుగులొచ్చాయి. 13వ ఓవర్లో రోహిత్‌ను ఔట్‌ చేసిన టిక్నర్‌ కివీస్‌కు తొలి వికెట్‌ అందించాడు. స్టేడియం హోరెత్తిపోతుండగా క్రీజులోకొచ్చిన కోహ్లి (8) అభిమానుల్ని నిరాశ పరిచాడు.


ఇంట కూడా రచ్చే..

హ్మద్‌ సిరాజ్‌.. కొన్నేళ్ల నుంచి టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న హైదరాబాదీ పేసర్‌. ఆస్ట్రేలియాలో చారిత్రక టెస్టు సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించడమే కాక, అనేక మ్యాచ్‌ల్లో సత్తా చాటిన సిరాజ్‌.. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. తాజాగా లంకతో వన్డే సిరీస్‌లో అతనెలా చెలరేగిపోయాడో తెలిసిందే. తిరువనంతపురంలో జరిగిన చివరి వన్డేలో అతడి పేస్‌ మెరుపులకు ముగ్ధులైపోయారు అభిమానులు. అయితే కొన్నేళ్ల నుంచి టీమ్‌ఇండియా తరఫున సత్తా చాటుతున్న సిరాజ్‌.. ఇప్పటిదాకా సొంతగడ్డపై ఒక్క వన్డే మ్యాచ్‌ కూడా ఆడలేదు. రచ్చ గెలిచి ఇంటికొచ్చిన అతడికి బుధవారం అదిరే ఆరంభం దక్కింది. ఉప్పల్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న అతను.. ఆఖర్లో ఓటమి భయంలో ఉన్న జట్టును గెలిపించాడు. చెలరేగి ఆడుతున్న శాంట్నర్‌తో పాటు షిప్లీని వరుస బంతుల్లో ఔట్‌ చేశాడు. అంతకుముందు ఇన్నింగ్స్‌ ఆరంభంలో కీలకమైన కాన్వే, ఆపై లేథమ్‌ వికెట్లనూ అతనే పడగొట్టాడు. సొంతగడ్డపై మ్యాచ్‌ను గెలిపించే ప్రదర్శన చేసిన సిరాజ్‌కు అభిమానులకు బ్రహ్మరథం పట్టారు.


భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) మిచెల్‌ (బి) టిక్నర్‌ 34; గిల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) షిప్లీ 208; కోహ్లి (బి) సాంట్నర్‌ 8; ఇషాన్‌ (సి) లేథమ్‌ (బి) ఫెర్గూసన్‌ 5; సూర్యకుమార్‌ (సి) సాంట్నర్‌ (బి) మిచెల్‌ 31; హార్దిక్‌ (బి) మిచెల్‌ 28; సుందర్‌ ఎల్బీ (బి) షిప్లీ 12; శార్దూల్‌ రనౌట్‌ 3; కుల్దీప్‌ నాటౌట్‌ 5; షమి నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 13

మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 349

వికెట్ల పతనం: 1-60, 2-88, 3-110, 4-175, 5-249, 6-292, 7-302, 8-345

బౌలింగ్‌: హెన్రీ షిప్లీ 9-0-74-2; ఫెర్గూసన్‌ 10-0-77-1; బ్లెయిర్‌ టిక్నర్‌ 10-0-69-1; మిచెల్‌ శాంట్నర్‌ 10-0-56-1; మైకెల్‌ బ్రాస్‌వెల్‌ 6-0-43-0; డరైల్‌ మిచెల్‌ 5-0-30-2

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: అలెన్‌ (సి) షాబాజ్‌ (బి) శార్దూల్‌ 40; కాన్వే (సి) కుల్‌దీప్‌ (బి) సిరాజ్‌ 10; నికోల్స్‌ (బి) కుల్‌దీప్‌ 18; మిచెల్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 9; లేథమ్‌ (సి) సుందర్‌ (బి) సిరాజ్‌ 24; ఫిలిప్స్‌ (బి) షమి 11; బ్రాస్‌వెల్‌ ఎల్బీ (బి) శార్దూల్‌ 140; శాంట్నర్‌ (సి) సూర్య (బి) సిరాజ్‌ 57; షిప్లీ (బి) సిరాజ్‌ 0; ఫెర్గూసన్‌ (సి) గిల్‌ (బి) హార్దిక్‌ 8; టిక్నర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 19

మొత్తం: (49.2  ఓవర్లలో ఆలౌట్‌) 337

వికెట్ల పతనం: 1-28, 2-70, 3-78, 4-89, 5-110, 6-131, 7-293, 8-294, 9-328

బౌలింగ్‌: షమి 10-1-69-1; సిరాజ్‌ 10-2-46-4; హార్దిక్‌ 7-0-70-1; కుల్‌దీప్‌ 8-1-43-2; శార్దూల్‌ 7.2-0-54-2; సుందర్‌ 7-0-50-0


హార్దిక్‌ ఔటెలా?

మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యను మూడో అంపైర్‌ ఔటివ్వడం చర్చనీయాంశమైంది. పేసర్‌ మిచెల్‌ వేసిన 40వ ఓవర్‌ నాలుగో బంతిని హార్దిక్‌ థర్ద్‌మన్‌ దిశగా ఆడాలనుకున్నాడు. బ్యాటుకు తాకని బంతి స్టంప్స్‌కు దగ్గరగా ఉన్న వికెట్‌ కీపర్‌ లేథమ్‌ చేతుల్లోకి వెళ్లింది. బెయిల్స్‌ గాల్లోకి లేవడంతో ఫీల్డ్‌ అంపైర్‌.. మూడో అంపైర్‌కు నివేదించాడు. బంతి వికెట్లను తాకలేదని, స్టంప్స్‌ కంటే ఎత్తులో వెళ్లిందని రీప్లేలో కనిపించింది. బంతి బ్యాటును కూడా తాకలేదని అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టమైంది. కానీ అనూహ్యంగా మూడో అంపైర్‌ ఔటని ప్రకటించాడు.


5

వన్డేల్లో ద్విశతకం సాధించిన అయిదో భారత బ్యాటర్‌ గిల్‌. రోహిత్‌ మూడు డబుల్‌ సెంచరీలు చేయగా.. సచిన్‌, సెహ్వాగ్‌, ఇషాన్‌ల ఒక్కో ద్విశతకం సాధించారు. మొత్తంగా ప్రపంచ క్రికెట్లో గిల్‌ స్థానం ఎనిమిది. క్రిస్‌గేల్‌, మార్టిన్‌ గప్తిల్‌, ఫఖర్‌ జమాన్‌ కూడా డబుల్‌ అందుకున్న వారిలో ఉన్నారు. 

* ఉప్పల్‌ స్టేడియంలో సచిన్‌ (175; ఆస్ట్రేలియాపై) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును గిల్‌ బద్దలు కొట్టాడు.


వేగంగా వెయ్యి

వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తిచేసిన మొదటి భారత బ్యాటర్‌గా గిల్‌ రికార్డు సృష్టించాడు. 19 ఇన్నింగ్స్‌ల్లో గిల్‌ ఈ ఘనత అందుకున్నాడు. గతంలో శిఖర్‌ ధావన్‌, కోహ్లి 24 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు సాధించారు. మొత్తంగా ఫఖర్‌ జమాన్‌ (18 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. గిల్‌, ఇమాముల్‌ హక్‌ (19 ఇన్నింగ్స్‌) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు.

* పిన్న వయసులో డబుల్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా శుభ్‌మన్‌(23ఏళ్ల 132 రోజులు) రికార్డు సాధించాడు. ఇషాన్‌ కిషన్‌(24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని